అనకాపల్లి పట్టణంలోని ఉదయ్ అనే బాలుడు కిడ్నాప్, అపై హత్య చేసి నాలుగు రోజులు గడుస్తున్నా, నిందితుడు తమ అదుపులో ఉన్నా....
► బాలుడి హత్య కేసులో పోలీసుల తీరుపై నిరసన
► పట్టణంలోభారీ ర్యాలీ
► అనకాపల్లి పోలీస్‌స్టేషన్ ముందు వేలాది మంది యువకుల బైఠాయింపు
► బాలుడి హత్య కేసులో పోలీసుల తీరుపై నిరసన
► పట్టణంలో భారీ ర్యాలీ
రెండు రోజులుగా లోలోన రగిలిపోతున్న యువకులు ఒక్కసారిగా రోడెక్కారు. ముక్కుపచ్చలారని బాలుడి ఉదయ్ కిడ్నాప్, హత్య ఉదంతంలో పోలీసుల వైఖరిని నిరసిస్తూ కదం తొక్కారు. మూడు గంటల పాటు పోలీసులకు ముచ్చెమటలు పట్టించారు. నిందితులను కాపాడేందుకు ప్రయత్నిస్తే ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. దీంతో బుధవారం రాత్రి అనకాపల్లి పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.
అనకాపల్లి టౌన్ : అనకాపల్లి పట్టణంలోని ఉదయ్ అనే బాలుడు కిడ్నాప్, అపై హత్య చేసి నాలుగు రోజులు గడుస్తున్నా, నిందితుడు తమ అదుపులో ఉన్నా పోలీసులు గోప్యత పాటిస్తుండటంపై పట్టణ వాసులకు అనుమానాలు రేగుతున్నాయి. ఎక్కడ చూసినా రెండు రోజులుగా ఇదే చర్చ సాగుతోంది. యువకులు సమావేశాలు పెట్టుకుని దీనిపై చర్చించుకున్నారు. ఒక్క ఉదుటున బుధవారం ఆందోళనకు దిగారు. రాత్రి 6.30 గంట నుంచి 9.30 గంటల వరకూ మూడు గంటల పాటు అనకాపల్లి పట్టణ పోలీస్‌స్టేషన్ ముందు వేలాది మంది యువకులు బైఠాయించారు. అంతకు ముందు గవరపాలేనికి చెందిన దాడి జయవీర్ మిత్రమండలి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీగా అనకాపల్లి పట్టణ పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు.
యువకులకు మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ సంఘీభావం తెలిపి ర్యాలీలో పాల్గొనడంతోపాటు పోలీస్‌స్టేషన్ ముందు బైఠాయించారు. దీంతో పోలీస్‌స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఉదయ్ హత్యకేసులో నిందితులందర్నీ కఠినంగా శిక్షించాలని, కేసుకు సంబంధించిన దర్యాప్తు వివరాలను వెల్లడించాలన్న నినాదాలతో హోరెత్తించారు. ఆందోళన కారణంగా అనకాపల్లి మెయిన్‌రోడ్డులో ట్రాపిక్ స్తంభించింది. పోలీస్‌స్టేషన్ వైపు వెళ్లే వాహనాలను ట్రాఫిక్ పోలీసులు మళ్లించారు.
పోలీసులకు ముచ్చెమటలు..
అనకాపల్లి పట్టణ పోలీ్‌స్‌స్టేషన్ ముందు మూడు గంటల పాటు వేలాది మంది యువకులు బైఠాయించడంతో పట్టణ పోలీసులకు ముచ్చెమటలు పట్టాయి. ఎంత సర్దిచెప్పినా యువకులు శాంతించకపోవడంతో ఏం చేయాలో వారికి అర్ధంకాలేదు. ఒకానొక సమయంలో పరిస్థితి అదుపుతప్పుందని భావించారు. అటు పోలీసులు, ఇటు యువకులు సంయమనంతో వ్యవహరించారు.
రెండు రోజుల నుంచి యువకుల సమావేశాలు
గవరపాలెంలోని యువకులు రెండురోజులుగా సమావేశాలు నిర్వహించి బాలుడు ఉదయ్ హత్య కేసు విషయంలో నిందితులు, పోలీసులు వ్యవహార శైలిపై చర్చించారు. పోలీసులు అదుపులో నిందితుడు ఉన్నా, కేసు వివరాలను బహిరంగ పరచకపోడంపై వారు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ కిడ్నాప్, హత్య ఉదంతంలో ఒక్కరికంటే ఎక్కువ మంది ప్రమేయం ఉంటుందని యువకులు భావించి, వారందర్నీ అరెస్ట్ చేయాలన్న డిమాండ్‌తో కదం తొక్కారు.
డీజీపీ హామీతో శాంతించిన యువకులు
అనకాపల్లి పోలీస్‌స్టేషన్ ముందు యువకులు బైఠాయించడంతో పోలీసులు చర్చలు జరిపేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ ఎవరూ శాంతించలేదు. బాలుడ్ని కిడ్నాప్ చేసి హత్య చేసిన కేసు వివరాలను వెల్లడించడంతోపాటు పోస్టుమార్టం నివేదిక, ఇతర దర్యాప్తు అంశాలను ఎందుకు బహిరంగ పరచలేదని యువకులు ప్రశ్నించారు. కిడ్నాప్ అనంతర పరిణామాలపై దాడి జయవీర్ పలు అంశాలను ప్రస్తావించారు. మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ యువకుల ఆందోళనకు మద్దతు తెలపడంతో పోలీసులకు ఏం చేయాలో పాలుపోలేదు. చివరకు కొణతాల రామకృష్ణ డీజీపీతో ఫోన్‌లో మాట్లాడారు.
ఇప్పటి వరకు ఈ కేసు అంశం తన దృష్టికి రాలేదని, విశాఖ ఎస్పీ, డీఐజీలతో మాట్లాడి ఐజీ నేతృత్వంలో కేసును వేగవంతంగా దర్యాప్తు చేయిస్తానని డీజీపీ హామీ ఇవ్వడంతో అదే విషయాన్ని కొణతాల రామకృష్ణ యువకులకు చెప్పారు. దీంతో యువకులు శాంతించి, ఆందోళనను విరమించారు. ఈ కార్యక్రమంలో బాలుడి కుటుంబ సభ్యులతో పాటు బి.ఎస్.ఎం.కె.జోగినాయుడు, మళ్ల సత్యనారాయణ, కనిశెట్టి సురేష్‌బాబు, దూలం గోపీ, మహిళాసంఘాలు, స్వచ్ఛందసంస్థలు, పట్టణ యువత, గౌరీ వ్యాయామ శాల యువకులు, పరమేశ్వరి పార్కు యువకులు పాల్గొన్నారు.