సాక్షి, రంగారెడ్డి జిల్లా: నిధులు నీళ్లలా ఖర్చుచేసే రాజీవ్ విద్యామిషన్ (ఆర్వీఎం)కు ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కొత్తగా నిధులు విడుదల చేయకుండా, అందుబాటులో ఉన్నవాటినే సర్దుబాటు చేసుకోవాలని స్పష్టం చేయడంలో అధికారులు ఖర్చుపై మల్లగుల్లాలు పడుతున్నారు. ఖాతాలో ఉన్న నిధులను పొదుపుగా వాడేందుకు ఉపక్రమించారు. ప్రస్తుతం ఆర్వీఎం ద్వారా భారీగా నిధులు ఖర్చు చేసే నివాస, ప్రత్యేక శిక్షణ కేంద్రాలకు(ఆర్‌ఎస్‌టీసీ) కోత పెట్టింది. బడిబయటి పిల్లలకు నివాస వసతి కల్పించి ఉచితంగా చదువు చెప్పడం వీటి ఉద్దేశం. ఈ కేంద్రాలు స్వచ్ఛంద సంస్థల(ఎన్జీఓ) ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. అయితే వీటి నిర్వహణపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో ఈ ఏడాది పలు కేంద్రాలకు కోత పెట్టి.. ఈ నిధులను విద్యా బోధకులపై ఖర్చు చేసేందుకు జిల్లా రాజీవ్ విద్యామిషన్ అధికారులు దృష్టి సారించారు.
ఏటా రూ.కోటిన్నర ఆదా
జిల్లాలో 39 ఆర్‌ఎస్‌టీసీలు కొనసాగుతుండగా.. మూడు నెలల క్రితం వీటి కాలపరిమితి ముగిసింది. అయితే కొత్తగా రెన్యూవల్ చేస్తే మళ్లీ ఈ కేంద్రాలు కొనసాగే అవకాశ ం ఉంటుంది. కొత్తవాటి కి అనుమతిచ్చే అంశంలో ఆర్వీఎం ఆచితూచి వ్యవహరిస్తోంది. ఈ కేంద్రాల ఏర్పాటు ఎక్కడ అవసరమనే దానిపై అధికారులు సర్వే నిర్వహించారు. ఈ ఏడాది 27 కేంద్రాలకు అవకాశం ఉందని నిర్థారించారు. ఒక్కో ఆర్‌ఎస్‌టీసీ ద్వారా నెలకు సగటున రూ.లక్షన్నర ఖర్చు చేస్తున్నారు. తాజాగా 12 కేంద్రాలకు కోత పెట్టడంతో జిల్లా ఆర్వీఎంకు భారీగా నిధులు మిగిలిపోనున్నాయి. ఈ ఏడాది దాదాపు రూ.1.5కోట్లు మిగిలిపోనున్నాయి. ఇలా మిగిలిన నిధులను ఇతర ప్రాధాన్య త అంశాలపై ఖర్చు చేసేందుకు చర్యలు తీసుకుం టోంది. అదేవిధంగా కొత్త ఆర్‌ఎస్‌టీసీల నిర్వహణ పైనా ఆర్వీఎం ప్రత్యేక ప్రణాళిక తయారుచేస్తోంది.
అదనంగా విద్యా బోధకులు
జిల్లాలో టీచర్ల కొరత ఉంది. కొత్తగా డీఎస్సీ నిర్వహిస్తామని విద్యా సంవత్సరం ప్రారంభంలో సర్కారు ప్రకటించినప్పటికీ.. అనివార్య కారణాలతో వాయి దా పడింది. దీంతో ఈ ఏడాది జిల్లాలో 646 విద్యా బోధకులను కాంట్రాక్టు పద్ధతిన నియమించారు. అయినప్పటికీ జిల్లాలో టీచర్ల కొరత ఉండడంతో అక్కడ ప్రత్యేకంగా విద్యా బోధకులను నియమించేందుకు ఆర్వీఎం అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఆర్‌ఎస్‌టీసీలకు కోత పెట్టడంతో మిగిలిపోయే నిధులను విద్యా బోధకులపై ఖర్చు చేయనున్నారు. టీచర్ల ఖాళీలు అధికంగా ఉన్న ఎనిమిది గ్రామీణ మండలాల్లో అదనంగా వంద మంది విద్యాబోధకులను నియమించనున్నట్లు ఆర్వీఎం అధికారులు చెబుతున్నారు.
వృథా ఖర్చులకు కళ్లెం!
Published Wed, Oct 16 2013 5:00 AM | Last Updated on Wed, Mar 28 2018 10:56 AM
Advertisement
Advertisement