
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, వీరఘట్టం(శ్రీకాకుళం) : మంచి పది మందికి తెలిసేలోపు.. చెడు క్షణాల్లో ప్రపంచాన్నే చుట్టి వస్తుందని నానుడి. నేటి ఆధునిక ప్రపంచంలో పరిస్థితి ఇలాగే ఉంది. ఇంటర్నెట్ నెట్ విస్తృతంగా అందుబాటులోకి వచ్చాక అసత్య ప్రచారాలు జోరందుతుకున్నాయి. విషయ పరిజ్ఞానం, అవగాహన లేని కొందరు అమాయకులు ఇటువంటి అసత్య ప్రచారాలకు బలైపోతున్నారు. ఇటీవల స్కూటీ యోజన అనే పథకం ఉందంటూ సోషల్ మీడియాలో హల్‌చల్ చేయడం కూడా ఇలాంటిదే. అసలు ఈ పథకమే లేకపోయినా.. స్కూటీ యోజన నిజమే కాబోలని భావించి మహిళలు ఆతృతగా దరఖాస్తులు చేసుకునేందుకు సిద్ధపడుతున్నారు.
అర్హత కలిగిన బాలికలకు స్కూటీలు ఇవ్వాలనే లక్ష్యంతో ప్రధాని మోదీ స్కూటీ యోజన ప్రవేశపెట్టినట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఇందుకు సంబంధించిన వైబ్‌సైట్ పరిశీలిస్తే అటువంటిదేమీ లేదని తెలుస్తోంది. అయినప్పటికీ ఈ పథకం ద్వారా స్కూటీని పొందేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తుండటం గమనార్హం. ఇందు కోసం ప్రతీ ఒక్కరికీ ఉండాల్సిన డ్రైవింగ్ లైసెన్స్‌ల కోసం ఆర్‌టీఓ కార్యాలయాలకు క్యూ కడుతున్నారు.
ఇదీ అసలు విషయం...
పదో తరగతి తర్వాత బాలికల ఉన్నత చదువులకు కళాశాలకు వెళ్లి రావడానికి, వర్కింగ్ ఉమెన్ల కోసం ప్రధానమంత్రి మోదీ స్కూటీ యోజన పథకం అమల్లోకి తీసుకొచ్చారనే ప్రచారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సర్కారు యోజన వైబ్‌సైట్‌లోకి వెళ్లి దరఖాస్తు నింపాలని, ఈ నెల 30తో దరఖాస్తు స్వీకరణ గడువు ముగియనుదని అందులో సారాంశం. పదో తరగతి మా ర్కుల జాబితా, ఆధార్‌కార్డు, రేషన్, ఆదాయ ధ్రువపత్రాలతో పాటు ఎల్‌ఎల్‌ఆర్ లైసెన్సు కూడా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకో వాలని, ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే అర్హత కల్పిస్తారని, దరఖాస్తుదారులు పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలని, వయస్సు 18 నుంచి 40 ఏళ్లలోపు ఉండాలని, ఆదాయం 2.50 లక్షల లోపు ఉండాలని చెబుతున్నారు. ఇది నిజమేనని నమ్మి కొందరు నెట్‌సెంటర్లకు పరుగులు తీస్తున్నారు.
అంతా బూటకం..
వాస్తవానికి స్కూటీ అనేది ఓ ద్విచక్ర వాహన కంపెనీ పేరు. ఓ ప్రవేటు కంపెనీ పేరుతో కేంద్ర ప్రభుత్వం పథకాన్ని అమలు చేయదు. ఇటువంటి ప్రచారాలపై విజ్ఞతతో ఆలోచించి దూరంగా ఉండాలని పలువురు హితవుపలుకుతున్నారు.
తమిళనాడులో ఓపెన్ అవుతుందట....
స్కూటీ యోజన పథకంలో స్కూటీలు తమ సొంతం చేసుకుందామని ఆశిస్తున్న కొందరు మహిళలను ‘సాక్షి’ ఈ విషయంపై ఆరా తీయగా ఆసక్తి విషయాలు వెలుగుచూశాయి. ఆంద్రప్రదేశ్‌లో ఈ పథకం వెబ్‌సైట్ ఓపెన్ కావడం లేదు గాని తమిళనాడులో ఓపెన్ అవుతుందని తన ఫ్రెండ్ తనతో చెప్పినట్లు చెప్పింది. అయితే ఇక్కడే అసలు విషయం దాగుంది. తమిళనాడులో ఉన్న పథకం పేరు ‘అమ్మ స్కూటర్ స్కీం’. గత సంవత్సరం తమిళనాడులో ప్రారంభించారు. మాజీ ముఖ్యమంత్రి జయలలిత జ్ఞాపకార్థం ఆమె 70వ జయంతి సందర్భంగా అక్కడి విద్యార్థినులు, ఉద్యోగం చేసే మహిళల కోసం ఈ స్కీం స్టార్ట్ చేశారు. అది కూడా 50 శాతం రాయితీపై స్కూటర్ ఇచ్చేలా పథకం రూపొందించారు. ఇది కేవలం తమిళనాడు ప్రజలకే పరిమితం. ఈ విషయం తెలియక మోదీ యోజన అంటూ కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి ఇటువంటి పధకాలు ప్రవేశ పెడితే కేంద్ర ప్రభుత్వం గ్రాండ్‌గా ఇనా గరేట్ చేస్తుందే తప్ప ఇలా గుట్టుగా చేయదని, మహిళలు ఈ విషయాన్ని గ్రహించాలని విద్యావేత్తలు చెబుతున్నారు.
ఆ పథకమే లేదు..
స్కూటీ యోజన అనే పథకమే ప్రారంభించలేదు. అనవసరంగా ఇటువంటి బూటకపు ప్రచారం విని డబ్బులు వృథా చేసుకోవద్దు.
– జి.పైడితల్లి, ఎంపీడీఓ, వీరఘట్టం
Comments
Please login to add a commentAdd a comment