ఒకే జాతి.. ఒకే రాష్ట్రం | The same species .. The same State | Sakshi
Sakshi News home page

ఒకే జాతి.. ఒకే రాష్ట్రం

Published Sat, Aug 24 2013 2:40 AM | Last Updated on Fri, Sep 1 2017 10:03 PM

The same species .. The same State

 సాక్షి, తిరుపతి:  సమైక్యాంధ్ర కోసం ఊరూరా ఉద్యమాలు కొనసాగుతున్నాయి. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు విభజనకు నిరసనగా ఆందోళనలు తీవ్రతరం చేశారు. చిత్తూరు ఎమ్మెల్యే సీకేబాబు మహాపాదయాత్ర శుక్రవారం రాత్రి తిరుమలకు చేరుకుంది. తిరుపతి కార్పొరేషన్ కార్యాలయం వద్ద మున్సిపల్ ఉద్యోగ సంఘాల జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎల్.వర్మ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో సీకే బాబు పాల్గొని ప్రసంగించారు. చిత్తూరులో జిల్లా ఉన్నతాధికారులు వెయ్యి మోటార్ బైక్‌లపై భారీ ర్యాలీ నిర్వహించారు.

ట్రాన్స్‌కో ఉద్యోగులు రాస్తారోకో చేసి, మానవహారం నిర్వహించారు. వైఎస్సార్ సీపీ ఉపాధ్యాయ సంఘం నాయకులు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు ఏఎస్ మనోహర్ దీక్షకు సంఘీభావం తెలిపారు. సీమాంధ్ర న్యాయశాఖ ఉద్యోగుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపీనాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగులు రిలేదీక్షలు చేస్తే గుమాస్తాలు వంటావార్పు నిర్వహించారు. న్యాయవాదులు, కోర్టు సిబ్బంది కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు.
 
చెవిలో పూలు పెట్టకండి
 చిత్తూరులో ఆర్టీసీ ఉద్యోగ, కార్మికులు చెవిలో పూలతో నిరసన తెలిపారు. పుంగనూరులో ఉపాధ్యాయులు, అన్ని శాఖల ఉద్యోగులు చెవి లో పూలు పెట్టుకుని జాతీయ రహదారిపై వెనక్కు నడిచారు. అనంతరం రోడ్డుపై పడుకుని నిరసన తెలియజేశారు. కోర్టు సిబ్బంది, న్యాయవాదులు కలసి రోడ్డుపై వంటావార్పు చేశారు. చంద్రగిరిలో 36 గంటలపాటు బంద్ కొనసాగింది. జాతీయ రహదారిలో 7 గంటల పాటు రాకపోకలను అడ్డుకున్నారు. పూతలపట్టులో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించారు. పీలేరులో 17వ రోజు రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు భారీ ర్యాలీ నిర్వహించారు.
 
ఆటోలతో భారీ ర్యాలీ
 పుత్తూరులో మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో 600 ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఉపాధ్యాయ, ఏపీ ఎన్‌జీవో, ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో అంబేద్కర్ కూడలిలో రిలే దీక్షలు చేశారు. వైఎస్సార్ సీపీ నేత, హిమజ విద్యాసంస్థల చైర్మన్ సురేందర్‌రాజు ఆధ్వర్యంలో పిరమిడ్ విన్యాసాలతో వినూత్న నిరసన తెలిపారు. నగరిలో ఇందిర ఆమరణ నిరాహారదీక్ష కొనసాగుతోంది. శ్రీకాళహస్తిలో ప్రైవేటు విద్యాసంస్థల విద్యార్థులు భారీ ర్యాలీ, వంటావార్పు చేపట్టి మానవహారం నిర్వహించారు.

మదనపల్లెలో జేఏసీ, మిట్స్ కళాశాల ఆధ్వర్యంలో హంద్రీ-నీవా కాలువలో పడుకుని నిరసన తెలిపారు. పలమనేరులో వైఎస్సార్ సీపీ, టీడీపీ, కాంగ్రెస్ నేతల దీక్షలు కొనసాగుతున్నాయి. తంబళ్లపల్లె నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లో ర్యాలీలు, రాస్తారోకోలు, మానవహారాలు నిర్వహిం చారు. జీడీనెల్లూరు పరిధిలోని అన్ని మండలాల్లో జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు భారీ ర్యాలీ నిర్వహించారు. వైద్య సిబ్బంది రోడ్డుపైనే వైద్యసేవలందించారు. విద్యార్థులు రోడ్డుపైనే పాఠాలు చదువుతూ నిరసన తెలిపారు.
 
వైఎస్.విజయమ్మ దీక్షకు మద్దతుగా..
 తిరుపతిలో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆధ్వర్యంలో రిలేదీక్షలు కొనసాగాయి. చిత్తూరులో ఏఎస్.మనోహర్ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే దీక్షలకు వైఎస్సార్ సీపీ టీచర్స్ ఫెడరేషన్ మద్దతు పలికింది. వివిధ కళాశాలల విద్యార్థులు సంఘీభావం తెలిపారు. పీలేరు మండలం గూడరేవుపల్లెలో విజయమ్మ దీక్షకు సంఘీభావంగా రోడ్డుపై వంటావార్పు నిర్వహించి సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలతో శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. పుంగనూరులో విజయమ్మ దీక్షకు మద్దతుగా ఐదో రోజు రిలేదీక్షలు కొనసాగించారు. పీటీఎంలో రిలీ దీక్షలు ప్రారంభం కాగా, శాంతిపురం మండలంలో కొనసాగుతున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement