ఆరేళ్లకే ఇంటిదీపం ఆరిపోయింది!
- రెండో తరగతి విద్యార్థిని దుర్మరణం
- జీవీఎంసీ ట్రాక్టర్ ఢీకొని ప్రమాదం
- కడుపుకోతతో తల్లడిల్లుతున్న కుటుంబం
అనకాపల్లి రూరల్: ‘సాటర్‌డే హాఫ్‌డే అమ్మా... ఈరోజు స్కూల్‌కు వెళ్లను...’ అంటూ చిట్టిపొట్టి మాటలతో ఆ చిన్నారి మారాం చేసింది. అయితే కన్నకూతురుకు బాగా చదివించుకోవాలనే ఆకాంక్ష ఉన్న ఆమె అమ్మ మనసు మాత్రం అందుకు అంగీకరించలేదు. ‘ఈ రోజు సాటర్‌డే స్కూల్‌కు వెళ్తే రేపు సండే సెలవే కదమ్మా... నీకు నచ్చింది కొంటా’నంటూ నచ్చచెప్పింది. చివరకు ఎలాగో ఆ చిన్నారి ఇంటి నుంచి స్కూల్‌కు బయల్దేరి వెళ్లిందో లేదో అంతలోనే ‘పాపను ట్రాక్టర్ గుద్దేసింది...’ అన్న వార్త ఆ తల్లి చెవిన పడింది. ఆమెకు గుండె ఆగినంత పనైంది. పరుగున వెళ్లి చూస్తే... తన కూతురే. విగతజీవిగా పడిఉంది. నున్నగా దువ్వి పంపిన తల ట్రాక్టర్ చక్రం కింద చిద్రమైంది.
యూనిఫాం రక్తసిక్తమైంది. ‘అల్లారుముద్దుగా, ప్రాణానికి ప్రాణంగా పెంచుతున్న తమ బిడ్డను అప్పుడే ఎందుకు తీసుకుపోయావు దేవుడా...’ అంటూ ఆ తల్లి కన్నీరుమున్నీరవుతుంటే... చూసినవారి కంట నీరు ఆగలేదు. ఈ దుర్ఘటన శనివారం అనకాపల్లిలోని పార్కుసెంటర్ సమీపంలో చోటుచేసుకుంది. వెల్డర్‌గా పనిచేస్తున్న పాలవలస శ్రీనివాసరావు, లక్ష్మి దంపతుల కుమార్తె కల్యాణి (6) మున్సిపాలిటీ ట్రాక్టర్ కింద పడి ప్రాణాలు కోల్పోయింది. ట్రాక్టర్ తొట్టి కొక్కెం బ్యాగుకు తగలడంతో ఆ చిన్నారి తూలిపడింది. వెనుక చక్రం ఎక్కేయడంతో ఆమె తల చిద్రమైంది. తీవ్ర గాయమైన ఆ చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
గవరపాలెం సంతోషిమాత కోవెల సమీపంలో నివాసం ఉంటున్న శ్రీనివాసరావు దంపతులకు కల్యాణితో పాటు ఎనిమిదేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. కల్యాణి పార్కుసెంటర్ సమీపంలోని సత్యసాయి కాన్వెంట్‌లో రెండో తరగతి చదువుతోంది. రోజూలాగే నడిచివెళ్తున్న ఆ చిన్నారి కొద్ది నిమిషాల్లో స్కూల్‌కు చేరుకునేదే. వెనుక నుంచి వచ్చిన ట్రాక్టర్ రూపంలో మృత్యువు ఆమెను బలితీసుకుంది.
విషయం తెలిసిన వెంటనే జీవీఎంసీ జెడ్సీ చంద్రశేఖర్ సంఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతురాలి కుటుంబసభ్యులను పరామర్శించారు. తమ శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. మృతదేహాన్ని వంద పడకల ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసును ట్రాఫిక్ ఎస్‌ఐ సత్యనారాయణ దర్యాప్తు చేస్తున్నారు.