ఓటు వజ్రాయుధం వంటిది. ఇదే ఓటు జారిపోతే భావి భారత పౌరులుగా విఫలమైనట్టే.. ఓటు నమోదు చేసుకునే వయసున్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అవినీతి ప్రభుత్వాలను పెంచిపోషించినట్టే.. మొన్న జరిగిన ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో యువత ఓట్లే కీలకంగా మారాయి..!
ఓటు వజ్రాయుధం వంటిది. ఇదే ఓటు జారిపోతే భావి భారత పౌరులుగా విఫలమైనట్టే.. ఓటు నమోదు చేసుకునే వయసున్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అవినీతి ప్రభుత్వాలను పెంచిపోషించినట్టే.. మొన్న జరిగిన ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో యువత ఓట్లే కీలకంగా మారాయి..! ఎన్నికల సంఘం ఓటు నమోదు చేసుకునే సదావకాశాన్ని కల్పించింది.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.. ఓటుహక్కును సాధించుకోండి.. అవినీతిపై సమరశంఖం పూరించండి.. మంగళవారం చివరి రోజు.. సాయంత్రం ఐదు గంటల వరకే సమయం ఉంది.. యువతీయువకులు
రండి.. కదలిరండి..
ఆదిలాబాద్, న్యూస్‌లైన్ :
2014 సాధారణ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ఓటర్ల జాబితా, సవరణ, కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం నవంబర్ 18న ప్రారంభించింది. డిసెంబర్ 10వ తేదీతో ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమం పూర్తికావాల్సి ఉండగా గడువును 17వ తేదీకి పెంచింది. మంగళవారంతో గడువు ముగియనుంది. జిల్లాలో 1,94,498 కొత్త ఓటర్ల నమోదు లక్ష్యం కాగా ఈనెల 15 వరకు 1,38,431 మంది దరఖాస్తు చేసుకున్నారు. చివరి రోజైన మంగళవారం 18 ఏళ్లు నిండిన యువతీయువకులు నిర్లిప్తత వీడి ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం ఉంది. వచ్చే సాధార ణ ఎన్నికల్లో ఓటు వేయాలంటే ఓటర్ల జాబితాలో తమ పేరు నమోదైం ఉండాలి. ఒక వేళ జాబితాలో పేరు లేకపోతే దరఖాస్తు చేసుకోవాలి. మంగళవారం వరకు దరఖాస్తు చేసుకున్న వారందరి పేర్లు జనవరి 25 నాటికి ఓటర్ల జాబితాలో ఉంటాయి. వారికి గుర్తింపు కార్డులు జారీ అవుతాయి. ఈ రోజు తర్వాత కూడా ఓటరుగా నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంది. అయితే వాటిని ఫిబ్రవరి లేదా మార్చిలోగా అధికారులు పరిష్కరించడం సాధ్యం కాదు. ఈలోగా ఎన్నికలు వస్తే ఓటు వేయడానికి అవకాశం ఉండదు. అందువల్ల జాబితాలో పేర్లు లేని అర్హులు మంగళవారం ఓటరుగా నమోదు చేసుకోవడానికి మంచి అవకాశం.
గుర్తింపు కార్డు పొందండి..
జనవరి 1, 2014 వరకు 18 ఏళ్లు నిండిన వారు ఒక పాస్‌పోర్ట్ సైజు ఫొటో, జనన ధ్రువీకరణ పత్రం, తీసుకుని మీ సమీపంలోని బూత్ స్థాయి అధికారులను సంప్రదించండి. ఒక నియోజకవర్గంలో నమోదై ఉండి వేరే నియోజకవర్గానికి మారినట్లయితే కూడా ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. నిరక్షరాస్యులైతే తల్లిదండ్రులచే అఫిడవిట్‌ను జతచేయాలి. ఏ పేరునైన జాబితా నుంచి తొలగించాలనుకుంటే, అభ్యంతరాలు వ్యక్తం చేయాలనుకుంటే (చనిపోయిన, నివాసం మారినప్పుడు మొదలైనవి) ఫారం-7 ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఓటర్ జాబితాలోని మన వివరాల్లో ఏవైన మార్పులు చేయాలనుకుంటే(ఫొటోలు, మీ పేరు, తండ్రి, భర్త, భార్య పేర్ల సవరణ మొదలగునవి) ఫారం-8 ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
అదే నియోజకవర్గం పరిధిలో మీ నివాసం ఒక పోలింగ్ స్టేషన్ పరిధి నుంచి మరో పోలింగ్ స్టేషన్ పరిధికి మార్చడానికి ఫారం-8ఏ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవం రోజున గుర్తింపు కార్డు (ఎపిక్) అందజేయడం జరుగుతుంది. తద్వారా యువతీయువకులు మొదటిసారి ఓటు వేసే అనుభూతిని పొందేందుకు ఇది మంచి అవకాశం.
జిల్లా జనాభా : 27.41 లక్షలు
పురుషులు : 13,69,597
మహిళలు : 13,71,642
మొత్తం ఓటర్లు : 17,42,691
పురుషులు : 8,80,290
మహిళలు : 8,62,401
ఓటరు నమోదు లక్ష్యం : 1,94,498
వచ్చిన దరఖాస్తులు : 1,38,431