
సాక్షి పత్రిక నిజాలు రాస్తే మీ గుండాలతో తగలబెట్టావ్.
సాక్షి, విజయవాడ : 40 ఏళ్ల అనుభవం అని చెప్పుకునే సీఎం చంద్రబాబునాయుడు, 40 ఏళ్ల యువకుడి ముందు కుప్పిగంతులు వేస్తున్నారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి టీజేఆర్ సుధాకర్ బాబు మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నవరత్నాలు ప్రకటిస్తే చంద్రబాబు దగాకోరు రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు నిజస్వరూపం బట్టబయలు చేయడమే తమ లక్ష్యమని సుధాకర్ బాబు అన్నారు. చంద్రబాబు హోదా తాకట్టు పెట్టినరోజు కూడా వైఎస్ జగన్ హోదా కోసం పోరాడారని గుర్తు చేశారు.
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలో టీజేఆర్ సుధాకర్ బాబు మాట్లాడుతూ..'డ్వాక్రా మహిళలకు పసుపుకుంకుమ పేరుతో డాంబికాలు ఎందుకు? మహిళలపై ప్రేమ ఉంటే ముందే ఎందుకు ప్రకటించలేదు. దివంగత సీఎం వైఎస్సార్ ప్రారంభించిన పథకాన్ని చంద్రబాబు చిందరవందరగా చేశారు. సాక్షి పత్రిక నిజాలు రాస్తే మీ గుండాలతో తగలబెట్టావ్. అన్ని వర్గాలని మోసగించావ్. మీ 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక్క పథకం అయినా ప్రవేశపెట్టావా? నవరత్నాలు నుంచి అన్ని కాపీ కొట్టావ్. ప్రజలని మోసగించడంలో చంద్రబాబు పీహెచ్‌డీ చేశాడు. బాహుబలిని రాజమౌళి తీస్తే చంద్రబాబు చంద్రబలి తీశారు. 50 వేల ఎకరాల్లో పిచ్చి మొక్కలు మొళిపించిన ఘనత బాబుది. ఓవర్ డ్రాఫ్ట్ కెల్లి అప్పులు చేశారు. ప్రజల నడ్డి విరిచారు. చంద్రబాబు నీ ఆటలు సాగవు, ఇక 60 రోజులే నీ పాలన. నిరుద్యోగ భృతి ఉన్న పళంగా పెంచడం మరో నయవంచన' అని మండిపడ్డారు.