తీర రక్షణ గాల్లో దీపమే | There is no proper Coastal security in the State | Sakshi
Sakshi News home page

తీర రక్షణ గాల్లో దీపమే

Published Fri, Nov 9 2018 4:54 AM | Last Updated on Fri, Nov 9 2018 4:54 AM

There is no proper Coastal security in the State - Sakshi

తీరం వద్ద నిలిపేసిన కోస్టల్‌ సెక్యూరిటీ (మెరైన్‌) బోట్లు

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: తీవ్రవాద ముప్పు వంటి ప్రమాదకర పరిస్థితులు పొంచిఉన్న నేపథ్యంలో తీరప్రాంత రక్షణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం తీర భద్రతను గాలికొదిలేసింది. దేశంలో గుజరాత్‌ తరువాత అత్యంత పొడవైన సముద్రతీరం గల మన రాష్ట్రంలో తీరం వెంబడి గస్తీ కాయాల్సిన కోస్టల్‌ సెక్యూరిటీ బోట్లన్నీ పడకేశాయి. ఒక్కటంటే ఒక్కబోటు కూడా పనిచేయడంలేదు. చివరకు మొన్న తిత్లీ తుపాను సమయంలోనూ ఇవి ఏవిధంగానూ అక్కరకురాలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అంచనావేయవచ్చు. సముద్రమార్గంలో దేశంలోకి ప్రవేశించిన లష్కరే తోయిబా తీవ్రవాదులు 2008 నవంబర్‌ 26న ముంబైనగరంపై జరిపిన దాడిలో 164 మంది మరణించడంతో  కేంద్ర ప్రభుత్వం తీరప్రాంత భద్రతపై దృష్టిసారించింది.

సముద్రతీరంలో మెరైన్‌ పోలీస్‌స్టేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.  24గంటలూ తీరం వెంబడి బోట్లలో  గస్తీ కాయడం, ప్రకృతి విపత్తు సమయాల్లో సహాయక చర్యల్లో పాలుపంచుకోవడం ప్రధాన విధులుగా ఏర్పాటైన ఈ మెరైన్‌ పోలీస్‌ స్టేషన్లను తరువాతి కాలంలో కోస్టల్‌ సెక్యూరిటీ పోలీస్‌స్టేషన్లుగా మార్పు చేశారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలో ఆయా పోలీస్‌స్టేషన్లు పనిచేస్తుంటాయి. 1214.7 కిలోమీటర్ల తీరరేఖ కలిగిన ఆంధ్రప్రదేశ్‌లో 21 కోస్టల్‌ సెక్యూరిటీ పోలీస్‌ స్టేషన్లు ఉండగా  గిలకలదండి, నిజాంపట్నం, రిషికొండ, వాకలపూడి, కళింగపట్నం, వాడలరేవు పోలీస్‌స్టేషన్లకు మాత్రమే ఒక్కో స్టేషన్‌కు మూడేసి చొప్పున బోట్లు ఉన్నాయి. మిగిలిన 15 పోలీస్‌స్టేషన్లలో  పోలీసులు తీరం వెంబడి గ్రామాల్లో గస్తీకి మాత్రమే పరిమితమవుతున్నారు.

బోట్లకు డీజిల్‌ లేదు... సిబ్బందికి జీతాల్లేవ్‌.. 
పెట్రోలింగ్‌ నిమిత్తం బోటు సముద్రంలోకి వెళ్తే గంటకు 200 లీటర్ల డీజిల్‌ ఖర్చవుతుంది. కానీ కొద్దిరోజుల క్రితం వరకు కేవలం రోజుకి 40 లీటర్లే ఇచ్చి తూతూ మంత్రంగా పెట్రోలింగ్‌ చేయించేవారు. ఇప్పుడు అదీ లేదు.. ప్రస్తుతం బోట్లన్నీ పడకేయడంతో డీజిల్‌ ఖర్చు మిగిలిందనే భావనలో అధికారులు ఉన్నారు. ఇక పోలీసు అధికారులు, ఆ శాఖ ఉద్యోగులకు తప్పించి... హోంగార్డులు, అవుట్‌ సోర్సింగ్‌కు తీసుకున్న బోటు డ్రైవర్లు, ఇతర సిబ్బందికి సరైన జీతభత్యాలు లేకపోగా.. ఇస్తున్న అరకొర కూడా సక్రమంగా ఇవ్వని పరిస్థితి నెలకొంది.  జీతాల్లేక చాలాచోట్ల బోట్‌ క్రూ మానివేయడంతో లోకల్‌ ఫిషర్‌మెన్‌ను వినియోగిస్తూ వచ్చారు.

స్టేషన్‌ ఒకచోట.. బోట్లు మరోచోట
ఇక పోలీస్‌స్టేషన్‌ ఒక చోట ఉంటే.. దానికి దూరంగా ఎక్కడో బోట్లు ఉన్న పరిస్థితి మన రాష్ట్రంలో మాత్రమే నెలకొంది. విశాఖ నగరంలోని ఫిషింగ్‌ హార్బర్‌ వద్ద పోలీస్‌స్టేషన్‌ ఉండగా, 15 కిలోమీటర్ల దూరంలోని రిషికొండ వద్ద బోట్లు ఉంటాయి. శ్రీకాకుళం జిల్లా కళింగపట్నంలో పోలీస్‌స్టేషన్‌ ఉంటే బోట్లు మాత్రం 50కిలోమీటర్ల దూరంలోని భావనపాడులో ఉంటాయి. గుంటూరు జిల్లా రేపల్లెలో స్టేషన్‌ ఉంటే బోట్లు మాత్రం నిజాంపట్నంలో ఉంటాయి. ఒక్క కృష్ణాజిల్లా మచిలీపట్నం గిలకలదిండిలో మాత్రమే పోలీస్‌స్టేషన్‌కు ఎదురుగా బోట్లు ఉండే పరిస్థితి ఉంది. బోట్లు ఉన్న చోట పోలీస్‌స్టేషన్లు లేకపోవడంతో బోట్ల వద్ద కేవలం హోం గార్డు, హెడ్‌ కానిస్టేబుళ్‌ మాత్రమే విధుల్లో ఉంటున్నారు. తీరం సమీపంలోనే జెట్టీలు కట్టి... అక్కడే పోలీస్‌స్టేషన్లు ఏర్పాటు చేయాల్సిన సర్కారు ఏ మాత్రం పట్టించుకోవడంలేదు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement