
గుం‘టూరు’లో నరకం
అధ్వానంగా మారిన రహదారులు
ఆక్రమణలతో మూసుకుపోయిన వీధులు
ఎక్కడికక్కడ నిలిచిపోతున్న వాహనాలు
కనీసం నడిచేందుకూ అవస్థలే
అధికారుల పర్యవేక్షణలేమి ఫలితం ఇది
నరకం ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు గానీ... గుంటూరు నగరంలో నివసించే సగటుజీవికి మాత్రం కళ్లకు కట్టినట్టు కనిపిస్తోంది. నిత్యం ట్రాఫిక్ సమస్యతో నగరవాసులు నరకయాతన అనుభవిస్తున్నారు. కొన్ని రోజులుగా పెరిగిపోయిన వాహనాల రద్దీ, ఏ వీధిలో చూసినా తవ్వి వదిలేసిన డ్రెయిన్లు, అధ్వానంగా మారిన అంతర్గత రహదారులతో విలవిల్లాడిపోతున్నారు. కనీసం నడిచేందుకు వీలులేని విధంగా పరిస్థితి. సరైన ప్రణాళిక, అధికారుల పర్యవేక్షణలేమి కారణంగానే గుం‘టూరు’ నరకం చూపుతోంది.
అరండల్‌పేట (గుంటూరు) : నగరంలో ప్రస్తుత రహదారులు అధ్వానంగా ఉన్నాయి. ఆక్రమణలతో ప్రధాన రోడ్లతో పాటు వీధులూ మూసుకు పోయాయి. దీని వల్ల ట్రాఫిక్ సమస్య జఠిలమైపోయింది. ఏ సెంటర్‌లో చూసినా వందల సంఖ్యలో వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోంది. నరసరావుపేట, పిడుగురాళ్ల, చిలకలూరిపేట, పొన్నూరు, తెనాలి, బాపట్ల తదితర ప్రాంతాల నుంచి నగరంలోకి ప్రవేశిస్తున్న వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. నగరం ప్రజలతో పాటు బయట నుంచి వచ్చే వారూ గుంటూరులో నెలకొన్న పరిస్థితులను చూసి బెంబేలెత్తుతున్నారు.
మరమ్మతులన్నీ ఒకేసారి..
నగరంలోని అన్ని ప్రధాన రహదారులకు మరమ్మతులు ఒకేసారి చేపట్టడం పెద్ద సమస్యగా మారింది. చిలకలూరిపేట,నరసరావుపేట, పిడుగురాళ్ల తదితర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలన్నింటికీ కలిపి నగర ప్రవేశం కోసం ఒకే ఒక్క చిన్న రహదారి దిక్కైంది. తెనాలి, బాపట్ల, పొన్నూరు, చీరాల, నిజాంపట్నం తదితర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలన్నింటికీ కూడా గుంటూరు ప్రవేశానికి మానసరోవరం రోడ్డు మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉంది. సాగుతున్న రోడ్డు నిర్మాణం, మరమ్మతు పనులే ఈ దుస్థితికి కారణం. ఫలితంగా ఎక్కడికక్కడ గంటల తరబడి ట్రాఫిక్ ఆగిపోవాల్సి వస్తోంది.
ఈ మార్గాల్లోనే ఇక్కట్లు...
పొన్నూరు రోడ్డు పూర్తిగా ధ్వంసమైపోయింది. కొత్త రహదారి నిర్మాణం కోసం దాన్ని వన్‌వేగామార్చారు. తెనాలి, బాప ట్ల ప్రాంతాల నుంచి గుంటూరు వస్తున్న వాహనాలను ైబె పాస్ నుంచి మానస సరోవరం మీదుగా దారి మళ్లించారు.
తెనాలి, బాపట్ల, నిజాంపట్నం, చీరాల తదితర ప్రాంతాల వాహనాలు మొత్తం మానస సరోవరం రోడ్డు ద్వారానే రాకపోకలు సాగిస్తుండటంతో ఆ మార్గం నిత్యం ట్రాఫిక్ మయమవుతోంది. అసలే అది గుంతల రోడ్డు. ఇప్పుడు మరింత అధ్వానంగా మారిపోయింది. బైపాస్ నుంచి ఎన్టీఆర్ బస్టాండ్‌కు రావడానికి ఒక్కో వాహనానికి అరగంట సమయం పడుతోంది.
ప్రత్తిపాడు నుంచి వచ్చే వాహనాలకు కూడా బైపాస్ వద్ద బ్రేక్ పడుతోంది. వంతెన నిర్మాణ పనులు చేపట్టడంతో ఆ వాహనాలు కేవీపీ కాలనీ మీదుగా చుట్టుగుంట, కలెక్టరేట్ మీదుగా మార్కెట్ వైపునకు రావాల్సిన దుర్భర స్థితి నెలకొంది.
గుంటూరు నుంచి బైపాస్ వైపునకు వెళ్లే ప్రతి రహదారి గుంతలమయమైపోయింది. ప్రస్తుత వర్షాలకు రోడ్లన్నీ చెరువుల్లా మారాయి. నగరంలో ఏ ప్రధాన రహదారిపై చూసినా గుంతలు, రోడ్డు పనులు చేస్తున్నారు. మూడు నెలల నుంచి ఇదే పరిస్థితి.
జిల్లా కోర్టు, లక్ష్మీపురం రోడ్డు పొడువునా, బృందావన్‌గార్డెన్స్ సెంటర్, మెడికల్ క్లబ్, నాజ్‌సెంటర్, కొత్తపేట శివాలయం, విద్యానగర్ రెండో లైన్, గెస్ట్‌హౌస్, జేకేసీ కాలేజ్ రోడ్డు.. ఇలా దాదాపు అన్ని ప్రధాన కూడళ్లు, సెంటర్‌లలో పెద్ద పెద్ద గోతులు తవ్వి ఉన్నాయి.