ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, విశాఖపట్నం: నైరుతి రుతుపవనాలు తిరోగమనం మొదలయ్యాక రాష్ట్రంలో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కొద్ది రోజుల క్రితం వరకు ఉపరితల ఆవర్తనాలు ఏర్పడి తేలికపాటి వర్షాలు కురిసేవి. కానీ ఇప్పుడు అల్పపీడన ద్రోణులు ఏర్పడుతున్నాయి. నైరుతి నుంచి దక్షిణ బంగాళాఖాతం మధ్య మహారాష్ట్ర వరకు తమిళనాడు, కర్ణాటక మీదుగా ఒక ద్రోణి, ఆగ్నేయ బంగాళాఖాతం పరిసరాల్లో మరొక ద్రోణి కొనసాగుతోంది.
వీటి ప్రభావంతో మంగళ, బుధవారాల్లో కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడ పిడుగులు పడే ప్రమాదం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం వెల్లడించింది. ద్రోణుల వల్ల పగటి పూట ఉష్ణోగ్రతలు అధికంగా నమోదై క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి ఆకస్మిక వర్షాలతో పాటు మెరుపులు, ఉరుములు, పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గడచిన 24 గంటల్లో చింతలపూడిలో 7 సెం.మీ, సంతమగుళూరులో 5, అచ్చంపేటలో 3 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment