అసెంబ్లీ అభ్యర్థుల విషయంలో కొరవడిన స్పష్టతఎమ్మిగనూరు, మంత్రాలయంలో గందరగోళం
మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికల్లో నాయకత్వలోపం
అభ్యర్థుల ఎంపికలో ‘టీజీ’ నిర్ణయానికి ప్రాధాన్యం
తేలని మాజీ మంత్రి బీవీ తనయుడి భవితవ్యం
‘మంత్రాలయం’ కోసం మండల నాయకుల పోటీ
ఎమ్మిగనూరు, న్యూస్‌లైన్: ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీలో నిస్తేజం నెలకొంది. ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ప్రకటించినా.. ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల విషయంలో స్పష్టత కరువైంది. ఈ రెండు నియోజకవర్గాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలతో పాటు ఎమ్మిగనూరులో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. ఈ నేపథ్యంలో నడిపించే నాయకుడు ఎవరో తెలియక శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. ఎమ్మిగనూరు అసెంబ్లీ అభ్యర్థిగా మాజీ మంత్రి బి.వి.మోహన్‌రెడ్డి కుమారుడు జయనాగేశ్వరరెడ్డిని ప్రకటిస్తారని అందరూ భావించినా.. మారుతున్న పరిణామాలతో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వారం రోజులుగా ఆయన హైదరాబాద్‌లో తిష్ట వేసినా పార్టీ అధినేత స్పందించకపోవడం ఇందుకు బలం చేకూరుస్తోంది. ఆ తర్వాత కలిసినా.. మొదట మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపించుకుంటే ఆ తర్వాత చూద్దామనే అధినేత మాటలను బీవీ వర్గీయులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదే సమయంలో బాబు ఆదేశాలతో ఇటీవల ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్న టీజీ వెంకటేష్ ఎమ్మిగనూరు రాజకీయాల్లోనూ చక్రం తిప్పుతున్నారు. ఈయన చిన్ననాటి మిత్రుడు, రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి శివశంకర్ సతీమణిని చైర్‌పర్సన్ అభ్యర్థిగా ప్రకటించారు.
పార్టీ తరఫున పోటీ చేసేందుకు ముందుకొచ్చే అభ్యర్థులకు కూడా టీజీయే ఆర్థిక వనరులను సమకూరుస్తున్నట్లు చర్చ జరుగుతోంది. చేసేది లేక బీవీ అభ్యర్థులచే నామినేషన్లు వేయించడం, వారి తరఫున ప్రచారం చేయడంతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. ఎమ్మిగనూరు నుంచి పోటీకి పత్తికొండ ఎమ్మెల్యే కేఈ ప్రభాకర్, కాంగ్రెస్ నాయకులు ప్యాలకుర్తి తిక్కారెడ్డి, వై.రుద్రగౌడ్‌లతో పాటు నంద్యాల డివిజన్‌కు చెందిన ఇరువురు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది.
మంత్రాలయంలో అనిశ్చితి
నియోజకవర్గ అభ్యర్థిగా ఇప్పటి వరకు ఎవరినీ ప్రకటించకపోవడం ప్రాదేశిక ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇక్కడి నుంచి మండల స్థాయి నాయకులు అసెంబ్లీ టిక్కెట్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మంత్రాలయం మండలం నుంచి మాధవరం రామిరెడ్డి, కోసిగి మండలం నుంచి బి.టి.నాయుడు, కౌతాళం మండలం నుంచి ఉలిగయ్య, చందాఖాన్, పెద్దకడబూరు మండలం నుంచి గుడిసె కృష్ణమ్మ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో ఎవరి పట్లా అధినేత ఆసక్తి చూపడం లేదనే చర్చ జరుగుతోంది. కర్నూలు లోక్‌సభ అభ్యర్థిగా బీసీ వర్గీయులకు అవకాశం కల్పిస్తే.. మంత్రాలయం రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించాలని బాబు భావిస్తున్నట్లు సమాచారం. ఇటు మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ మొదలవడం.. పంచాయతీ నామినేషన్ల ప్రక్రియ మరో వారం రోజుల్లో ప్రారంభం కానున్న తరుణంలోనూ అసెంబ్లీ అభ్యర్థుల విషయంలో టీడీపీ వేచి చూసే ధోరణి శ్రేణులను కలవరపరుస్తోంది.
దేశం.. నిస్తేజం
Published Wed, Mar 12 2014 1:48 AM | Last Updated on Fri, Aug 10 2018 8:01 PM
Advertisement
Advertisement