శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ప్రజాభిప్రాయానికి, నిబంధనలకు వ్యతిరేకంగా చేపట్టిన కాకరాపల్లి థర్మల్ ప్లాంట్ పనులను వెంటనే నిలుపుదల చేయాలని, ప్లాంట్ నిర్మాణానికి ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, కాకరాపల్లి థర్మల్ ప్లాంట్ వ్యతిరేక పోరాట కమిటీ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు వైఎస్‌ఆర్‌సీపీ నేతలు తమ్మినేని సీతారాం, దువ్వాడ శ్రీనివాస్, సీపీఎం నేత చౌదరి తేజేశ్వరరావు, సీపీఐ ప్రతినిధు లు గురుగుబెల్లి అప్పలనాయుడు, తాండ్ర ప్రకాశ్, నంబారి వెంకటరావు, నీలంరాజు, థర్మల్ పోరాట కమిటీ నేత అనంత హన్నూరావు తదితరులు శనివారం కలెక్టర్ సౌరభ్ గౌర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయనతో మాట్లాడుతూ ప్లాంట్ ఆవరణలో నిర్మాణ పనులను అక్రమంగా, వేగంగా చేస్తున్నారని, వెంటనే వాటిని నిలుపుదల చేయాలని కోరారు. ప్లాంట్ వద్దని స్థానికులు పోరాటాలు చేస్తుంటే ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవటం లేదన్నారు.
ప్లాంట్ ప్రహరీని ఎత్తుగా నిర్మించటంతో ఈ ఏడాది సుమారు 23 వేల ఎకరాల్లోని పంట నెల రోజులపాటు నీటిలో ఉండిపోయిందని చెప్పారు. ప్రజల డిమాండ్ మేరకు సోంపేట ప్లాంట్ అనుమతులను రద్దు చేసిన ప్రభత్వం, కాకరాపల్లి ప్లాంట్ విషయంలో ద్వంద్వ వైఖరి ఎందుకు ప్రదర్శిస్తోందని., ఎవరి ప్రయోజనాల కోసం ఇలా చేస్తోందని ప్రశ్నించారు. ప్లాంట్ వల్ల మత్స్యకారులకు తీవ్ర నష్టం జరుగుతుందని తెలిపారు. ప్లాంట్ యాజమాన్యానికి పోలీసులు వత్తాసు పలుకుతుండటంతో ప్రజ లు నిరంతరం భయంతో గడుపుతున్నారన్నారు. కాకరాపల్లి పరిసర ప్రాంతాల్లోని గడ్డిని నాశనం చేసేం దుకు ప్లాంట్ యాజమాన్యం మం దులు, విషపూరిత ద్రవాలు జల్లుతోందని.. వీటి వల్ల చెరువుల్లోని చేపలు, ఇతర జీవాలు చనిపోతున్నాయని వివరించారు. అంతేకాకుండా తేలినీలాపురంలోని విదేశీ పక్షులను సైతం ప్లాంట్ వారు కాల్చి చంపేస్తూ ఆ పక్షుల విడిది కేంద్రాన్ని నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
‘థర్మల్’ అనుమతులు రద్దు చేయండి
Published Sun, Feb 16 2014 4:27 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
Advertisement