సాక్షి, తిరుపతి : కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ.. తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలలో భక్తుల ప్రవేశాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ఇందుకు సంబంధించి టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ మీడియాతో మాట్లాడుతూ.. శ్రీవారి ఆలయం మూసివేయడం లేదని తెలిపారు. భక్తుల ప్రవేశాన్ని తాత్కాలికంగా నిలివేస్తున్నామని చెప్పారు. వారం రోజుల పాటు దర్శనాలు రద్దు చేస్తున్నట్టు వెల్లడించారు. శుక్రవారం నుంచి శ్రీవారికి ఏకాంత సేవలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. పద్మావతి అమ్మవారి ఆలయంలోనూ భక్తుల ప్రవేశం నిలిపివేస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతం వారం రోజుల పాటు ఆంక్షలు అమలవుతాయని వివరించారు. ప్రస్తుతం తిరుమలలో ఉన్న భక్తులకు రాత్రి శ్రీవారి దర్శనం చేయించి తిరుపతికి పంపుతామన్నారు. వారం తర్వాత సమీక్ష నిర్వహించి నిర్ణయాలు ప్రకటిస్తామని అన్నారు. టీటీడీ నిర్ణయాలకు భక్తులు సహకరించాలని కోరారు. టీటీడీ ప్రతిరోజు కరోనా పరిస్థితిపై సమీక్ష చేస్తుందని గుర్తుచేశారు.
టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు చెప్పారు. ఇప్పటికే దేశంలోని కొన్ని ప్రధాన ఆలయాలను మూసివేశారని గుర్తుచేశారు. తిరుమలకు గురువారం ఒక కరోనా అనుమానితుడు వచ్చాడని తెలిపారు. ఆ వ్యక్తికి చెందిన బృందంలో మొత్తం 110 మంది ఉన్నారని.. వారు దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో తిరిగి తిరుమలకు వచ్చారన్నారు. ఆ బృందంలో కొందరికి గుర్తింపు కార్డులు లేవని.. అందుకే వారికి దర్శనం టోకెన్ ఇవ్వలేదని వెల్లడించారు. అస్వస్థతకు గురికాగానే అతని ప్రాథమిక చికిత్స చేయించామని.. అనంతరం రుయా ఆస్పత్రికి పంపిచామని తెలిపారు. కరోనా గురించి రాష్ట్ర ప్రభుత్వ సూచనలు పాటిస్తున్నట్టు చెప్పారు.
ఈ క్రమంలోనే అలిపిరి టోల్ గేట్‌ను టీటీడీ అధికారులు మూసివేశారు. భక్తుల వాహనాలు తిరుమల కొండపైకి వెళ్లకుండా అడ్డుకున్నారు. అలాగే శ్రీవారి మెట్టు, అలిపిరి నడకమార్గాలను కూడా టీటీడీ అధికారులు మూసివేశారు ఇప్పటికే తిరుమలలో ఉన్నవారికి శ్రీవారి దర్శనం చేసి పంపించేందుకు టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, ఇప్పటివరకు ఏపీలో ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా తేలగా.. దేశవ్యాప్తంగా 169 మందికి కరోనా సోకినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
అన్నవరంలో సాధారణ దర్శనాలకు మాత్రమే అనుమతి
సాక్షి, తూర్పుగోదావరి : అన్నవరం సత్యదేవుని ఆలయంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఆలయ అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. శుక్రవారం నుంచి భక్తుల సాధారణ దర్శనాలకు మాత్రమే అనుమతిస్తున్నట్టు చెప్పారు. ఆలయ ఈవో త్రినాధరావు మాట్లాడుతూ.. భక్తులకు అంతరాలయ దర్శనానికి అనుమతి లేదని తెలిపారు. స్వామివారికి జరిగే నిత్య కైంకర్యాలు, సేవలు యథావిథంగా జరుగుతాయని వెల్లడించారు. భక్తులకు వీటిలో పాల్గొనే అవకాశం ఉండదన్నారు. పదేళ్లలోపు చిన్నారులను, అరవై ఏళ్లు పైబడిన వృద్ధులను ఆలయానికి తీసుకురావొద్దని విజ్ఞప్తి చేశారు. ఆలయంలో అన్నదానంకు బదులు పులిహోరా, దద్దోజనం, సాంబారు అన్నం ప్యాకింగ్‌చేసి భక్తులకు అందజేస్తామన్నారు.
చదవండి : ఏపీలో థియేటర్లు, మాల్స్ బంద్
Comments
Please login to add a commentAdd a comment