సాక్షి, బల్లికురవ(ప్రకాశం) : పొలంలో జెండాలు పాతి వేలం నోటీసులివ్వడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాన్ని ఉన్నతాధికారులు నియమించిన త్రీమెన్ కమిటీ సోమవారం పరామర్శించింది. మండలంలోని కె.రాజుపాలేనికి చెందిన శాఖమూరి హనుమంతురావు (42) కొంతకాలంగా మార్టూరు మండలం శాంతినగర్‌లో నివాసం ఏర్పాటు చేసుకుని భార్య, పిల్లలతో కలిసి అక్కడే నివాసం ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో స్వగ్రామం కె.రాజుపాలెంలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. శాఖమూరి హనుమంతురావు శనివారం ఉదయం పొలం వెళ్తున్నానని ఇంట్లో చెప్పి స్వగ్రామానికి వచ్చి వేపచెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య కుపాల్పడ్డాడు.
ఈ ఘనటపై ఒంగోలు ఆర్డీవో పెంచల కిశోర్ ఆదేశాల మేరకు తహసీల్దార్ టి.ప్రశాంతి, వ్యవసాయాధికారి ఎస్‌వీపీ కుమారి, ఎస్‌ఐ పాడి అంకమ్మరావులు శాంతినగర్‌లోని బాధిత రైతు కుటుంబాన్ని పరామర్శించారు. రైతు భార్య రాధిక నుంచి వివరాలు సేకరించారు. మార్టూరు పీడీసీసీ బ్యాంకులో నాలుగేళ్ల క్రితం తీసుకున్న అప్పు రూ. 1.80 లక్షలు వడ్డీతో కలిపి రూ.2.20 లక్షలు, స్టేట్ బ్యాంకులో రూ.లక్ష, ప్రైవేటు వ్యాపారుల వద్ద మరో రూ.3 లక్షల అప్పు ఉందని మృతుడి భార్య చెప్పింది. పీడీసీసీ బ్యాంకు మేనేజర్ ఒత్తిడి చేయడంతో తన భర్త మానసికంగా ఇబ్బంది పడ్డాడని ఆరోపించింది. పొలంలో జెండాలు పాతి 3వ తేదీన పొలం వేలం వేస్తున్నట్లు మేనేజర్ బెదిరించడంతో ఆత్మహత్య చేసుకున్నాడని బాధిత రైతు భార్య త్రీమెన్ కమిటీ ఎదుట వాపోయింది. తన బిడ్డలు హర్షవర్ధన్ ఇంటర్, నందిని 9వ తరగతి చదువుతున్నారని పేర్కొంది. చదువులకు విఘాతం కలగకుండా అప్పుల వాళ్ల నుంచి ఒత్తిడి లేకుండా ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని కోరింది. నోటీస్‌లు ఇవ్వడంతో పాటు పొలంలో జెండాలు పాతిన పీడీసీసీ బ్యాంకు మేనేజర్‌పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని రాధిక త్రీమెన్ కమిటీని వేడుకుంది.
Comments
Please login to add a commentAdd a comment