పాత టీడీపీ కార్యకర్తలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునేది లేదని అద్దంకిలోనే అమీతుమీకి సిద్ధపడతామని ఎమ్మెల్సీ కరణం బలరాం, ఆయన తనయుడు కరణం వెంకటేష్‌లు పదే పదే చెప్పే మాటలు అక్షరాలా నిజమయ్యాయి.
కరణమా..మజాకా!
Published Wed, Apr 5 2017 8:28 AM | Last Updated on Tue, Sep 5 2017 8:01 AM
► అద్దంకిలో హైడ్రామా
► కరణం, గొట్టిపాటిల మధ్య
► ఆగని అధిపత్య పోరు
► కరణం వర్గీయుల పింఛన్లను అడ్డుకున్న గొట్టిపాటి వర్గీయులు
► పింఛను దరఖాస్తులపై సంతకాలు పెట్టని ఎంపీడీఓ
► ఎంపీడీఓను నిలదీసి సంతకాలు చేయించిన బలరాం
► ఎంపీడీఓ కార్యాలయం వద్ద పోలీసుల బందోబస్తు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: పాత టీడీపీ కార్యకర్తలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునేది లేదని అద్దంకిలోనే అమీతుమీకి సిద్ధపడతామని ఎమ్మెల్సీ కరణం బలరాం, ఆయన తనయుడు కరణం వెంకటేష్‌లు పదే పదే చెప్పే మాటలు అక్షరాలా నిజమయ్యాయి. తన వర్గీయులకు అన్యాయం జరిగితే ఎవరినీ ఉపేక్షించేది లేదని, అవసరమైతే ఎమ్మెల్యే గొట్టిపాటితో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమని కరణం చెప్పకనే చెప్పారు.
మంగళవారం అద్దంకి ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన ఘటన ఇందుకు నిదర్శనంగా నిలిచింది. మరోవైపు అద్దంకి నియోజకవర్గంలో అన్ని అధికారాలు ఎమ్మెల్యే గొట్టిపాటికి అప్పగించారని ప్రచారం చేసుకుంటున్న ఆయన వర్గీయులను ఈ ఘటన ఉలికిపాటుకు గురి చేసింది. అద్దంకిలో అధిపత్య పోరు ఆగదని మరోమారు రుజువైంది.
వివరాలలోకెళితే....
తన వర్గీయులకు సంబంధించి 167 పింఛన్లను ఎందుకు మంజూరు చేయలేదంటూ ఎమ్మెల్సీ కరణం బలరామకృష్ణమూర్తి మంగళవారం అద్దంకి ఎంపీడీఓ హేమాద్రినాయుడును నిలదీశారు. మంగళవారం అద్దంకి ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకున్న ఎమ్మెల్సీ బలరాం తన వర్గీయులతో కలిసి ఎంపీడీఓ ఛాంబర్‌లోకి వెళ్లి కూర్చున్నారు. పింఛన్ల ఫైలుపై ఎందుకు సంతకాలు పెట్టలేదంటూ ఎంపీడీఓను నిలదీశారు. ఎమ్మెల్యే గొట్టిపాటి అనుచరుడు అయిన ఎంపీడీఓ ఏవో సాకులు చెప్పి వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు. ‘ఎక్కడికి కూర్చో..’ అంటూ బలరాం గట్టిగా గదమాయించారు. దీంతో ఎంపీడీఓ కుర్చీలోనే కూర్చోండిపోయాడు. ముందు తన వర్గీయుల పింఛన్ పేపర్లపై సంతకాలు పెట్టాలంటూ కరణం ఎంపీడీఓను ఆదేశించారు. దీంతో ఎంపీడీఓ హేమాద్రినాయుడు కరణం వర్గీయులకు చెందిన 167 పింఛన్లపై సంతకాలు చేశారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అద్దంకి ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన ఈ వ్యవహారం అద్దంకితో పాటు జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
కరణం బలరాం ఎంపీడీఓ కార్యాలయంలో ఉన్నాడని తెలుసుకున్న ఆయన వర్గీయులు, జన్మభూమి కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు. ఎంపీడీఓ ఎమ్మెల్యే గొట్టిపాటి వర్గీయులు కావడంతో అదే సమయంలో వారి ఛాంబర్‌లో కొందరు గొట్టిపాటి వర్గీయులు సైతం ఉన్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే సమయంలో అధికారులు తమకే మాత్రం పలకడం లేదని కరణం వర్గీయులు పలువురు ఫిర్యాదు చేశారు. అర్హులైన అందరి పనులు చేసి పెట్టాలని ఈ సందర్భంగా కరణం అధికారులను ఆదేశించారు. అనంతరం ఎంపీడీఓ సంతకాలు పెట్టిన పింఛన్ల ఫైలును తీసుకొని బలరాం అక్కడ నుంచి వెళ్లిపోయారు.
బలరాం ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకోవడం పెద్ద ఎత్తున ఆయన అనుచరులు సైతం అక్కడకే తరలివచ్చారు. కరణం అక్కడకు ఎందుకు వచ్చాడో తెలుసుకునేందుకు కార్యాలయానికి వచ్చిన స్థానిక సీఐ హైమారావు సాయంత్రం వరకు అక్కడే కూర్చున్నారు. ఎంపీపీ చాంబర్‌లో గొట్టిపాటి వర్గీయులు ఉండడం, ఎంపీడీవో చాంబర్‌లో బలరాం కూర్చుని ఉండడంతో, గత సంఘటనల దృష్ట్యా ఆవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా బయట ఎస్‌ఐలు, అబ్దుల్ రహమాన్, సంపత్‌కుమార్, పోలీసులు పరిస్థితిని పర్యవేక్షించారు. పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు నిర్వహించారు.
బలరాం వర్గీయుల పింఛన్లను అడ్డుకున్న ఎమ్మెల్యే వర్గీయులు..
అద్దంకి మండలంలో బలరాం వర్గీయులకు చెందిన 167 పింఛన్లను మంజూరు చేయకుండా ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ వర్గీయులు ఎంపీడీఓ హేమాద్రినాయుడుపై ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. మండల ఎంపీడీఓ గొట్టిపాటి వర్గీయుడు కావడంతో ఆ అధికారాన్ని అడ్డుపెట్టి వారు బలరాం వర్గీయుల పింఛన్లు మంజూరు కాకుండా చేసినట్లు సమాచారం. ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ అధికార పార్టీలో చేరిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు ద్వారా మంజూరు చేయించుకున్న 3 వేలకుపైగా పింఛన్లు పంపిణీ చేశారు.
దీంతో కరణం బలరాం అద్దంకి మండలానికి 167 పింఛన్లను జన్మభూమి కమిటీల ద్వారా లబ్ధిదారుల ఎంపిక చేయించారు. అయితే పింఛన్ల మంజూరుకు సంబంధించి ఎంపీడీఓ హేమాద్రినాయుడు సంతకాలు పెట్టాల్సి ఉండగా గొట్టిపాటి ఒత్తిడితో మూడు నెలలుగా సంతకాలు పెట్టలేదు. జన్మభూమి కమిటీ సభ్యులు కోరినా ఎంపీడీఓ ససేమిరా అన్నట్లు సమాచారం. దీంతో ఆగ్రహించిన కరణం బలరాం వర్గీయులు మంగళవారం ఉదయం మరోమారు బలరాంకు ఎంపీడీఓపై ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకొని హేమాద్రినాయుడుతో తమ వర్గీయుల పింఛను పేపర్లపై సంతకాలు పెట్టించారు.
ఫలించని బాబు ఎత్తుగడ..
అద్దంకిలో జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే టీడీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు సద్దుమణిగేలా కనిపించడం లేదు. సరికదా మరింత ముదురుతున్నట్లు కనిపిస్తోంది. నియోజకవర్గ బాధ్యతలు ఎమ్మెల్యేలకే అప్పగిస్తున్నామని, మిగిలిన నేతలు తలదూర్చవద్దని పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు ప్రకటనపై కరణం బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో కరణంకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం ద్వారా ఇరువర్గాల మధ్య సయోధ్య కుదర్చాలని భావించిన చంద్రబాబు కల నెరవేరదని స్పష్టమవుతోంది. మంగళవారం అద్దంకి ఎంపీడీవో కార్యాలయంలో చోటు చేసుకున్న సంఘటన జిల్లాలో అధికార పార్టీ శ్రేణులను అవాక్కయ్యేలా చేసింది.
Advertisement
Advertisement