వేరుశెనగ పంపిణీ నేడే
ఇంకా చాలీచాలని సబ్సిడీ విత్తనాలే
కావాల్సింది లక్ష క్వింటాళ్లు
వచ్చింది 12వేల క్వింటాళ్లే
చిత్తూరు (అగ్రికల్చర్): సబ్సిడీ వేరుశెనగ విత్తన కాయల ధరలను నిర్ణయించడానికే సమయాన్నంతా వృథా చేసిన అధికారులు వాటిని జిల్లాకు దిగుమతి చేసుకోవడంలో కూడా అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. ఖరీఫ్ సీజనుకు రైతులకు సబ్సిడీపై వేరుశెనగ విత్తనకాయలు సరఫరా చేయాల్సిన ప్రభుత్వం నెల రోజులుగా వాటి ధర నిర్ణరుుంచే విషయంలో మీనమేషాలు లెక్కించింది. ఎట్టకేలకు ఈ నెల 21 తేదీన ధర ప్రకటించింది. కానీ ఇప్పటికి కూడా అవసరమైన మేరకు విత్తనకాయలను దిగుమతి చేసుకోలేకపోరుుంది. ప్రభుత్వం ప్రకటించిన మేరకు ఈ నెల 25 (బుధవారం)న చాలీచాలని విత్తనాలతోనే పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిన పరిస్థితి నెలకొంది.
జిల్లాలో ఈ సీజనుకు వేరుశెనగ సాగు సాధారణ విస్తీర్ణం 1,36,479 హెక్టార్లు. ఇందుకుగాను 1.05 లక్షల క్వింటాళ్ల వేరుశెనగ కాయలు అవసరం. ఇందులో ఇప్పటికి 12 వేల క్వింటాళ్లు మాత్రమే జిల్లాకు చేరాయి.
నెల చివరలోనే వేరుశెనగ కాయలు రైతులకు అందించాల్సి ఉంది. సాధారణంగా జూన్ 15 నుంచి జూలై 15వ తేదీలోగా వేరుశెనగ కాయలు విత్తేందుకు మంచి అదను. ఈ ఏడాది ప్రభుత్వం సీజను దాటిపోయే సమయానికి విత్తనకాయల ధర ప్రకటించింది. దీనికితోడు ఇప్పటికి జిల్లాకు చేరిన 12 వేల క్వింటాళ్ల విత్తనకాయలతో 51 మండలాల్లో అధికారులు పంపిణీ కార్యక్రమం ప్రారంభించనున్నారు. అధికారులు ప్రకటించిన ప్రకారం ఈ నెలాఖరుకుగానీ రైతులకు పూర్తి స్థారుులో విత్తనకాయలు పంపిణీచేసే సూచనలు ఏమాత్రం కనిపించడం లేదు. తొలుత 35 వేల క్వింటాళ్లకాయలను జిల్లాకు తెప్పించి పంపిణీ ప్రారంభిస్తామని జిల్లా వ్యవసాయశాఖ జేడీ ప్రకటించారు. కానీ అది నెరవేరలేదు.