దేశ భవిత విద్యార్థుల చేతిలోనే ఉందని విజయవాడ ఈస్ట్ జోన్ ఏసీపీ అభిషేక్ మహంతి అన్నారు.
ఏసీపీ అభిషేక్ మహంతి
ఈడుపుగల్లు (కంకిపాడు) : దేశ భవిత విద్యార్థుల చేతిలోనే ఉందని విజయవాడ ఈస్ట్ జోన్ ఏసీపీ అభిషేక్ మహంతి అన్నారు. ఈడుపుగల్లు నలంద విద్యానికేతన్ వసంత క్యాంపస్‌లో బుధవారం వార్షిక క్రీడా సంబరాలు ఘనంగా నిర్వహించారు. క్రీడా సంబరాలను ఏసీపీ మహంతి ప్రారంభించారు. ఏసీపీ మాట్లాడుతూ క్రీడల్లోనూ, చదువులోనూ విద్యార్థులు రాణించాలని సూచించారు. ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు అకుంటిత దీక్షతో పాటుపడాలని కోరారు. విద్యార్థుల్లోని అంతర్గత సృజనాత్మకతను వెలికితీసేలా ఉపాధ్యాయులు బోధించాలని సూచించారు.
విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. బాహుబలి చిత్రంలోని సన్నివేశాలను ఉదహరిస్తూ రూపొందించిన క్రీడా బాహుబలి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పలు క్రీడల్లో విద్యార్థులు రాణించారు. విజేతలకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో కంకిపాడు సీఐ రామ్‌కుమార్, ఎస్‌ఐ హనీష్, ప్రిన్సిపాల్ పద్మలత పాల్గొన్నారు.