ప్లాట్లు వేసి అమ్మేస్తున్నారు
గజం రూ.20 వే లకు విక్రయం
రామకృష్ణాపురం, ఇందిరానాయక్ నగర్‌లో ఆక్రమణలు
పట్టించుకోని ఇరిగేషన్ అధికారులు
విజయవాడ : బుడమేరు కబ్జా కోరల్లో చిక్కుకుంది. విజయవాడ 53వ డివిజన్ పరిధిలోని రామకృష్ణాపురం ప్రాంతంలో ఈ కబ్జా దర్జాగా సాగిపోతోంది. ఏకంగా ప్లాట్లు వేసి అమ్మేస్తున్నారు. ఇప్పటికే 40 ప్లాట్లు అమ్మేశారు. గజం రూ.20 వేలు వంతున ఒక్కో ప్లాటు రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల చొప్పున విక్రయించేశారు. కొనుగోలు చేసినవారు ప్రహరీలు కట్టుకోవటం, మట్టి తోలి బుడమేరును పూడ్చేయటం వంటి పనుల్లో నిమగ్నమయ్యారు. ఇందిరానాయక్ నగర్ ప్రాంతంలోనూ బుడమేరును కబ్జా చేసి ప్లాట్ల అమ్మకాలు చేపట్టినట్లు సమాచారం.
టీడీపీ ఎమ్మెల్యే అండ!
నగరంలోని ఒక టీడీపీ ఎమ్మెల్యే అండతో ఈ అక్రమ తంతు యథేచ్ఛగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఆయనకూ వాటాలు వెళుతున్నాయని సమాచారం. బుడమేరు కాలువలో డ్రెయినేజీ నీరుతో పాటు వరద నీరు కూడా వస్తుంది. సత్యనారాయణపురం పైభాగానికి వచ్చేసరికి వెడల్పు సుమారు అర కిలోమీటరు వరకు ఉంటుంది. ఇక్కడే ఈ కబ్జాలు జోరుగా జరుగుతున్నాయి. రానురానూ కాలువను పూడ్చి ఇళ్లు కట్టుకుంటున్నారు.
పలు ప్రాంతాలకు ముప్పు
వరదల సమయంలో బుడమేరు ఉగ్రరూపం దాల్చినప్పుడు భగత్‌సింగ్ నగర్, ఆంధ్రప్రభ కాలనీ, పాయకాపురం, ప్రకాష్ నగర్‌లు మునకకు గురవుతుంటాయి. కబ్జాలు ఎక్కువ కావడంతో బుడమేరు మార్గం కుంచించుకుపోవటమే దీనికి ప్రధాన కారణం. ప్రస్తుత కబ్జాలతో ముంపు తీవ్రత మరింత పెరిగే ప్రమాదముందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
కబ్జా కోరల్లో బుడమేరు
Published Fri, Feb 5 2016 2:11 AM | Last Updated on Sun, Sep 3 2017 4:57 PM
Advertisement
Advertisement