ఇళ్లిస్తారా.. ఆత్మహత్య చేసుకోమంటారా?
► అధికారులను ఘెరావ్ చేసిన కరకట్టవాసులు
► ఒంటిపై కిరోసిన్ పోసుకోబోయిన మహిళ
► అడ్డుకున్న స్థానిక మహిళలు
భవానీపురం: తమకు ఇళ్లు ఇవ్వకపోతే ఆత్మాహుతికైనా సిద్ధమేనని కరకట్టవాసులు హెచ్చరించారు. భవానీపురం కరకట్ట సౌత్ రోడ్‌లోని ఇళ్ల తొలగింపునకు నిరసనగా మూడు రోజులుగా జరుగుతున్న ఆందోళన బుధవారం ఉద్రిక్తతకు దారితీసింది. కరకట్టకు ఒకవైపు పట్టాదారులు, మరోవైపు అద్దెదారులు వడివడిగా ఆందోళనలు చేపడుతున్నారు. ఈ క్రమంలో పున్నమి హోటల్ ప్రాంగణంలో రెవెన్యూ అధికారులు ఉన్నారని తెలుసుకున్న అద్దెదారులు అక్కడికి తరలివచ్చి బైఠాయించారు. కొందరు మహిళలు కిరోసిన్ డబ్బాలు తీసుకువచ్చి ఇల్లు ఇవ్వకపోతే తమకు ఆత్మహత్యే శరణ్యమని కన్నీటి పర్యంతమయ్యారు.
చంటి పిల్లాడితో వచ్చిన జరీన అనే మహిళ ఆగ్రహావేశాలకులోనై తనవద్ద ఉన్న కిరోసిన్‌ను ఒంటిపై పోసుకోబోతుండగా పక్కను ఉన్నవారు ఆమె చేతిలోని డబ్బాను బలవంతంగా లాక్కుని వారించారు. కాసేపు చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘ఓట్లు అడుక్కోవడానికి వచ్చినప్పుడు సొంత ఇల్లా, అద్దె ఇల్లా అని అడగకుండా అందరిచేతా ఓట్లు వేయించుకున్న కార్పొరేటర్ , ఇప్పుడు అద్దెకున్నవారికి ఇల్లు ఇవ్వమని అధికారులు చెబుతుంటే ఏం చేస్తున్నారని స్థానిక కార్పొరేటర్ షేక్ హబిబుల్లాపై ధ్వజమెత్తారు.అధికారుల వేధింపులు ఇలా ఉంటే మరోవైపు వైస్సార్‌కాలనీలో ఇల్లు పొందిన ఇంటి యజమానులు తమ సామాన్లు బయటపడేస్తున్నారని వాపోయారు.
అధికారుల ఘెరావ్
మధ్యాహ్న సమయంలో భోజనానికి వెళ్లేందుకు బయలుదేరిన వీఆర్‌వోలను చుట్టుముట్టడంతో వారు వెనుతిరిగి లోపలకు వెళ్లిపోయారు. అనంతరం బిల్డింగ్ ఇన్ స్సెక్టర్లు తమ వాహనాలపై వెళ్తుండగా వారిని కూడా అడ్డుకున్నారు. దీంతో బాధితులకు అధికారులకు మధ్య తోపులాట జరిగింది. ఇళ్లు రాసేది తాము కాదని, వేరే అధికారి ఉన్నారని చెప్పినా వారు వినిపించుకోలేదు. ఒకానొక దశలోసహనం కోల్పోయిన బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్ ఆశా మహిళలను పక్కకు తోసేసే ప్రయత్నం చేశా రు.
ఇంటికి పట్టాలున్నా ఇల్లు రాయటం లేదు
తమ ఇళ్లకు ఎన్టీ రామారావు ఇచ్చిన పట్టాలున్నా అధికారులు ఇల్లు రాయటం లేదని కొందరు ఇంటి యజమానులు ఆందోళన బాట పట్టారు. వంద గజాల ఇంటిలో నలుగురు కాపురముంటుంటే ఒక్కరికే రాస్తామని చెప్పటం ఎంత వరకు న్యాయమని ప్రశ్నిస్తున్నారు. 27వ డివిజన్ వైఎస్సార్‌సీపీ నాయకుడు అబ్దుల్ ఖాదర్(ట్రావెల్స్)కు సమాచారం ఇవ్వడంతో ఆయన వచ్చి వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కొన్ని చోట్ల బాత్‌రూంలకు కూడా ఇల్లు రాసిన అధికారులు పట్టాలున్న తమ ఇంటిలో ఉండే నలుగురికి ఎందుకు రాయరని ప్రశ్నించారు. తమకు ఇళ్లు ఇవ్వకపోతే జేసీబీ కిందపడైనా చస్తాంకాని ఇల్లు ఖాళీ చెయ్యమని ఖరాఖండిగా చెబుతున్నారు. అందరికీ న్యాయం జరిగే వరకు వైఎస్సార్ సీపీ అండగా ఉండి పోరాడుతుందని ఖాదర్ వారికి హామీ ఇచ్చారు.