సాక్షి, తిరుపతి: ఏపీ ఎన్జీవోల సంఘం పిలుపు మేరకు మంగళవారం రహదారుల దిగ్బంధంలో భాగంగా తిరుమల రోడ్డును కూడా అడ్డుకోనున్నారు. తిరుమలకు వాహనాల రాకపోకలు ఉండవు. ద్విచక్ర వాహనాలను కూడా అనుమతించే అవకాశం లేదని నిర్వాహకులు తెలి పారు. తిరుమలకు 38 సంవత్సరాల తర్వాత తొలిసారిగా ఆగస్టు 13వ తేదీన వాహనాల రాకపోకల బంద్ నిర్వహించారు. మరోసారి గత నెల 23, 24 తేదీల్లో తిరుమలకు వాహనాలను నిలిపివేయాలని ప్రయత్నించినా, టీటీడీ అధికారుల విజ్ఞప్తి మేరకు వాయిదా వేశారు.
ఏపీ ఎన్‌జీవోలు ఈనెల 21 నుంచి 30వ తేదీ వరకు ప్రకటించిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం రహదారులను దిగ్బంధించనున్నారు. తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డును కూడా దిగ్బంధించనున్నారు. రెండు రోజులుగా తిరుమలలో రద్దీ ఎక్కువగా ఉంది. అయినప్పటికీ తిరుమల రహదారిని దిగ్బంధం చేయక తప్పడం లేదని, సమైక్య సెగ ఢిల్లీని తాకాలనే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నామని ఎన్జీవోల సంఘం నాయకులు తెలిపారు.
ఎటువంటి ఒత్తిడికీ లొంగేది లేదు : ఆర్డీవో రామచంద్రారెడ్డి
తిరుమల రహదారిని మంగళవారం కచ్చితం గా దిగ్బంధిస్తామని, ఇందులో ఎవరి ఒత్తిళ్లకూ లొంగే ప్రసక్తే లేదని తిరుపతి ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకుడు, ఆర్డీవో రామచంద్రారెడ్డి తెలిపారు. టాక్సీలు, ఇతర వాహనాల య జమానులు కూడా తమకు సహకరిస్తున్నారని అన్నారు. ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ తాము చేస్తున్న రహదారుల దిగ్బంధానికి మద్దతుగా సినిమా థియేటర్లు, వస్త్ర దుకాణాలు, పెట్రోలు బంక్‌లు, హోటళ్ల యజమానులు సహకరిస్తూ, తమ దుకాణాలను మూసివేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు 24 గంటలపాటు రహదారులను దిగ్బంధిం చాల్సి ఉందని ఉందన్నారు. తిరుమలకు ఉదయం ఆరు నుంచి సాయంత్రం 6 గంటల వరకు దిగ్బంధం చేస్తామని ఆయన వివరించారు.