నగర శివారులోని ఆరు గ్రామాల్లో నిత్యం పేకాట
వారానికో స్థావరం మారుస్తున్న నిర్వాహకులు
రామవరప్పాడు పొలాల్లో నిత్యం రూ.50 లక్షలపైనే ఆట
చోటా టీడీపీ నేతలే నిర్వాహకులు
విజయవాడ : విజయవాడ నగర శివారు పేకాట శిబిరాలకు అడ్డాగా మారింది. మొబైల్ పేకాట కేంద్రాలు తెరిచి రోజుకోచోట, వారానికో ఇంట్లో భారీ శిబిరాలు నిర్వహిస్తున్నారు. నిర్వాహకులు, పేకాట రాయుళ్లు అత్యధిక శాతం మంది అధికార పార్టీకి చెందినవారే ఉండటంతో పేకాట దందా యథేచ్ఛగా సాగుతోంది. ముఖ్యంగా విజయవాడ నగర శివారులోని ఆరు గ్రామాలు పేకాట కేంద్రాలుగా మారిపోయాయి. ఇక్కడ కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. పూర్తిగా అధికార పార్టీ నేతల కనుసన్నల్లో దందా సాగుతుండటం గమనార్హం. నిర్వాహకుల వివరాలు చిరునామాలు సహా తెలిసినా కమిషనరేట్ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు మాత్రం స్పందించటం లేదు.
రాత్రివేళల్లో నిర్వహణ...
రామవరప్పాడు, నిడమానూరు, గోశాల, గొడవర్రు, వణుకూరు, ఆగిరిపల్లి, గన్నవరం ప్రాంతాల్లో శిబిరాల నిర్వహణ భారీగా సాగుతోంది. ముఖ్యంగా రామవరప్పాడు, గుణదల సమీపంలో ఉన్న రైల్వే ట్రాక్, సమీపంలో ఉన్న పొలాల్లో ఎక్కువగా నిర్వహిస్తున్నారు. రూ.10 వేల నుంచి రూ.2 లక్షల వరకు రమ్మీ ఆట నిర్వహిస్తూ రోజుకు రూ.50 లక్షలకు పైగానే ఆట సాగిస్తున్నారు. వర్షం పడిన రోజు మినహా మిగిలిన అన్ని రోజుల్లో సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు, మళ్లీ 12 నుంచి ఉదయం 6 గంటల వరకు శిబిరాలు కొనసాగుతున్నాయి. విజయవాడ నగరంలోని పేకాట శిబిరాల్లో టాస్క్‌ఫోర్స్ దాడులు తరచూ జరుగుతున్న క్రమంలో శివారు గ్రామాల్లో నిర్వాహకులు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. తాడిగడపకు చెందిన పేకాట శ్రీను, గొడవర్రు, గోశాల, వణుకూరు గ్రామాలకు చెందిన పేకాట నిర్వాహకులు మొబైల్ స్థావరాలకు తెరతీశారు. నిర్వాహకులందరూ అధికార పార్టీకి చెందిన గ్రామస్థాయి ప్రజాప్రతినిధులు కావడంతో చుట్టుపక్కల గ్రామాల్లో రోజుకోచోట శిబిరం ఏర్పాటు చేస్తున్నారు. కనీసం వారానికి ఒక ఇంట్లో ఏర్పాటు చేసి శిబిరాలను కొనసాగిస్తున్నారు. పేకాటకు వచ్చేవారి ఫోన్ నంబర్లన్నీ ముందుగా సేకరించి పేకాట నిర్వహించే స్థావరం, చిరునామాను మెసేజ్ ద్వారా లేక ఫోన్ చేసి సమాచారం అందిస్తారు. దీంతో పేకాట రాయుళ్లు నేరుగా శిబిరానికి వెళుతున్నారు. రెండు రోజుల క్రితం గురునానక్ కాలనీలో భారీ పేకాట శిబిరాన్ని పోలీసులు పట్టుకున్నారు.
శివారు గ్రామాలకు చెందిన నిర్వాహకులు వారం రోజుల కోసం గురునానక్ కాలనీలో శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పోలీసుల దాడిలో రూ.7.50 లక్షల వరకు నగదు, రాష్ట్ర ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు కాసరనేని మురళితో పాటు మరికొందరిని అరెస్టు చేశారు. రెండు నెలల క్రితం కూడా ఇదే తరహాలో భారీ పేకాట శిబిరాలను పోలీసులు గుర్తించి నిందితులను అరెస్టు చేసిన క్రమంలో తాడిగడపకు చెందిన ఎంపీటీసీ, విజయవాడ నగరానికి చెందిన కార్పొరేటర్ ఒకరు పేకాట ఆడుతూ పోలీసులకు దొరికిపోయారు. ఇదే తరహాలో గతంలో అనేక మంది పట్టుబడ్డా శిబిరాలు మాత్రం ఆగడం లేదు. పోలీసులు కూడా పేకాట నిర్వాహకులపై కా కుండా పేకాటరాయుళ్లను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహిస్తున్నారు.
ఎస్‌బీ పోలీసులకు అన్నీ తెలిసినా...
కమిషనరేట్‌లోని స్పెషల్ బ్రాంచ్ పోలీసులకు పేకాట నిర్వాహకుల గురించి సమాచారం ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో పట్టించుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి. అధికార పార్టీ నేతల కనుసన్నల్లో పేకాట శిబిరాలు సాగుతుండటంతో పోలీసులు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. నిర్వాహకులు రోజుకు సగటున రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల చొప్పున సంపాదిస్తూ స్థానిక స్టేషన్‌లలో నెలవారీ కూడా చెల్లిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వివిధ ఆరోపణలపై గతంలో కమిషనరేట్ పరిధిలోని సీఐలను పెద్ద సంఖ్యలో కమిషనర్ బదిలీ చేశారు. బదిలీ అయిన వారిలో పలువురు పేకాట నిర్వాహకుల నుంచి మామూళ్లు తీసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో పోలీసులు కూడా నిర్వాహకులను ప్రతిసారీ తప్పించి పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. సీపీకి ఫిర్యాదు వచ్చి స్పందిస్తేకానీ పోలీసులు పూర్తిస్థాయిలో స్పందించని పరిస్థితి నెలకొంది.