- మే 12న మున్సిపల్, 13న జెడ్పీ, 16న అసెంబ్లీ ఫలితాలు
- వైఎస్సార్‌సీపీ విజయబావుటా ఖాయం
- ఫలితాల కోసం అభ్యర్థులు, పార్టీల ఎదురుచూపులు
సాక్షి, విశాఖపట్నం: అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. మిగిలింది ఫలితాల ప్రకటనే కావడంతో అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొన్ని వారాలుగా చేస్తున్న పార్టీల ప్రచార పోరాటం ఎటువంటి ఫలితాలు ఇస్తుందోనని ప్రజల్లో అంచనాలు పెరుగుతున్నాయి. బుధవారం నాటి ఎన్నికల సరళిని పరిశీలిస్తే వైఎస్సార్‌సీపీ విజయబావుటా ఖాయమని స్పష్టంగా తేలిపోయింది. దీంతో పార్టీ శ్రేణుల్లో సంబరాలు మిన్నంటాయి.
సార్వత్రిక ఎన్నికల ఫలితాలకంటే ముందు మున్సిపల్, జెడ్పీ ఎన్నికల ఫలితాల ప్రకటన ఉండడంతో ఇప్పుడు అందరి దృష్టి మళ్లీ వీటిపైనే పడింది. వీటికి ఎన్నికలు జరిగి చాలా రోజులు కావడంతో ఆయా అభ్యర్థులు ఎప్పుడెప్పుడా అని ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇన్నాళ్లు అధికారులు, అభ్యర్థులు, పార్టీలు అసెంబ్లీ ఎన్నికల హడావుడిలో ఉండిపోవడంతో వీటి సంగతి పక్కనపడిపోయింది. తీరా ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో తిరిగి జిల్లా అంతటా మున్సిపల్, జెడ్పీ ఫలితాలు ఎలా ఉండబోతాయనే దానిపై చర్చలు జరుగుతున్నాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయం స్పష్టమైనట్లే జిల్లాలో నర్సీపట్నం, యలమంచిలి మున్సిపాలిటీల్లోనూ వైఎస్సార్‌సీపీ గెలుపు జెండా ఎగురవేస్తుందని అంతా విశ్లేషిస్తున్నారు. అటు 39 జెడ్పీ, 652 ఎంపీటీసీ స్థానాల్లోనూ ఫ్యాన్‌హోరు తప్పదని అంతా చెబుతున్నారు. మిగిలిన పార్టీలు సైతం ఫ్యాన్‌జోరుతో విజయంపై ఆశలు దాదాపుగా వదిలేసుకున్నారు. మరోపక్క అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో కలెక్టర్, రెవెన్యూ అధికారులు ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు.
ఆయా కౌంటింగ్ కేంద్రాల వద్ద గురువారం నుంచి మళ్లీ సిబ్బందిని పెంచుతున్నారు. ప్రస్తుతం పోలింగ్ నిర్వహించిన సిబ్బంది నుంచి తిరిగి కొందరిని ఓట్ల లెక్కింపునకు వినియోగించడానికి ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు. సుమారు రెండున్నర నెలల కాలంలో జిల్లాలో మున్సిపల్, జెడ్పీ ఎన్నికలు, ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు వరుసగా జరిగాయి.
కానీ ఫలితాల ప్రకటన వాయిదాపడడంతో పార్టీలు, అభ్యర్థుల హడావుడిగా పెద్దగా కని పించలేదు. ఇప్పుడు ఈనెల 12న మున్సిపల్, 13న జెడ్పీ ఫలితాలు ఆ రెండు రోజుల వ్యవధి తర్వాత అసెంబ్లీ ఫలితాలు వెల్లడికానుండడంతో జిల్లా అంతటా వచ్చేవారం అంతా పూర్తిస్థాయిలో సందడి నెలకొనబోతోంది. అసలుసిసలు రాజకీయ మజాను చూపించబోతోంది.