ఏలూరులో చోరీ
పదిన్నర కాసుల బంగారం, రూ.20,900 నగదు అపహరణ
ఏలూరు (వన్ టౌన్) :ఓ ఇంట్లో దొంగలు పడి పదిన్నర కాసుల బంగా రం, రూ.20,900 నగదు అపహరించుకుపోయిన ఘటన ఏలూరు నగరంలోని చింతచెట్టు రోడ్డులో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. టౌన్ సీఐ ఎన్.రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక చేపల తూము సెంటర్‌లో ఫొటో స్టూడియో నిర్వహిస్తున్న గురజాపు బాలాజీ రాంప్రసాద్ ఇంట్లో చోరీ జరిగింది. రాంప్రసాద్, అతని కుటుంబ సభ్యులు గాఢ నిద్రలో ఉండగా, దొంగలు బీరువాలోని లాకరు నుంచి బంగారు ఆభరణాలు, డ్రెస్సింగ్ టేబుల్‌పై ఉంచిన పర్సును ఎత్తుకుపోయారు.
రాంప్రసాద్ ఆదివారం ఉదయం పనులపై బయటకు వెళ్లేందుకు సిద్ధమవుతూ బీరువా తాళాల కోసం వెతికాడు. కనిపించకపోవడంతో డూప్లికేట్ తాళాలతో బీరువా తెరిచి చూడగా, లాకరులోని బంగారు ఆభరణాలు, నగదు కనిపించలేదు. డ్రెస్సింగ్ టేబుల్‌పై ఉన్న పర్సులో నగదు మాయమైంది. దీంతో రాంప్రసాద్ పోలీ సులకు ఫిర్యాదు చేశారు. బీరువాలో ఉండాల్సిన మూడున్నర కాసుల బంగారు నల్లపూసల గొలుసు, మూడు కాసుల రెండు గాజులు, 15 గ్రాముల బ్రాస్లెట్, వినాయకుడి ఉంగరం, లక్ష్మీదేవి ఉంగరం, ఫ్యాన్సీ ఉంగరాలు రెండు, లాకరులోని కొంత నగదు చోరీకి గురయ్యాయి. మొత్తంగా పదిన్నర కాసుల బంగారం, రూ.20,900 నగదు అపహరణకు గురైనట్టు ఫిర్యాదు అందిందని సీఐ చెప్పారు. కేసు దర్యాప్తులో ఉంది.