భూసేకరణ వేగవంతం చేయండి
ఒంగోలు టౌన్: జిల్లాలోని ప్రాజెక్టులు, జాతీయ రహదారుల విస్తరణకు సంబంధించిన భూసేకరణ వేగవంతం చేయాలని కలెక్టర్ సుజాతశర్మ ఆదేశించారు. శనివారం స్థానిక సీపీఓ కాన్ఫరెన్స్ హాలులో ఎన్‌హెచ్-545 దేవులపల్లి - మార్కాపురం, మార్కాపురం - వగ్గంపల్లి సెక్షన్, వగ్గంపల్లి - దోర్నాల టీ జంక్షన్, ఎన్‌హెచ్-216 చీరాల - ఒంగోలు సెక్షన్‌కు సంబంధించి భూసేకరణపై సమీక్షించారు. కురిచేడు - దొనకొండ కొత్త రైల్వే స్టేషన్ ఏర్పాటు గురించి తెలుసుకున్నారు. కొత్త బ్రాడ్‌గేజ్ లైన్, నడికుడి - శ్రీకాళహస్తి సెక్షన్‌కు సంబంధించి చర్చించారు. ఎన్‌హెచ్-565కు సంబంధించి ప్యాకేజీ 2, 3, 4ల్లో సర్వే పూర్తి అయినప్పటికీ స్క్రూట్నీ పెండింగ్‌లో ఉండటం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.
కందుకూరు డివిజన్‌లో నిమ్స్, మెగా ఇండస్ట్రీయల్ హబ్‌కు సంబంధించి భూసేకరణకు అవసరమైన సర్వేయర్లను ఒంగోలు, మార్కాపురం డివిజన్లలోని ఆరుగురిని కందుకూరు ఆర్‌డీఓ కార్యాలయంలో రిపోర్టు చేసేలా ఉత్తర్వులు జారీ చేయాలని జాయింట్ కలెక్టర్-2కు సూచించారు. ఎన్‌హెచ్-216కు సంబంధించి చీరాల, వేటపాలెం, చినగంజాం, నాగులుప్పలపాడు, మద్దిపాడు, ఒంగోలులో సర్వే చేపట్టాలని ఒంగోలు ఆర్‌డీఓను ఆదేశించారు. కందుకూరు ఆర్‌డీఓ మల్లికార్జున మాట్లాడుతూ నిమ్స్‌కు సంబంధించి ఇప్పటివరకు పదివేల ఎకరాలు సర్వే పూర్తి చేశామని, మరో రెండువేల ఎకరాల్లో చేయాలని వివరించారు. సీఎస్‌పురం, వెలిగండ్లలో ఏర్పాటు చేయనున్న మెగా సోలార్ పార్క్‌కు సంబంధించి బ్లాకుల వారీగా ప్రతిపాదనలు పంపించాలన్నారు. గుండ్లకమ్మ ప్రాజెక్టుకు సహాయ పునరావాస కేంద్రాల్లో పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. జాయింట్ కలెక్టర్-2 ఐ ప్రకాష్‌కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి నూర్‌బాషాఖాశిం, భూసేకరణ స్పెషల్ కలెక్టర్ నాగరాజారావు తదితరులు పాల్గొన్నారు.