టైం బాగాలేదు
- గంటాకు అడుగడుగునా గండాలే
- విశాఖ ఎంపీ సీటు బీజేపీకే..
- గంటా..పంచకర్ల సీట్లపై తొలగిన సందిగ్ధత
- చింతలపూడి..పీలా రుసరుస
- టీడీపీలో నిరసన సెగలు
సాక్షి, విశాఖపట్నం : ఏ ముహూర్తాన టీడీపీ తీర్థం పుచ్చుకున్నామో గానీ.. అస్సలు టైం బాలేదు. మన్లో ఎవరో.. ఐరెన్ లెగ్‌లున్నట్టున్నారు..! ఇదీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు గ్యాంగ్ అంతర్మథనం. గత కొన్ని రోజులుగా టీడీపీలో రాష్ట్రంలోని అన్ని సీట్ల కంటే గంటా బృందం సీట్లపై అనిశ్చితే ఎక్కువ. అది కూడా కేవలం గంటా వల్లే కావడం ఆ పార్టీ స్థానిక నేతలకు మింగుడుపడట్లేదు. ఇపుడు స్థానాలపై స్పష్టత వచ్చినా.. గంటా బృందానికి ఆనందంమాత్రం లేదు.
టీడీపీలో చేరినప్పటి నుంచీ గంటా పోటీ చేసే స్థానం జరుగుతోన్న కసరత్తు అంతా ఇంతా కాదు. తొలుత అనకాపల్లి నుంచి బరిలో దిగాలనుకున్న ఆయనకు సొంత సర్వేతో భ్రమలు తొగాయి. గాజువాకపై పెట్టుకున్న ఆశలు పల్లా శ్రీనివాస్‌తో అడుగంటాయి. తర్వాత భీమిలిపై కన్నేశారు. పార్టీ అధిష్టానం మాత్రం శుక్రవారం వరకు ఆయన్ని విశాఖ లోక్‌సభ స్థానం నుంచే బరిలో దించేందుకు ప్రయత్నించింది. పొత్తుల్లో భాగంగా ఈ స్థానాన్ని బీజేపీకి కేటాయించినా వారికి కాకినాడ అప్పగిస్తూ దీన్ని గంటాకు కేటాయించాలనుకున్నారు.
ఈ స్థానంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థితో పోటీపడి గెలిచే అవకాశాల్లేవని తేలడంతో పోటీకి గంటా ససేమిరా అంటూ వచ్చారు. కాకినాడ కంటే తమకు విశాఖ ఎంపీ స్థానమే కావాలని బీజేపీ తేల్చిచెప్పింది. దీంతో గంటా స్థానంపై స్పష్టత వచ్చినట్టు తెలిసింది. ఆయనకు భీమిలి, పంచకర్ల రమేష్‌బాబు యలమంచిలి, పీలా గోవింద్ అనకాపల్లి అసెంబ్లీ స్థానం నుంచి, అనకాపల్లి లోక్‌సభ స్థానం నుంచి అవంతి శ్రీనివాసరావు బరిలో నిలిచేందుకు జాబితా సిద్ధమైనట్టు సమచారం.
దీంతో గంటాను నమ్ముకుని టీడీపీ తీర్థం పుచ్చుకున్న గాజువాక ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య, యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. మరోవైపు యలమంచిలి స్థానాన్ని పంచకర్లకు కేటాయిస్తారన్న సమాచారంతో ఆ స్థానంపై ఆశలు పెట్టుకున్న సుందరపు విజయ్‌కుమార్ కత్తులు నూరుతున్నారు.
కాగా భీమిలి స్థానం కేటాయిస్తున్నారన్న ఆనందం గంటాలో లేశమాత్రమైనా కానరావట్లేదని ఆ పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. జీవీఎంసీలో భీమిలి మున్సిపాలిటీతోపాటు, సమీపంలోని ఐదు గ్రామపంచాయితీల విలీనానికి గంటాయే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటి వరకు గంటా బృందానికి చెందిన అవంతి శ్రీనివాసరావు ఇక్కడ బరిలో నిలిస్తే మూకుమ్మడిగా ఓడించడానికి స్థానికులు సన్నద్ధమయ్యారు.