జన సునామీ | The title of the referendum ..Opposed the partition of the state .. | Sakshi
Sakshi News home page

జన సునామీ

Published Thu, Sep 5 2013 2:40 AM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

The title of the referendum ..Opposed the partition of the state ..

 సమైక్య శంఖారావం బస్సుయాత్ర నుంచి సాక్షి ప్రతినిధి : ప్రజాభిప్రాయానికి పట్టం కడుతూ.. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ.. సమైక్యాంధ్ర డిమాండ్‌తో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన ‘సమైక్య శంఖారావం’ బస్సు యాత్రకు ‘అనంత’ ప్రజానీకం నీరాజనాలు పలికింది.
 
 
 అనంతపురం జిల్లా సరిహద్దుల్లోని తనకల్లు మండలం కొక్కం టి క్రాస్ నుంచి మదనపల్లె-కదిరి, కదిరి-హిందూపురం, హిందూపురం-అనంతపురం రహదారులపై జనప్రవాహం పోటెత్తింది. తమ మనోభీష్టం మేరకు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమైక్యాంధ్ర రాష్ట్రానికి కట్టుబడటంపై జేజేలు పలికిన ‘అనంత’ ప్రజానీకం.. వైఎస్ షర్మిల బస్సుయాత్రకు అడుగడుగునా బ్రహ్మరథం పట్టింది.
 
 
 హిందూపురం చరిత్రలో ఏ నాయకుడి సభకూ హాజరుకానంత స్థాయిలో వైఎస్ షర్మిల సభకు రికార్డు స్థాయిలో హాజరయ్యారన్న రాజకీయ పరిశీలకులు చేస్తోన్న విశ్లేషణ కాంగ్రెస్, టీడీపీ శిబిరాల్లో కలకలం రేపుతోంది. ఇదీ.. బుధవారం జిల్లాలో వైఎస్ షర్మిల నిర్వహించిన సమైక్య శంఖారావం బస్సుయాత్రకు వచ్చిన జనస్పందన. షెడ్యూలు సమయం కన్నా రెండు గంటలు ఆలస్యంగా జిల్లా సరిహద్దుకు చేరుకున్న వైఎస్ షర్మిలకు వైఎస్సార్‌సీపీ జిల్లా నేతలు ఘనస్వాగతం పలికారు. కదిరి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ నేత జక్కుల ఆదిశేషు భారీ కాన్వాయ్‌తో వైఎస్ షర్మిలకు అఖండ స్వాగతం పలికారు.
 
 షెడ్యూలులో లేకున్నా తనకల్లు, నల్లచెరువు మండల కేంద్రాల్లో వేలాది మంది ప్రజానీకం రోడ్లపైకి వచ్చి.. వైఎస్ షర్మిల  బస్సుయాత్రకు సంఘీభావం తెలిపారు. కొక్కంటి క్రాస్ నుంచి కదిరి వరకూ రోడ్డు పొడవునా జనం బారులు తీరారు. వైఎస్ షర్మిలపై అడుగడుగునా బంతిపూల వర్షం కురిపించి, తమ అభిమానాన్ని చాటుకున్నారు. అపూర్వ జన స్పందన మధ్య మధ్యాహ్నం 12 గంటలకు వైఎస్ షర్మిల కదిరికి చేరుకున్నారు. షర్మిల కదిరికి చేరుకునే సరికే బస్టాండు సర్కిల్ జనసంద్రాన్ని తలపించింది.
 
 కాంగ్రెస్, టీడీపీలపై విమర్శల వర్షం
 రాష్ట్ర విభజన పాపంలో పాలు పంచుకున్న కాంగ్రెస్, టీడీపీలపై వైఎస్ షర్మిల ఈటెల్లాంటి మాటలతో కదిరిలో విరుచుకుపడ్డారు. ఐదేళ్లపాటు మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో చేపట్టిన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను జనం ముందు ఏకరువు పెట్టిన షర్మిల.. ఆ తర్వాత రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను ప్రజల దృష్టికి తెచ్చారు. ఓట్లు, సీట్ల కోసం ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగా బ్లాంక్ చెక్‌లా టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ ఇచ్చారని గుర్తు చేశారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయడం కోసం కాంగ్రెస్ అధిష్టానం ఏకపక్షంగా రాష్ట్రాన్ని విభజిస్తోందన్నారు. వైఎస్ మరణించినప్పటి నుంచి మొన్నటి పంచాయతీ ఎన్నికల వరకూ కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఓట్లు, సీట్ల కోసం సీమాంధ్రను వల్లకాడు చేసేం దుకు కాంగ్రెస్, టీడీపీలు పూనుకున్నాయని విమర్శించారు. న్యాయం చేసే సత్తా లేనప్పుడు రాష్ట్రాన్ని విభజించే హక్కు లేదని కాంగ్రెస్ అధిష్టానానికి చురకలంటించారు.
 
 ఉద్యోగులు తమ జీతాలను, జీవితాలను పణంగా పెట్టి.. కార్మిక, కర్షక, విద్యార్థి, మహిళాలోకం రోడ్లెక్కి సమైక్యాంధ్ర ఉద్యమం చేస్తుంటే కాంగ్రెస్, టీడీపీ నేతలు చోద్యం చూస్తున్నారంటూ విమర్శించా రు. జైల్లో ఉన్నా జనాభ్యుదయం కోసం సమైక్యాంధ్ర కోసం ఆమరణదీక్ష చేసిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిజమైన జననేత అంటూ షర్మిల చేసిన ప్రసంగానికి జనం నీరాజనాలు పలికారు. కదిరి నుంచి హిందూపురం వరకూ గ్రామాలు, మండలాలు షెడ్యూలులో లేకున్నా వేలాది మంది ప్రజానీకం రోడ్లపైకి చేరకుని.. షర్మిలకు బ్రహ్మరథం పట్టారు. ఓడీసీ మండల కేంద్రంలో షర్మిలకు వేలాది మంది ప్రజానీకం మద్దతు తెలిపారు.
 
 గోరంట్లలో వేలాది మంది జనం స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి షర్మిలకు సంఘీభావం ప్రకటించారు. మండల కేంద్రమైన గోరంట్లలో సంయుక్త జేఏసీ నేతృత్వంలో మహిళలు చేస్తోన్న రిలే దీక్షలకు షర్మిల మద్దతు పలికారు. గోరంట్ల నుంచి హిందూపురం వరకూ రోడ్లపై జనంపై పోటెత్తారు. వైఎస్ షర్మిల హిందూపురం చేరుకునే సరికి సాయంత్రం 4.30 గంటలైంది. అంబేద్కర్ సర్కిల్ నుంచి ఆర్టీసీ బస్టాండు చివరి వరకూ కనీసం కిమీ మేర ఇసుకేస్తే రాలనంత స్థాయిలో జనం పోటెత్తారు. హిందూపురంలో వైఎస్ షర్మిల సభకు హాజరైనంత జనం ఇప్పటిదాకా ఏ నేత సభకు హాజరుకాలేదని రాజకీయ పరిశీలకులు చేస్తోన్న విశ్లేషణ కాంగ్రెస్, టీడీపీ నేతలకు ముచ్చెమటలు పట్టిస్తోంది.
 
 రాత్రిళ్లూ రోడ్డుపై నుంచి కదలని జనం
 హిందూపురం నుంచి సోమందేపల్లి మీదుగా ఎన్‌హెచ్-44 ద్వారా అనంతపురం వరకూ సాగిన వైఎస్ షర్మిల బస్సుయాత్రకు అపూర్వ జనస్పందన లభించింది. వైఎస్ షర్మిల పెనుకొండ క్రాస్ చేరుకునే సరికి సాయంత్రం 6.30 గంటలైంది. కానీ.. షెడ్యూలులో లేకున్నా పెనుకొండ ప్రజానీకం భారీ ఎత్తున రోడ్డపైకి చేరుకుని.. వైఎస్ షర్మిల బస్సుయాత్రకు సంఘీభావం ప్రకటించారు.
 
 హరిపురం, గుట్టూరు, చెన్నేకొత్తపల్లి, ఎర్రంపల్లి, దాదులూరు, మామిళ్లపల్లి, ముక్తాపురం, మరూరు, బొమ్మేపర్తి, రాప్తాడు క్రాస్‌లలో జాతీయ రహదారిపై వేలాది మంది జనం చేరుకుని షర్మిలకు మద్దతు తెలిపారు. అనంతపురం చేరుకునే సరికి రాత్రి 8 గంటలైంది. షెడ్యూలు సమయం కన్నా వైఎస్ షర్మిల మూడు గంటలు ఆలస్యంగా వచ్చినా అనంతపురం జనం చెక్కుచెదరలేదు. వైఎస్ షర్మిలను చూడగానే జనం కేరింతలు కొట్టారు. అనంతపురం సభలో వైఎస్ షర్మిల చేసిన ప్రసంగం ప్రజలను అమితంగా ఆకట్టుకుంది.
 
 రాష్ట్ర విభజన వల్ల సీమాంధ్ర చేకూరే నష్టాలను ఏకరవు పెడుతూ.. కాంగ్రెస్, టీడీపీల కుటిల రాజకీయాలను ఎండగడుతూ చేసిన ప్రసంగానికి జనం జేజేలు పలికారు. ‘రాహుల్‌గాంధీని ప్రధానిని చేయడం కోసం కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్రాన్ని విభజించిందని చంద్రబాబు చెబుతున్నారు.. 2009 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తే తెలంగాణ ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన మాట నిజం కాదా? ఓట్లు, సీట్ల కోసం సీమాంధ్రను వల్లకాడు చేస్తారా? రాహుల్‌గాంధీని ముద్దపప్పు అని చంద్రబాబు విమర్శిస్తున్నారు.. రాహుల్ గాంధీకన్నా చంద్రబాబు కుమారుడు లోకేశ్ పనికిమాలిన వారు.
 
 తాను ఏ నిర్ణయం తీసుకున్నా లోకకళ్యాణం కోసమని చంద్రబాబు అంటారు.. లోక కళ్యాణం కోసం కాదు.. లోకేశ్ కళ్యాణం కోసం కాదా చంద్రబాబూ? లోకేశ్‌కు అధికారం అప్పగించడం కోసమే ఎన్‌టీఆర్ వారసులను చంద్రబాబు తొక్కిపెడుతున్నారన్నది వాస్తవం కాదా? అధికార దాహం కోసం రాజకీయ కుట్రలు చేస్తోన్న కాంగ్రెస్, టీడీపీ నేతలు ప్రజాభ్యుదయం కోసం సమైక్యాంధ్ర డిమాండ్‌తో రాజీనామాలు చేయకపోవడంలో ఆంతర్యమేమిటి? ప్రజాభ్యుదయం కోసం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు.. వైఎస్సార్‌సీపీ సమైక్యాంధ్ర డిమాండ్ తో ఉద్యమిస్తోంది.
 
 సమైక్యాంధ్ర ఉద్యమంలో కదంతొక్కుతున్న ప్రజలకు వైఎస్సార్‌సీపీ అండ గా ఉంటుంది’ అని షర్మిల భరోసా ఇవ్వడంపై జ నం కేరింతలు కొట్టారు. అనంతపురంలో వైఎస్ షర్మిల సభ రాత్రి 9.10 గంటలకు పూర్తయింది. సభ పూర్తయిన తర్వాత అనంతపురం సమీపంలోని షిర్డీసాయి ఇంజనీరింగ్ కాలేజీలో షర్మిల బుధవారం రాత్రి బస చేశారు. గురువారం కర్నూలు జిల్లాలో బస్సుయాత్ర సాగనుంది.   
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement