అందినకాడికి దోచుకుంటున్నారు
అదును చూసి పర్సులు కొట్టేస్తున్న చోరులు
మెడల్లోంచి గొలుసులు తెంపుకెళ్తున్న కేటుగాళ్లు
ఆదమరిస్తే ఒంటిమీదున్న వస్తువులూ మాయం
పోలీసులున్నా.. ప్రయోజనం సున్నా
పట్టించుకోని ఆర్‌టీసీ యాజమాన్యం
2013 జనవరి నుంచి ఇప్పటివరకు నిజామాబాద్ బస్టాండ్‌లో 132 చోరీ కేసులు నమోదయ్యాయి. సుమారు 30 తులాల బంగారు ఆభరణాలు, ఆరు బైకులు, రెండు ల్యాప్‌టాప్‌లు ఇతర వస్తువులు చోరీకి గురయ్యాయి. వాటి వివరాలిలా ఉన్నాయి.
గొలుసు దొంగతనాలు 16
బైకులు 06
కంప్యూటర్ పరికరాలు 02
చిల్లర దొంగతనాలు 12
ఇతర దొంగతనాలు 96
నిజామాబాద్ నాగారం, న్యూస్‌లైన్ :
నిజామాబాద్ బస్టాండ్ ఆవరణలో దొంగల బెడద ఎక్కువైంది. ఆదమరిస్తే ఒంటిమీద ఉన్న నగలను దోచేస్తున్నారు. ప్రయాణికులు బస్సులో సీటు సంపాదించడం కోసం ఆరాటపడే సమయం లో చోరులు తమ కళను ప్రదర్శిస్తున్నారు. పర్సులు, గొలుసులు, ఇతర వస్తువులను ఎత్తుకెళ్తున్నారు. సీట్లో కూర్చున్న తర్వాతగానీ ప్రయాణికులకు తెలియడం లేదు తమ వస్తువులు చోరీకి గురయ్యాయని. ఇలా రోజూ ఇద్దరు ముగ్గురైనా తమ వస్తువులు పోగొట్టుకుంటున్నారు. చాలా మంది పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదని తెలుస్తోంది. బస్టాండ్‌లోని పోలీసు బూత్ వద్ద కు వచ్చి మొరపెట్టుకోవడం, తమ ఖర్మ ఇంతేనని ఇంటికి వెళ్లి పోవడం చేస్తున్నారు.
రోజూ లక్షల మంది ప్రయాణం
జిల్లా కేంద్రంలోని బస్టాండ్ మీదుగా నిత్యం 1,125 ఆర్టీసీ బస్సులు రాకపోకలు సాగిస్తుం టాయి. అంతర్రాష్ట్ర బస్సులు అదనం. వీటిద్వారా సుమారు రెండున్నర లక్షల మంది ప్రయాణిస్తుంటారు. దీంతో బస్టాండ్ నిత్యం రద్దీగా ఉంటుంది. చోరులు తమ కళ ప్రదర్శించడానికి ఈ రద్దీని అవకాశంగా తీసుకుంటున్నారు. ఏమరుపాటుగా ఉన్న ప్రయాణికుల వస్తువులు అపహరించి పారిపోతున్నారు. ముఖ్యంగా ప్రయాణికులు కిక్కిరిసి ఉండే ప్లాట్‌ఫామ్‌ల వద్ద దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే ఇంత రద్దీగా ఉండే బస్టాండ్‌లో ప్రయాణికులకు రక్షణ కల్పించడానికి పోలీసులు, ఆర్టీసీ తీసుకుంటున్న చర్యలు నామమాత్రమే. బస్టాండ్‌లో ఇద్దరు కానిస్టేబుళ్లు మాత్రమే భద్రత విధులు నిర్వర్తిస్తున్నారు.
చూసీ చూడనట్లుగా
బస్టాండ్‌లలో చోరీలను నివారించడంలో పోలీసు శాఖ విఫలమవుతోంది. చోరీలు జరుగుతున్నా పోలీసులు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వస్తువులు పోగొట్టుకున్నవారు వచ్చి మొరపెట్టుకుంటున్నా సరిగా స్పందించడం లేదని తెలుస్తోంది. ఆర్టీసీ యాజమాన్యం, పోలీసులు స్పందించి బస్టాండ్‌లలో నిఘా పెంచాల్సిన అవసరం ఉంది.
2013 జనవరి 22 :
రంగారెడ్డి జిల్లా సుచిత్ర జంక్షన్, రాఘవేంద్ర కాలనీకి చెందిన దేవభక్త గిరిజారాణి మాక్లూర్ మండలంలోని దుర్గానగర్‌లో ఉన్న బంధువుల ఇం టికి వెళ్లడానికి నిజామాబాద్ బస్టాండ్‌కు చేరుకున్నారు. దుర్గానగర్‌కు వెళ్లేందుకు నందిపేట బస్సు ఎక్కారు. సీటులో కూర్చున్న తర్వాత మెడను తడుముకోగా గొలుసు కనిపించలేదు. నాలుగు తులాల బంగారు ఆభరణం చోరీకి గురయ్యిందని ఆమె నిజామాబాద్ ఒకటో టౌన్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
2013 మే 13 :
బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాకు చెందిన బీర్కూర్ పద్మావతి నిజామాబాద్ వచ్చారు. పని పూర్తి చేసుకున్న తర్వాత స్వగ్రామానికి వెళ్లడానికి బస్టాండ్‌కు చేరుకుని బోధన్ బస్సు ఎక్కారు. టికెట్టు తీసుకోవడం కోసం హ్యాండ్ బ్యాగును తెరచి చూడగా డబ్బులు లేవు. బస్సు ఎక్కినప్పుడు తన పక్కన కూర్చున్న మహిళ కనిపించలేదు. బ్యాగులోని బంగారు గొలుసు, రెండు ఉంగరాలు, రెండు వేల నగదు అపహరణకు గురయ్యాయని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.
2013 జూలై 16 :
బాన్సువాడ ప్రాంతానికి చెందిన మైలవరం తరుణ్‌కుమార్ నిజామాబాద్ బస్టాండ్ వచ్చారు. బాన్సువాడ బస్సు వచ్చింది. రద్దీ ఎక్కువగా ఉండడం తో తన చేతిలో ఉన్న బ్యాగును కిటికీలోంచి సీటుపై వేశారు. తర్వాత నెమ్మదిగా బస్సు ఎక్కారు. బ్యాగు తెరచి చూడగా ల్యాప్‌టాప్ కనిపించలేదు. బస్సంతా గాలించినా ఫలితం లేకపోయింది. ఈ విషయమై పోలీసులకు ఫిర్యా దు చేశారు.
2013 అక్టోబర్ 14 :
నిజామాబాద్ నగరంలోని అర్సపల్లి కాలనీకి చెందిన ఎర్ర లింగం తన పిల్లలను కామారెడ్డి బస్సు ఎక్కించడానికి బైక్‌పై బస్టాండ్‌కు వచ్చారు. బస్టాండ్ ఆవరణలో బైక్‌ను పార్క్ చేశారు. పిల్లలను బస్సు ఎక్కించి వచ్చే సరికి బైక్ మాయమైంది. చుట్టుపక్కల గాలించినా ప్రయోజనం లేకపోయింది. ఈ విషయమై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బస్టాండ్‌లో దొంగలు..
Published Tue, Feb 18 2014 2:43 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
Advertisement