ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, విశాఖపట్నం : తుపాను, బలమైన గాలులు వీస్తాయనే హెచ్చరికల నేపథ్యంలో విశాఖ వాతావరణ హెచ్చరికల కేంద్రం కళింగపట్నం, భీమునిపట్నం, గంగవరం, విశాఖపట్నం పోర్టుల్లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం బలపడి తుపాను మారనుందని వాతావరణ శాఖ తెలిపింది. కాగా, ఈ తుపానుకు ‘టిట్లీ’ పేరును సూచించనున్నారని సమాచారం. టిట్లీ ప్రభావం శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలపై తీవ్రంగా ఉండనుందని అధికారులు తెలిపారు. (చదవండి : ఉత్తరాంధ్ర వైపు ‘టిట్లీ’ తుఫాన్! )
రేపు, ఎల్లుండి విస్తారమైన వర్షాలు
కళింగపట్నానికి ఆగ్నేయంగా 510 కిలోమీటర్ల దూరంలో ‘టిట్లీ’ కేంద్రీకృతమై ఉందని అధికారులు వెల్లడించారు. వాయుగుండం బలపడి ఈరోజు రాత్రి (మంగళవారం) లేదా రేపు ఉదయం తుపానుగా మారే అవకాశం ఉందని అన్నారు. పశ్చిమ వాయువ్య బంగాళాఖాతం దిశగా కొన్ని గంటలపాటు ప్రయాణించి ఈ నెల 11న కళింగపట్నం (ఏపీ) - గోపాలపూర్ (ఒడిషా) మధ్య తుపాను తీరం దాటి పశ్చిమ బెంగాల్ వైపు కదులుతుందని అధికారులు తెలిపారు. తుపాను తీరం దాటే సమయంలో ఉత్తర కోస్తాలో రేపు, ఎల్లుండి ఒక మోస‍్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అన్నారు.
ఈ రోజు తీరం వెంబడి గంటకు 45-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. బుధవారం 55-65 కిలోమీటర్ల వేగంతో, గురువారం 80-100 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని చెప్పారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందనీ, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment