శివశివా.. ఏమిటీ విరాళాల గోల | The noise contributions | Sakshi
Sakshi News home page

శివశివా.. ఏమిటీ విరాళాల గోల

Published Wed, Aug 13 2014 1:27 AM | Last Updated on Sat, Sep 2 2017 11:47 AM

శివశివా.. ఏమిటీ  విరాళాల గోల

శివశివా.. ఏమిటీ విరాళాల గోల

శ్రీకాళహస్తి : విరాళాలు పెంచి ఆలయాభివృద్ధికి తోడ్పడాల్సిందే. అయితే శ్రీకాళహస్తిలో ఓ వైపు భోజనం చేస్తుండగానే మరోవైపు ఆలయ సిబ్బంది విరాళాల పేరుతో బలవంతపు వసూళ్లు చేస్తున్నారు. ఎడమ చేత్తో విరాళాలు ఇవ్వలేక, భోజనం చేస్తున్న చేతితో ఇవ్వడం ఇష్టంలేక భక్తులు కుమిలిపోతున్నారు. విరాళాలు ఇస్తేనే మంచి జరుగుతుందంటూ సిబ్బంది చెబుతుండడంతో భక్తులు కాదనలేక పోతున్నారు. విరాళాలు అందజేసిన వారికి రసీదులు కూడా ఇవ్వడం లేదు. పుస్తకంలో పేర్లు నమోదు చేశామంటూ పంపేస్తున్నారు. సగం పేర్లు మాత్రమే పుస్తకంలో రాసి మిగిలిన మొత్తాన్ని నొక్కేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పెద్దఎత్తున విరాళాలు వసూలు చేస్తేనే మీ ఉద్యోగాలకు భద్రత ఉంటుందని ఉన్నతాధికారులు సిబ్బందిని హెచ్చరించినట్టు సమాచారం. ఈ విషయాన్ని భక్తుల వద్ద సిబ్బంది బాహాటంగానే చెబుతున్నట్టు తెలిసింది.

అన్నదాన నిర్వహణ ఇలా..

శివయ్య సన్నిధిలో నిర్వహిస్తున్న అన్నదానం మహాప్రసాదంగా భావించి భక్తులు గంటలకొద్దీ టికెట్ల కోసం క్యూలో ఉంటున్నారు.  అన్నదానం పథకానికి ఇప్పటి వరకు 41 వేల మందికి పైగా రూ.7.18 కోట్లు విరాళాలుగా అందజేశారు. దీనిపై 9శాతం వడ్డీ కూడా వస్తుండడంతో అన్నదాన పథకానికి ఏ ఢోకాలేదు. గతంలో ఆది, సోమవారాల్లో 800 మందికి, మిగిలిన వారాల్లో 400 మందికి భోజన వసతులు కల్పించారు. మూడు నెలలుగా శుక్ర, శని, ఆది, సోమవారాల్లో 1000 మందికి, మంగళ, బుధ, గురువారాల్లో 800 మంది భక్తులకు అన్నదానం చేస్తున్నారు. గణాంకాల్లో చూపుతున్న విధంగా సగం మంది భక్తులకు కూడా ఈ పథకం కింద భోజన వసతి కల్పించడం లేదనే  విమర్శలు ఉన్నాయి. భక్తులకు అందాల్సిన అన్నదానం కూపన్లను స్థానికులు కొందరు కాజేస్తున్నారు. దీంతో కొన్ని సమయాల్లో నిజమైన భక్తులకు కూపన్లు అందడం లేదు. అధికారులు తగిన శ్రద్ధ తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. నిత్యాన్నదాన పథకం కింద ఏ విరాళ దాతల సహకారంతో భోజన వసతి ఏర్పాటు చేస్తున్నది బోర్డులో రోజువారీగా నమోదు చేయాల్సి ఉంది. అయితే అధికారులు ఈ విధానానికి స్వస్తి పలికారు.  ఇదిలా ఉండగా అన్నదాన మండపంలో భోజనం చేసిన భక్తులు వారి పళ్లెంను వారే తీసుకెళ్లే పద్దతిని ఈవో రహస్యంగా ప్రవేశపెట్టారు. మీడియాకు కూడా ఈ విషయాన్ని తెలియజేయలేదు. దీంతో వృద్ధులు, పిల్లలు, లగేజీతో వచ్చే భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.
 
బలవంతంగా వసూళ్లు


ఆలయంలో అన్నదానం చేస్తుండడంతో భక్తులు మహాప్రసాదంగా భావించి భోజనం చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే ఓ చేతితో భోజనం చేస్తుంటే మరో చేతితో విరాళాలు ఇవ్వాలంటూ బలవంతంగా వసూళ్లు చేయడం మంచి పద్దతి కాదు. ఇవ్వాలనుకుంటే అన్నదాన మండపంలోని హుండీలో వేస్తాం.
- మారెమ్మ, చీరాల
 
మూడుచోట్ల వసూళ్లు

భోజనం చేస్తుంటే పుస్తకంలో పేరు రాసుకున్నాం విరాళాలు ఇవ్వాలంటూ బలవంతం చేస్తున్నారు. భోజనం అయిన తర్వాత మండపంలోని హుండీలో విరాళాలు వేయాలంటూ గోల. మళ్లీ మండపం వరండాల్లో ఓ కౌంటర్ ఏర్పాటు చేసి విరాళాలు ఇవ్వాలంటూ శబ్ధాలు చేస్తున్నారు. అభిమానం ఉండేవాళ్లు హుండీలో విరాళాలు వేస్తారు. ఇదేం విడ్డూరమో తెలియడం లేదు.
- సుగుణమ్మ, కావలి
 
 రూ.10,116 ఇస్తే రసీదులు ఇస్తున్నాం

 విరాళంగా రూ.10,116లు ఇచ్చేవారికి రసీదులు ఇస్తున్నాం. ఉద్యోగ భద్రత, బలవంతపు వసూళ్లు అనేదానిలో వాస్తవం లేదు. నెలకు రూ.18 వేలు మాత్రమే అన్నదానం హుండీల ద్వారా విరాళ ఆదాయం వచ్చేది. దాన్ని రూ.3.4 లక్షలకు పెంచడం జరిగింది. ఆలయాభివృద్ధి కోసమే విరాళాలు వసూళ్లు చేస్తున్నాం. శిరిడీ సాయిబాబా ఆలయంలో వలే శ్రీకాళహస్తిలోనూ భోజనం తర్వాత వారే పళ్లెం తీసుకుపోవాల్సి ఉంది. కొత్తగా ప్రవేశపెట్టాం. ఇందులో రహస్యమేమీ లేదు.
 - శ్రీనివాసరావు, ఆలయ ఈవో
 
12ఎస్‌కెహెచ్‌టీ02: భోజనం చేస్తున్న సమయంలో వసూలు చేస్తున్న విరాళం
12ఎస్‌కెహెచ్‌టీ04: భోజనం తర్వాత విరాళ హుండీ వసూళ్లు
12ఎస్‌కెహెచ్‌టీ05: మారెమ్మ
12ఎస్‌కెహెచ్‌టీ06: సుగుణమ్మ
12ఎస్‌కెహెచ్‌టీ07: ఈవో, శ్రీనివాసరావు
12ఎస్‌కెహెచ్‌టీ09: అన్నదానం టిక్కెట్లు కోసం క్యూకట్టిన భక్తులు
12ఎస్‌కెహెచ్‌టీ11: భోజనం తర్వాత పళ్లెం తీసుకెళుతున్న భక్తులు  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement