
మీడియాతో మాట్లాడుతున్న సీవీఎస్‌ఓ
తిరుపతి (అలిపిరి) : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భక్తుల రద్దీ ప్రాంతాల్లో బాడీ వోర్న్ కెమెరాలతో భద్రత పర్యవేక్షిస్తున్నామని టీటీడీ సీవీఎస్‌ఓ ఆకె రవికృష్ణ అన్నారు. మంగళవారం తిరుమలలోని మీడియా కేంద్రంలో ఆయన మాట్లాడారు. భద్రతకు 25 కెమెరాలను తెప్పించామని, భద్రతా సిబ్బంది వీటిని చొక్కాకు తగిలించుకుని తిరుగుతూ అపరిచిత వ్యక్తులను గుర్తిస్తారని తెలిపా రు. మాడవీధులు, గ్యాలరీల్లో ఇప్పటికే పలుమార్లు తనిఖీలు నిర్వహించామన్నారు.
కమాండ్ కంట్రోల్‌రూం నుంచి సీసీటీవీల ద్వారా భద్రత పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. గరుడసేవకు 40 మంది పోలీసు అధికారులు, 400 మంది హోంగార్డులు అదనంగా విధులు నిర్వహిస్తారన్నారు. గరుడ సేవకు ఏడు వేల వాహనాలను మాత్రమే తిరుమలకు అనుమతిస్తామన్నారు. తరువాత వచ్చే వాహనాలను తిరుపతిలోని అలిపిరి వద్ద దేవలోక్ ప్రాంగణంలో పార్క్ చేసేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఖాళీ పార్కింగ్ ప్రదేశాలను గుర్తించేందుకు తిరుపతి పోలీసులు బ్రహ్మోత్సవ పార్కింగ్ ట్రాకర్ యాప్‌ను రూపొందించారన్నారు. ఈ సమావేశంలో పీఆర్వో రవి, ఏపీఆర్వో నీలిమ పాల్గొన్నారు.