మావోల కట్టడికి కసరత్తు
ఏవోబీలో కీలకప్రాంతాల్లో అవుట్ పోస్టులు
ముందుగా పూర్తికానున్న రాళ్లగెడ్డ కొత్తూరు అవుట్‌పోస్టు
శతృదుర్భేద్యంగా నిర్మాణం
జూలై నాటికి రానున్న బీఎస్‌ఎఫ్ బెటాలియన్
భయంనీడన ఆరు గిరిజన గ్రామాలు
మన్యంలో మావోయిస్టుల కార్యకలాపాలను పూర్తిగా నిరోధించేందుకు పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. ముందుగా మావోయిస్టుల ప్రభావం అధికంగా ఉన్న అయిదు మండలాల్లో పోలీసు అవుట్ పోస్టులను ఏర్పాటుచేయనున్నారు. చింతపల్లి మండలం రాళ్లగెడ్డ కొత్తూరులో ఏర్పాటు చేస్తున్న అవుట్‌పోస్టు మార్చి చివరికి లేదా ఏప్రిల్ మొదటి వారం నాటికి పూర్తికానుంది. వీటిని శత్రు దుర్భేద్యంగా నిర్మిస్తారు. ఒకవేళ మావోయిస్టులు వాటిపై దాడి చేసినా వారిని తిప్పికొట్టే విధంగా వీటి నిర్మాణం ఉంటుంది. కేంద్రం కూడా సరిహద్దు భద్రత బలగాలు (బీఎస్‌ఎఫ్) బెటాలియన్‌ను కేటాయించింది. మరో వైపు గడిమామిడి ఎన్‌కౌంటర్ జరిగి వారం దాటినా ఆ ప్రాంతంలో భయం వీడలేదు.
కొయ్యూరు: ఏవోబీలో మావోయిస్టుల రాకపోకలను కట్టడి చేసేందుకు పోలీసు శాఖ గట్టి చర్యలు తీసుకుంటోంది. కీలక ప్రాంతాల్లో అవుట్ పోస్టులను ఏర్పాటు చేస్తోంది. రాళ్లగెడ్డ అవుట్‌పోస్టు పూర్తికాగానే పెదబయలులో రూఢకోట వద్ద రెండో అవుట్‌పోస్టును ఏర్పాటు చే యనున్నారు. దాని తరువాత గూడెంకొత్తవీధి మండలం జెర్రెల, జి.మాడుగుల మండలం మద్దిగరువు, ముంచంగిపుట్ మండలం లక్ష్మీపురం వద్ద అవుట్ పోస్టులను ఏర్పాటు చేయనున్నారు. బీఎస్‌ఎఫ్‌కు చెందిన ఏడు కంపెనీల నుంచి 700 మంది ఈ అవుట్ పోస్టుల వద్ద కాపలా కాస్తారు. స్థానిక పోలీసులు వారికి సహాయకులుగా ఉంటారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి భాష సమస్య కావడంతో స్థానిక పోలీసులు ఉంటాల్సి ఉంటుంది.
గతానికి భిన్నంగా..
గతంలో అవుట్ పోస్టులున్నా వాటికి సరైన రక్షణ ఉం డేది కాదు. దీంతో మావోయిస్టులు వాటిపై దాడులు చేసేందుకు అవకాశం ఉండేది. అప్పట్లో ధారకొండ, పెదవలస అవుట్‌పోస్టులపై దాడులు చేశారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఎదురు కాకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నారు. ఏపీ నుంచి ఒడిశాకు, అటు నుంచి ఇటువైపునకు మావోయిస్టులు సులువుగా రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో వారి రాకపోకలను నిలువరించాలంటే వారు సంచరించే ప్రాంతాల్లో అవుట్ పోస్టులు కీలకమని భావించి వీటి నిర్మాణం చేపట్టారు. ఇవి పూర్తయిన త్వరలో రానున్న బీఎస్‌ఎఫ్ జవాన్లకు వీటిని అప్పగిస్తారు. పూర్తయిన పోస్టుల వద్ద బీఎస్‌ఎఫ్ బలగాలు ఉంటే వారికి సహాయంగా స్థానిక పోలీసులుంటారు. ఈ ఏడాది జూలై నాటికి బీఎస్‌ఎఫ్ బలగాలు ఈప్రాంతంలోకి వచ్చే అవకాశం ఉంది. గతంలో మాదిరిగా కాకుండా గిరిజనులతో స్నేహపూర్వక వాతావరణం ఏర్పాటు చేసుకోవాలని భావిస్తున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
భయం నీడన ఆరు గ్రామాలు
గిరిజనులను ఎన్‌కౌంటర్ భయం ఇప్పటికీ వీడలేదు. ఈ నెల 21న పుట్టకోట సమీపంలో గడిమామిడి వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌తో ఆ ప్రాంతంలో ఆరు గ్రామాలు భయం నీడన ఉన్నాయి. ఇదివరకు అడవిలోకి స్వేచ్ఛగా వంటచెరకు లేదా అటవీ ఉత్పత్తులు సేకరణు వెళ్లే గిరిజనులు ఇప్పుడు అడవిలోకి వెళ్లాలంటే భయపడుతున్నారు. కాకులమామిడి, జ్యోతులమామిడి, పుట్టకోట, బొబ్బిలిలంక, పెదలంక, కొత్తూరు గ్రామాలను నేటికీ భయం వదలలేదు. వారం మొత్తం సేకరించిన అటవీ ఉత్పత్తులను సంతకు తీసుకువచ్చి అమ్ముకుంటారు. గడిమామిడి సంఘటనతో అడవికి వెళ్లడాన్ని తగ్గించారు. ఇదివరకు ఎవరికి వారు వంటచెరకు కోసం వెళ్లే వారు. ఇప్పుడు భయంతో పదిమంది వరకు కలిసి అడవికి వెళ్తున్నారు. ఇక రాత్రయితే బయటకు రావడం లేదు.