
దసరా ఉత్సవాలకు సిద్ధంకావాలి
- ఉత్సవాల ఏర్పాట్లపై సబ్ కలెక్టర్ సమావేశం
- భక్తులకు ఇబ్బందులు కలిగించొద్దు..
- పారిశుధ్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వండి
- ప్రసాదాల కొరత లేకుండా చూడండి
- 4వేల మంది పోలీసులతో బందోబస్తు
విజయవాడ : భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు చేయాలని సబ్ కలెక్టర్ డి.హరి చందన అధికారులను ఆదేశించారు. దసరా ఉత్సవ ఏర్పాట్లపై సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ఆమె సమన్వయ సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సెప్టెంబర్ 25వ తేదీ నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయని, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మెరుగైన ఏర్పాట్లు చేయూలని ఆదేశించారు.
ఉత్సవాలకు వచ్చే లక్షలాది మంది భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఈ ఏర్పాట్లు ఉండాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. పారిశుధ్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ఘాట్లతోపాటు ఇంద్రకీలాద్రిపై ఎప్పటికప్పుడు పారిశుధ్యాన్ని పర్యవేక్షించాలని చెప్పారు. ఘాట్ల వద్ద తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని శానిటేషన్ అధికారులను ఆదేశించారు.
ప్రసాదం తయారీ కేంద్రాల వద్ద అగ్నిమాపక సిబ్బంది తనిఖీలు నిర్వహించాలని, వారి సలహా మేరకు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రసాదం కౌంటర్ల వద్ద తొక్కిసలాట జరగకుండా, అందరికీ ప్రసాదాలు అందేలా చూడాలని చెప్పారు. క్యూలైన్లకు పటిష్టమైన బారికేడింగ్ ఏర్పాటుచేయూలని ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు. అన్ని ఘాట్ల వద్ద వైద్య శిబిరాలు ఏర్పాటుచేయాలని, అత్యవసర మందులను సిద్ధం చేసుకోవాలని వైద్య అధికారులను ఆదేశించారు.
తాగునీటికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, మూలానక్షత్రం రోజున భక్తుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని అదనపు స్టాకును సిద్ధం చేసుకోవాలని సబ్ కలెక్టర్ హరిచందన సూచించారు. చెప్పుల స్టాండ్, సామాన్లు భద్రపరిచే క్లోక్‌రూమ్‌లను అదనంగా ఏర్పాటుచేయాలని ఆదేశించారు. పోలీస్ అధికారులు, సిబ్బందికి సహకరించేందుకు ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్ల సేవలను వినియోగించాలని, వారికి ముందుగా శిక్షణ ఇవ్వాలని యువజన సంక్షేమ శాఖ అధికారిని ఆదేశించారు. కేశఖండన వద్ద బార్బర్లకు గుర్తింపుకార్డులు ఉండాలని చెప్పారు.
డీసీపీ తస్సీర్ ఇక్బాల్ మాట్లాడుతూ దసరా ఉత్సవాల సందర్భంగా సుమారు నాలుగువేల మంది వివిధ స్థాయి పోలీస్ అధికారులు, సిబ్బంది విధులు నిర్వర్తిస్తారన్నారు. ఉత్సవాల తొమ్మిది రోజులూ నగరంలోకి వాహనాలు ప్రవేశించకుండా ట్రాఫిక్ మళ్లిస్తున్నామన్నారు. ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా గొల్లపూడి, సితార, చిట్టినగర్, ఎర్రకట్ట, బుడమేరు బ్రిడ్జి, బెంజిసర్కిల్ వద్ద ఆరు క్రేన్లను సిద్ధం చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో ఆలయ ఎగ్జిక్యూటివ్ అధికారి వి.త్రినాథరావు, ఏసీపీ ఎస్.రాఘవరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.