
మైనింగ్ వ్యాపారం యథేచ్ఛగా...
డోన్: డోన్ ప్రాంతంలో అక్రమ మైనింగ్ వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది. దీనిని అడ్డు కట్ట వేయడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. అక్కడక్కడ చెక్‌పోస్టులున్నా పేరుకుమాత్రమే అన్నట్లుగా కొనసాగుతున్నాయి. ఏడాది క్రిందట కలెక్టర్ స్వయంగా తనిఖీ చేసి డోన్‌పట్టణ సమీపంలోని కోట్లవారిపల్లెవద్ద, వెల్దుర్తి మండలం రామళ్లకోటవద్ద, బేతంచర్ల వద్ద చెక్‌పోస్టులను ఏర్పాటుచేశారు. ఈ చెక్‌పోస్టులలో ఏడీఎంజీ అధికారులతో పాటు, పారెస్టు, రెవెన్యూ అధికారులు తనిఖీ చేయాలి. అయితే, చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు కానీ, అక్కడ ఏడీఎంజీ కార్యాలయ సిబ్బంది తప్ప ఎవరూ ఉండటంలేదు. ఒక వేళ వీరు పట్టుకుంటే మామూళ్లు ఇచ్చి అక్రమార్కులు యథేచ్ఛగా మైనింగ్‌ను తరలిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
డోన్, బేతంచర్ల ప్రాంతం నుంచి ఐరన్‌ఓర్ ముడి ఖనిజం ప్రతిరోజు లారీల్లో బళ్లారి, తాడిపత్రి, కర్నూలు ప్రాంతాలకు తరలివెల్లుతోంది. ఈ దందా జీరో వ్యాపారంతో సాగుతోంది. బేతంచర్ల మండలంలోని ముసలాయిచెరువు, ఎన్.రంగాపురం, గూటుపల్లి, తవిసికొండ, ఉసేనాపురం, నాగమల్లకుంట, ముద్దవరం, డోన్ మండలంలోని చిన్నమల్కాపురం, కన్నపుకుంట, కమలాపురం ప్రాంతాలనుంచి అక్రమంగా వెలికి తీసిన ఐరన్‌ఓర్‌ను తరలిస్తున్నారు. చిన్నమల్కాపురం, గూటుపల్లి ప్రాంతాల్లో అటవీ ప్రాంతం, పట్టాభుమూల్లో వెలికి తీసిన ఇనుపఖనిజాన్ని రాత్రికి రాత్రి డోన్‌మీదుగా హద్దులు దాటిస్తున్నా రు. ఈ అక్రమార్కులకు డోన్, బేతంచర్ల, ప్యాపిలి పోలీసుల సహకాారం పుష్కలంగా ఉన్నట్లు తెలుస్తోంది.
తూతూ మంత్రంగా తనిఖీలు:
కోట్లవారిపల్లె వద్ద ఏర్పాటుచేసిన చెక్‌పోస్టు తూతూ మంత్రంగా కొనసాగుతోంది. బేతంచర్ల, కొచ్చెర్వు, జలదుర్గం ప్రాంతం నుంచి వచ్చే లారీలను తనిఖీలు చేస్తూ పర్మిట్‌లను పరిశీలించాలి. అయితే, ఈ తనిఖీలు ఏడీఎంజీ కార్యాలయం నుంచి వచ్చిన ఇద్దరు సాధారణ సిబ్బంది, తలారీ మాత్రమే నిర్వహిస్తున్నారు. వీరు ఉదయం, సాయంత్రం మాత్రమే తనిఖీలు చేసి చేతులు దులుపుకుంటున్నారు. దీంతో రాత్రిపూట యథేచ్ఛగా అక్రమ రవాణా జరుగుతోంది. దీనికి అడ్డుకట్ట వేయాల్సిన మైనింగ్ అధికారులు కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
సిబ్బంది కొరత ఉంది
మైనింగ్‌ను అక్రమంగా తరలించకుండా పలుచోట్ల చెక్‌పోస్టులు ఉన్నాయి. అయితే, సిబ్బంది కొరత కారణంగా వాటిలో పూర్తిస్థాయిలో సిబ్బందిని నియమించలేని పరిస్థితి. చెక్‌పోస్టుల వద్ద పర్మనెంట్‌గా గేట్లు ఏర్పాట్లు చేయాలనుకుంటున్నాం. రెవెన్యూ, సేల్‌ట్యాక్స్ సిబ్బందిని అక్కడ ఏర్పాటు చేస్తే మరింత కట్టుదిట్టం చేయవచ్చు. - చారీ, ఏడీ మైన్స్