సాక్షి ప్రతినిధి, కడప : రెవిన్యూ శాఖకు మూల స్తంభాలైన ఆర్డీఓలు జిల్లాలో ‘ముగ్గురూ.. ముగ్గురే’ చందాన వ్యవహరిస్తున్నారు. ప్రజలకు బాధ్యులుగా నిలవాల్సిన వారు తద్భిన్నంగా వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీ నేతల మెప్పు పొందితే చాలు, ఎవరేమనుకుంటే ఏమి అన్నట్లుగా మసులుకుంటున్నారు. తప్పు చేసిన తహాశీల్దారును దండించాల్సిందిపోయి, వివాదాలకు ప్రధాన కారకులుగా నిలుస్తున్నారు. చిన్న చిన్న సమస్యలను సైతం వివాదాస్పదం చేస్తూ తద్వార లబ్ధి పొందేందుకే ప్రయత్నిస్తున్నారు. వెరసి సోమవారం మృతి చెందిన నందలూరు మండలం నాగిరెడ్డిపల్లె వాసి మగ్భూల్ లాగా ఎందరో మదన పడుతున్నారు. జమ్మలమడుగు, రాజంపేట, కడప ఆర్డీఓల పరిధిలోని తాజా ఘటనలు అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
లింగాల మండలం మురారిచింతల గ్రామంలో ఇన్‌ఛార్జి డీలర్, టీడీపీ నేత రవిచంద్రారెడ్డి ఇంట్లో రేషన్ సరుకులు నిల్వ చేశారు. ఆగ్రామంలోని 90 శాతం మంది రేషన్‌కార్డు దారులు ఆ ఇంట్లోకి వెళ్లి రేషన్ తీసుకెళ్లలేమని తహాశీల్దారుకు వివరించారు. ప్రజాభిప్రాయాన్ని గౌరవించిన తహాశీల్దారు అందరికీ అనువైన ప్రభుత్వ భవనంలో ఆర్‌ఐ పర్యవేక్షణలో ప్రజలకు రేషన్ సరుకులు అందించాలని ఆదేశించారు. ఆ మేరకు చర్యలు చేపట్టింటే ఎలాంటి సమస్య ఉత్పన్నమైయ్యే అవకాశమే లేదు.
‘జన్మభూమి-మాఊరు’ నాటికి ఆ సమస్య అలాగే ఉండడం, తహాశీల్దారు ఆదేశాలు అమలు కాకపోవడంపై గ్రామస్తులు ప్రశ్నించారు. తుదకు జమ్మలమడుగు ఆర్డీఓ వినాయకంకు ఫోన్‌లో వివరించారు. ప్రజాభిష్టాన్ని మన్నించాల్సిందిపోయి, టీడీపీ నేత ఇంట్లోనే రేషన్ సరుకులు పంపిణీ చేస్తారు.. ఇష్టముంటే తీసుకెళ్లండి, లేదంటే లేదు అని తెగేసి చెప్పడంతోనే గ్రామస్తులు ఆగ్రహించారు. ఉన్నతాధికారిగా వాస్తవ పరిస్థితులను గ్రహించి మెజార్టీ అభిప్రాయానికి విలువ ఇవ్వకపోడంతోనే సమస్య జఠిలమైంది. తహాశీల్దారుకు ఉన్న విచక్షణ ఆర్డీఓకు లేకపోయింది. తెరవెనుక టీడీపీ నేతల సిఫార్సులే అందుకు కారణంగా తెలుస్తోంది.
రూ.4లక్షలుఅడిగారనివిన్నవించినా.. నందలూరు మండలం నాగిరెడ్డిపల్లె వాసి మగ్భూల్ (52) తన వాటాపై తనకు హక్కు కల్పించాలని మూడేళ్లుగా రెవిన్యూ యంత్రాంగం చుట్టూ ప్రదక్షిణ చేశాడు. జిల్లా కేంద్రంలో స్వయంగా కలెక్టర్ నిర్వహించే గ్రీవెన్స్‌సెల్‌కు దాదాపు 40 సార్లు వచ్చి, ఫిర్యాదు చేశాడు. తహాశీల్దారు రూ.4 లక్షలు లంచం అడుగుతున్నారని ఆర్డీఓ ప్రభాకర్‌ఫిళ్లైకీ వివరించారు. తహాశీల్దారు నుంచి పాసుపుస్తకాలకు ప్రతిపాదన వస్తే తప్ప తానేమి చేయలేనని ఆయన నుంచి నిర్లక్ష్య సమాధానమే ఎదురయ్యింది. ఎలాంటి చర్య తీసుకోకుండా మగ్భూల్‌ను చావుకు ప్రేరేపించారే కానీ సమస్య పరిష్కారంపై దృష్టి సారించలేదు. మగ్భూల్ లాంటి ఉదంతమే ఓబులవారిపల్లె మండలం కమ్మపల్లె దళితులకు చెందన భూములు వివాదంలోనూ తిష్టవేసింది.
ఎన్నో పర్యాయాలు ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్లినా ఇసుమంత కూడా సమస్య పరిష్కారం కాలేదు. దళితులన్న విచక్షణ కూడా లేకుండా పోయింది. ఇక కడప ఆర్డీఓ చిన్నరాముడు ఏకంగా భూ సంతర్పణకు తెరలేపారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. అక్రమార్కులకు అండగా నిలుస్తూ వారితో చెట్టాపట్టాల్ వేసుకు తిరుగుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే కడప నగరంలోని సర్వే నంబర్ 955లోని 23సెంట్లకు సంబంధించి కంప్యూటర్ అడంగల్ ఇవ్వాలంటూ స్వాహారాయుళ్లకు అండగా నిలిచినట్లు తెలుస్తోంది.
కడప గడపలో ఇలాంటి ఘటనలు ప్రస్తుతం అధికమయ్యాయి. రౌతు మెత్తనైతే గుర్రం మూడు కాళ్లమీద పరుగెత్తిందన్నట్లు ప్రస్తుతం జిల్లాలో రెవిన్యూ వ్యవస్థ నడుస్తోంది. ప్రజాస్వామాన్ని, చట్టాన్ని, ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ ప్రజలకు సేవ చేయడమే తలంపుతో అత్యున్నతాధికారి వ్యవహరిస్తే కింది స్థాయి అధికారులు సైతం అదే ధోరణితో నడుచుకుంటారు. ఏకపక్ష చర్యలను నియంత్రించాల్సిందిపోయి, ప్రోత్సహించడంతోనే వ్యవస్థ చిన్నాభిన్నం అవుతున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ముగ్గురూ... ముగ్గురే!
Published Wed, Jun 17 2015 3:33 AM | Last Updated on Fri, Aug 10 2018 8:13 PM
Advertisement
Advertisement