సాక్షి ప్రతినిధి, అనంతపురం : ఉద్యమాల పురిటిగడ్డ ‘అనంత’లో మహానేత దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల బుధవారం ‘సమైక్య శంఖారావం’ పూ రించనున్నారు. ప్రజాభిప్రాయానికి పట్టం కడుతూ.. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు రాజకీయాలను ఎండగడుతూ.. సమైక్యాంధ్ర కోసం షర్మిల కదిరి, హిందూపురం, అనంతపురంలో ‘సమైక్య శంఖారావం’ బస్సు యాత్రను నిర్వహించనున్నారు. ఈ యాత్రకు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి.
తమ మనోభీష్టం మేరకు సమైక్య శంఖారావం పూరిస్తున్న షర్మిల బస్సు యాత్రను దిగ్విజయం చేయడానికి ‘అనంత’ ప్రజలు సిద్ధమయ్యారు. మహానేత వైఎస్ మరణం తర్వాత రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిగా మారింది. రాష్ట్రాన్ని నడిపించే సమర్థవంతమైన నాయకత్వం కొరవడం వల్ల వేర్పాటువాదం వెర్రితలలు వేసింది. ఓట్లు, సీట్ల కోసం.. అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై వేర్పాటు వాదాన్ని రాజేశాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలంటూ ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి లేఖ ఇచ్చారు. దాన్ని పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిస్తోన్న కాంగ్రెస్ అధిష్టానం జూలై 30న ఏకపక్షంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.
ఇది సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమానికి దారితీసింది. ఈ ఉద్యమానికి ‘అనంత’ చుక్కానిలా నిలుస్తోంది. జిల్లాలో ఉద్యమం మహోధృతంగా కొనసాగుతోంది. సమైక్యాంధ్ర సెంటిమెంటు జిల్లా ప్రజల్లో వేళ్లూనుకుపోయింది. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర నిఘావర్గాలు కూడా ప్రభుత్వాలకు నివేదికలు పంపాయి. ప్రజాభిప్రాయం మేరకు వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గుంటూరులో ఆమరణ దీక్ష చేపట్టారు. జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కూడా జైల్లోనే ఆమరణ దీక్ష చేపట్టారు.
రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం.. తెలుగుజాతి ఐక్యత కోసం దీక్ష చేపట్టినట్లు జగన్ స్పష్టీకరించిన విషయం విదితమే. ప్రజాభిప్రాయానికి పట్టం కడుతూ సమైక్యాంధ్రకు కట్టుబడినట్లు వైఎస్సార్‌సీపీ ప్రకటించడంపై జనం హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. వారి అభిప్రాయం మేరకే షర్మిల మహానేత వైఎస్ వర్ధంతి రోజున ఇడుపులపాయ నుంచి ‘సమైక్య శంఖారావం’ బస్సుయాత్ర ప్రారంభించారు. సోమవారం తిరుపతి, మంగళవారం చిత్తూరు, మదనపల్లెల్లో బస్సుయాత్ర సాగింది. బుధవారం జిల్లాలోని కదిరి, హిందూపురం, అనంతపురంలో యాత్ర కొనసాగనుంది. ఉదయం పది గంటలకు కదిరిలోని ఆర్టీసీ బస్టాండు సర్కిల్‌లో, మధ్యాహ్నం రెండు గంటలకు హిందూపురం అంబేద్కర్ సర్కిల్‌లో, సాయంత్రం ఐదు గంటలకు అనంతపురంలోని సుభాష్ రోడ్డులోని వైఎస్ విగ్రహం వద్ద నిర్వహించే బహిరంగ సభల్లో షర్మిల ప్రసంగించనున్నారు. షర్మిల బస్సు యాత్రకు ఉపాధ్యాయ, ఆర్టీసీ, జేఎన్‌టీయూ జేఏసీలు, ఉద్యోగ, కార్మిక, ప్రజాసంఘాలు మద్దతు ప్రకటించాయి. యాత్రను విజయవంతం చేయాలని ప్రజలకు పిలునిచ్చాయి.
నేడు షర్మిల ‘సమైక్య శంఖారావం’
Published Wed, Sep 4 2013 3:02 AM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM
Advertisement
Advertisement