జన్మభూమి కార్యక్రమాన్ని బహిష్కరించి మార్గమధ్యలోనే అధికారులను అడ్డుకోవడంతో సోమవారం సొవ్వా పంచాయతీలో...
గంటలకు పైగా అధికారులను అడ్డగించిన వైస్సార్ సీపీ నాయకులు
కాజ్‌వే నిర్మాణం చేపట్టాలని డిమాండ్
రాత పూర్వక హామీతో శాంతించిన ఆందోళనకారులు
సొవ్వాలో ఆగిపోయిన జన్మభూమి సభ
డుంబ్రిగుడ: జన్మభూమి కార్యక్రమాన్ని బహిష్కరించి మార్గమధ్యలోనే అధికారులను అడ్డుకోవడంతో సోమవారం సొవ్వా పంచాయతీలో జరగవలసిన సభ నిలిచిపోయింది. సొవ్వా పంచాయతీ కేంద్రంలో మూడో రోజు జన్మభూమి-మా ఊరు కార్యక్రమాన్ని నిర్వహించేందుకు మండల స్థాయి అధికారులు వెళుతుండగా ఉదయం 10.30 సమయంలో మార్గమధ్యలోనే నాయకులు ఆపేశారు. పంచాయతీ కేంద్రానికి సుమారు 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న టిక్కిలిబెడ్డ గ్రామ సమీపంలో వైఎస్సార్ సీపీకి చెందిన ఎంపీపీ జమున, వైస్ ఎంపీపీ కూడా పాపారావు, ఎంపీటీసీ సభ్యుడు గుంట డేవిడ్, సర్పంచ్ సుమిత్ర, వైఎస్సార్ సీపీ నాయకులు వెంకటరావు, రాంప్రసాద్, సీపీఎం నాయకుడు సూర్యనారాయణ ఆధ్వర్యంలో జన్మభూమి బృందాన్ని అడ్డుకున్నారు. హుద్‌హుద్ కారణంగా సొవ్వా వద్ద సుమారు 30 గిరిజన గ్రామలకు ఉపయోగపడే రహదారిలో ఉన్న కాజ్‌వే పూర్తిగా కొట్టుకుపోయినా అధికారులు పట్టించుకోకుండా జన్మభూమి పేరుతో గ్రామాల్లో సందర్శించడం సరికాదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఈ పంచాయతీ గిరిజనులు ఎంతో మంది వేలాది ఎకరాల్లో కూరగాయలు పండిస్తూ వాటిని ప్రతి వారం విశాఖ, అరకు, తుని, రాజమం డ్రి వంటి ప్రాంతాల్లో విక్రయానికి తీసుకెళుతుంటారని చెప్పారు. కాజ్‌వే లేకపోవడంతో గిరిజన రైతులు ఇబ్బందులు పడుతున్నారని, దీనిపై అధికారులకు అనేక సార్లు ఫిర్యాదులు చేసినా స్పందించ లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పుడు జన్మభూమి పేరుతో అధికారులు వచ్చి తూతూమంత్రంగా సభ నిర్వహించి వెళతారని, సమస్యలు అలాగే ఉంటాయని ధ్వజమెత్తారు. సుమారు మధ్యహం 3 గంటల వరకు విడిచి పెట్టాకుండా నిలదీశారు. దీంతో మండల ప్రత్యేక అధికారి జె.భాగ్యలక్ష్మి, ఎంపీడీవో విజయలక్ష్మి పైఅధికారులతో మాట్లాడి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని లిఖిత పూర్వకంగా హామీపత్రం ఇవ్వడంతో శాంతించి విడిచిపెట్టారు. దీంతో సభ నిర్వహించేందుకు సమయం లేకపోవడంతో అధికారులు వెనుతిరిగారు. జన్మభూమి బృందంలో ఆర్‌డబ్ల్యూ జేఈ రాజేష్, పారెస్టు అధికారి రాజ్‌గోపాల్, టీడబ్ల్యూ జేఈ సిమన్న, ఏవో అనాసూయ, రెవెన్యూ ఆర్‌ఐ సాయిబాబా, హౌసింగ్ ఏఈ రాజబాబు తదితరులు ఉన్నారు.