ఆరుగాలం కష్టపడిన అన్నదాతకు చివరకు అప్పులే మిగులుతున్నాయి. రైతులకు గిట్టుబాటుధరను పక్కన పెడితే.. కనీసం మద్దతు ధర సైతం అమలు కాని పరిస్థితి ఉంది. నానాటికి సాగు వ్యయం పెరుగుతున్నా..
కావలి, న్యూస్‌లైన్ : ఆరుగాలం కష్టపడిన అన్నదాతకు చివరకు అప్పులే మిగులుతున్నాయి. రైతులకు గిట్టుబాటుధరను పక్కన పెడితే.. కనీసం మద్దతు ధర సైతం అమలు కాని పరిస్థితి ఉంది. నానాటికి సాగు వ్యయం పెరుగుతున్నా.. పండించిన పంటకు గిట్టుబాటుధర కల్పించి, అమలు చేయడంలో పాలకులు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా రైతులు నష్టాలపాలవుతున్నారు. కష్టపడకుండానే పంటను కొన్న దళారులు, వ్యాపారులు మాత్రం కోట్లకు పడగలెత్తుతున్నారు. వర్షాభావ పరిస్థితులు, కరెంట్ కోతల నేపథ్యంలో పండించిన వేరుశనగ పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు దిగులు చెందుతున్నారు.కావలి డివిజన్‌లో సుమారు 20 వేల ఎకరాల్లో ఈ ఏడాది వేరు శనగ పంటను రైతులు సాగు చేశారు. కావలి రూరల్, దగదర్తి, బోగోలు, జలదంకి, కలిగిరి తదితర మండలాల్లో వేరుశనగ సాగవుతోంది.
దాదాపు పంట కోతకు వచ్చింది. దీంతో దళారులు రంగ ప్రవేశం చేసి వేరుశనగ పంట ధరను దిగజార్చారు. పండించిన పంటకు దళారులు సరైన మద్దతు ధర కల్పించకపోవడంతో పెట్టిన పెట్టుబడులు చేతికి అందే పరిస్థితి లేదని ఆందోళన చెందుతున్నారు. ఒక ఎకరాకు 5 బస్తాల వరకు విత్తనాలు అవసరమవుతాయని, ఒక్కో బస్తా రూ. 2,500 చొప్పున కొనుగోలు చేశామని చెప్పారు. ప్రభుత్వం డీజిల్ ధరలను పెంచుతూ పోవడంతో ఒక ఎకరా దుక్కి దున్నాలంటే ఐదు నుంచి ఆరు వేలు ఖర్చు పెట్టాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పురుగు మందులు, ఎరువుల వాడానికి వేలాది రూపాయలు వెచ్చించాల్సిన పరిస్థితి తప్పడం లేదని చెబుతున్నారు. ఇలా ఒక ఎకర వేరుశనగ పంట సాగు చేయాలంటే దుక్కి దగ్గర నుంచి పంట కోత దశకు వచ్చే వరకు సుమారుగా రూ. 35 వేల నుంచి రూ.40 వేలు పె ట్టుబడి పెట్టాల్సి వస్తుందని రైతులు చెబుతున్నారు. ఒక ఎకరాకు 30 బస్తాలు (40 కేజీల బస్తా) దిగుబడి వస్తుందని, ఒక్కో బస్తా దళారులు రూ. 1200 చొప్పున కొనుగోలు చేస్తుండటంతో గిట్టుబాటు కావడం లేదని రైతులు లబోదిబోమంటున్నారు. వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకుని దళారులు రోజుకొక ధర, పూటకొక మాటతో చెప్పిన రేటుకు అమ్మకాలు సాగిస్తున్నట్లు రైతులు ఆం దోళన చెందుతున్నారు. ప్రభుత్వం క్వింటాల్ వేరుశనగకాయలకు రూ.3,700 మద్దతు ధర కల్పిస్తోంది. అయితే దళారులు మాత్రం రైతుల నుంచి రూ.3 వేలకే కొనుగోలు చేస్తున్నారు. పెరుగుతున్న సాగు ఖర్చులను దృష్టిలో ఉంచుకుని క్వింటాకు కనీసం రూ. 5 వేల మద్దతు ధర కల్పిస్తే కష్టానికి ఫలం దక్కుతుందని రైతులు అభిప్రాయపడుతున్నారు.