
సీఎం కిరణ్ పాలన కన్న తుగ్లక్ పాలనే నయం: కేటీఆర్
సీఎం పదవిని అధిష్టించే వరకు కిరణ్ కుమార్ రెడ్డి ఎవరో సామ్యానుడికి తెలియదని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మరోసారి మండిపడ్డారు. శనివారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ... సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పాలన కన్నా పిచ్చి తుగ్లక్ పాలనే నయమని కేటీర్ అభిప్రాయపడ్డారు. ఎలక్టెడ్ సీఎం కాదు, సెలెక్టడ్ సీఎం అని కిరణ్ కుమార్ రెడ్డిని ఎద్దేవా చేశారు.
సీఎం పదవిని అధిష్టించే వరకు కిరణ్ కుమార్ రెడ్డి ఎవరో సామ్యానుడికి తెలియదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కిరణ్ కుమార్ రెడ్డికి నైతిక విలువలు లేవని పేర్కొన్నారు. ఆయనకు ఆ విలువలే ఉంటే సీఎం పదవి నుంచి కిరణ్ ఎప్పుడో తప్పుకునేవారని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. సీఎం కిరణ్ అజ్ఞానం అనే తిమిరంలో విహరిస్తున్నారన్నారు. సీఎంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అంశంపై తమ పార్టీ సమావేశాల్లో చర్చిస్తామని కేటీఆర్ వెల్లడించారు.