
బరిలో మేము సైతం
బరిలో తామున్నామని కాంగ్రెస్ పార్టీ ఆదివారం ప్రకటించింది. ఫలితంగా తిరుపతి ఉప ఎన్నిక అనివార్యమైంది.
సాక్షి, తిరుమల: బరిలో తామున్నామని కాంగ్రెస్ పార్టీ ఆదివారం ప్రకటించింది. ఫలితంగా తిరుపతి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఫిబ్రవరి 13వ తేదిన తిరుపతి నియోజక వర్గ ఓటర్లు మరోసారి తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆర్.శ్రీదేవిని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ప్రకటించారు. తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ అండదండలతోనే అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది.
వాస్తవానికి తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ మృతి కారణంగా పోటీ చేయరాదని జిల్లా కాంగ్రెస్ కేడర్ అధిష్టానానికి సూచించింది. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో పోటీ చేయాల్సి వస్తే దశాబ్దాలుగా పార్టీ జెండా మోసిన తిరుపతి లేదా పార్టీ సీనియర్ నాయకురాలు ప్రమీలమ్మను పోటీలో నింపాలని కేడర్ పార్టీ అధిష్టానాన్ని కోరింది. ఇది తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్‌కు మింగుడు పడలేదు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని, తాను సూచించిన అభ్యర్థినే నిలిపేలా పావులు కదిపారు. తన అనుచరురాలు, డ్వాక్రా సంఘం నాయకురాలు ఆర్.శ్రీదేవి పేరును అధిష్టానానికి సూచించారు.
పోటీ అనివార్యం కావడంతో గత ఎన్నికల్లో పోటీ చేసిన మబ్బుదేవనారాయణ రెడ్డి తనకు టికెట్టు ఇవ్వాలని, మహిళా కోటా అయితే తమ పేరు పరిశీలించాలని సీనియర్ నాయకురాలు ప్రమీలమ్మ, ఐఎన్‌టీయుసీ జిల్లా నాయకురాలు రాజేశ్వరి, మరికొందరు వేర్వేరుగా పార్టీ టికెట్టు కోసం దరఖాస్తు చేశారు. శ్రీదేవి మినహా మిగిలిన వారు ఎవరికి టికెట్టు ఇచ్చినా కలిసే పనిచేస్తామని తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. దీంతో శ్రీదేవి పేరుతో పాటు మరికొందరి పేర్లు కూడా పంపాలని అధిష్టానం కూడా చింతామోహన్‌కు సూచించింది. ఈ విషయంలో అధిష్టానం పెద్దలు, ఆయన మధ్య విభేదాలు పొడచూపాయి. ఈ నేపథ్యంలోనే నాటకీయ పరిణామాల మధ్య శ్రీదేవి పేరును పార్టీ ప్రకటించింది. దీంతో మహిళా కాంగ్రెస్, మబ్బు కుటుంబం కినుక వహించింది.
వెంకటరమణ కుటుంబంపై ‘చింతా’ ఘాటు విమర్శలు
సుదీర్ఘ కాలంపాటు కాంగ్రెస్ పార్టీలో కొననసాగిన వెంకటరమణ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆఖరి క్షణంలో తెలుగుదేశంపార్టీలోకి చేరారు. ఆపార్టీ టికెట్టుపై పోటీ చేసి గెలుపొందారు. అంతవరకు రాసుకుని పూసుకుని తిరిగిన వెంకటరమణ, చింతా మోహన్ మధ్య విభేదాలు పొడచూపాయి. అయితే, బహిరంగ విమర్శల జోలికెళ్లలేదు. ఆఖరికి వెంకటరమణ మరణం తర్వాత పార్టీ కేడర్ పోటీకి వద్దన్నా ఆయన మాత్రం పోటీ చేయాలనే పట్టుబట్టారు.
తాను అనుకున్న విధంగానే తన అనుచరురాలికి టికెట్టు ఖరారు చేయించారు. ఆ వెనువెంటనే మాటలకు పదును పెట్టారు. ‘వెంకటమణ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఐదేళ్లు ఉండారు. ఏకంగా ఐదువందలకోట్లు సంపాదించారు. పార్టీకి తీరిని నష్టంచేయించారు’ అంటూ ఘాటైన విమర్శలు చేశారు. ఈ మాటలతో వారి మధ్య విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పనక్కరలేదు. తాను చేసిన విమర్శలు వల్ల తిరుపతి ఓటర్లు పునరాలోచన చేస్తారనే నమ్మకాన్ని ఆయన వెలిబుచ్చారు. చేతికి మట్టి గాజులు, మెడలో పసుపు మంగళసూత్రమే ఆస్తిగా ఉన్న శ్రీదేవికి తిరుపతి ప్రజలు ఓటువేసి గెలిపిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
సంప్రదాయాన్ని గౌరవించిన వైఎస్సార్ సీపీ
తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేయడం లేదని వైఎస్సార్‌సీపీ ఇప్పటికే ప్రకటించింది. గత సంప్రదాయాలను పాటించాలని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగనమోహన్‌రెడ్డి సూచనతో పార్టీ కేడర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి, నారాయణస్వామి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఆర్కే రోజా సానుకూలంగా స్పందించారు. ఇందుకు తెలుగుదేశంపార్టీ అధిష్టానంతో పాటు ఆ పార్టీ అభ్యర్థి సుగణమ్మ కూడా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి, పార్టీకి కృతజ్ఞతలు తెలిపింది. అలాగే, సీపీఎంతో పాటు జైసమైక్యాంధ్ర పార్టీ కూడా పోటీ చేయకూడదని నిర్ణయించాయి.
బరిలో మరి కొందరు..నేడు, రేపు నామినేషన్లు
తిరుపతి ఉప ఎన్నిక బరిలో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించడంతో బరిలో నిలిచిన పార్టీలు, అభ్యర్థుల్లో ఒక్కసారిగా హుషారు వచ్చింది. ఆదివారం వరకు లోకసత్తా, జన సంఘ్ పార్టీలతోపాటు మొత్తం 9 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఎన్నిక అనివార్యంకావడంతో సోమ, మంగళవారాల్లో మరికొందరు నామినేషన్లు వేసే అవకాశం ఉంది. నామినేషన్లకు తుది గడువు 27వ తేదీ, 28న నామినేషన్ల పరిశీలన, 30 ఉపసంహరణ, 13న పోలింగ్, 18న లెక్కింపు, 18నాటికి ఎన్నికల కోడ్ ముగుస్తుంది.
కాంగ్రెస్‌కు మళ్లీ పరపతి దక్కేనా?
ఒకప్పుడు తిరుపతి అసెంబ్లీ ఎన్నికల్లో చక్రం తిప్పిన కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర విభజన తర్వాత పరపతి పోయింది. ఎంపీగా చింతామోహన్ ప్రాతినిథ్యం వహించిన తిరుపతిలో గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మబ్బు దేవనారాయణరెడ్డికి కేవలం 2,848 ఓట్లు పడ్డాయి. తిరుపతి కాంగ్రెస్ చరిత్రలో ఇదే అత్యల్పంగా రికార్డు నమోదైంది.
సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకరటమణ మరణంతో ఉప ఎన్నిక అనివార్యైమైంది. దీంతో పోగొట్టుకున్న పరపతిని తిరిగి దక్కించుకోవాలని కాంగ్రెస్ తమ ప్రయత్నాలు ప్రారంభించింది. కృష్ణాజిల్లా నందిగామ ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని నిలబెట్టి ఓటమి చవిచూసినా.. కనీస ఓట్లను రాబట్టుకోవడంలో సఫలీకృతులైంది. అదే బాటను తిరుపతి ఉప ఎన్నికల్లో అమలు చేయాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. అయితే, అభ్యర్థి విషయంలో పార్టీలో ఏకాభిప్రాయం కుదరక పోవడం గమనార్హం.