రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం సిద్దాంతి వద్ద బుధవారం ఉదయం స్కార్పియో వాహనాన్ని లారీ ఢీ కొట్టింది. ఆ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను హైదరాబాద్ నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మృతదేహలను స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు. అయితే క్షతగాత్రుల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు.
అలాగే విశాఖపట్నం జిల్లాలోని అనంతగిరి ఘాట్ రోడ్డులో ఈ రోజు ఉదయం ఓ వ్యాన్ బోల్తా పడింది. ఆ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. పోలీసులు మృతదేహలను స్వాధీనం చేసుకుని విశాఖపట్నంలోని కింగ్జార్జ్ ఆసుపత్రికి తరలించారు. మృతులిద్దరి స్వస్థలం కొత్తూరు, జామీ వాసులగా గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. మృతుల కుటుంబసభ్యులకు సమాచారం అందించినట్లు అనంతగిరి పోలీసులు వెల్లడించారు.