పిడుగులు.. జిల్లాలో మృత్యుగంట మోగిస్తున్నాయి. రెండ్రోజుల వ్యవధిలో ఐదుగురిని బలిగొన్నాయి. వ్యవసాయ పనులకు వెళ్లిన రైతు కుటుంబాలపై మృత్యువు పిడుగై పడుతోంది. ఉట్నూర్ మండలానికి చెందిన తండ్రీకొడుకులు, వాంకిడికి చెందిన మహిళ పిడుగుపాటుకు గాయపడి చికిత్స పొందుతూ చనిపోయారు. తాజాగా తాండూర్ మండలం అచ్చులాపూర్‌లో మామాఅల్లుడు దుర్మరణం చెందారు.
తాండూర్, న్యూస్‌లైన్ :
మండలంలోని అచ్చులాపూర్ గ్రామంలో శుక్రవారం రాత్రి భారీ వర్షంతోపాటు పిడుగు పడడంతో గ్రామానికి చెందిన బామండ్లపల్లి పోచయ్య(60), చెన్నూరుకు చెందిన కమ్మల రాజయ్య(25) మృత్యువాత పడ్డారు. వివరాలిలా ఉన్నాయి.. అచ్చులాపూర్‌కు చెందిన బామండ్లపల్లి పోచయ్య కుమారుడు మహేశ్ తన బావమరిది చెన్నూరుకు చెందిన కమ్మల రాజయ్యతో కలిసి గ్రామ శివారులో వ్యవసాయం చేస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి వ్యవసాయ పనులు ముగించుకుని పోచయ్యతోపాటు అతని కుమారులు మహేశ్, సంతోశ్, కమ్మల రాజయ్య(మహేష్ బావమరిది) ఇంటికి వస్తున్నారు. మహేశ్ తమ ఎడ్లను పట్టుకుని అందరి కంటే మందు నడుస్తుండగా, వెనకాల ఎడ్లబండిపై పోచయ్య, సంతోశ్, రాజయ్య వస్తున్నారు. అదే సమయంలో భారీ వర్షం కురియడంతోపాటు ఒక్కసారిగా ఎడ్లబండిపై పిడుగు పడింది. దీంతో బండిలో ఉన్న పోచయ్య, రాజయ్య అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు.
సంతోశ్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ ఘటనలో తండ్రి మృతిచెందగా ఇద్దరు కుమారులు ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు. హఠాత్తుగా సంభవించిన ఈ పరిణామంతో పోచయ్య, రాజయ్య కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది. మృతుడు పోచయ్య అచ్చులాపూర్ సర్పంచ్ చవుళ్ల లక్ష్మికి కన్న తండ్రి.
‘పిడుగు’ విషాదం ఐదుగురు రైతుల మృత్యువాత
Published Sat, Sep 21 2013 2:16 AM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
Advertisement
Advertisement