విత్తుపైనా..బెత్తమే | Vittupaina .. rod | Sakshi
Sakshi News home page

విత్తుపైనా..బెత్తమే

Published Thu, May 22 2014 4:49 AM | Last Updated on Sat, Sep 2 2017 7:39 AM

విత్తుపైనా..బెత్తమే

విత్తుపైనా..బెత్తమే

  •      సబ్సిడీ వేరుశెనగ విత్తనాలకు నగదు బదిలీ
  •      పూర్తి నగదు చెల్లిస్తేనే వేరుశెనగ విత్తనాలు
  •      ఆపై రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నగదును జమ చేస్తారట
  •      40 శాతం మంది రైతులకుబ్యాంకులో ఖాతాల్లేవు
  •      జిల్లాలోని రైతన్నలపై 15 కోట్ల భారం
  •  వంట గ్యాస్ సబ్సిడీ పంపిణీలో నగదు బదిలీ అభాసుపాలైనా అధికారుల తీరులో మార్పు కనిపించడం లేదు. వచ్చే నెల మొదటి వారంలో జిల్లాలో ప్రారంభం కానున్న సబ్సిడీ వేరుశెనగ విత్తన కాయల పంపిణీ సైతం నగదు బదిలీ ద్వారా చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. దీనికి సం బంధించిన ఉత్తర్వులు జేడీ కార్యాలయం నుంచి జిల్లాలోని అన్ని ఏడీ కార్యాలయాలకు అందాయి. తొలుత ప్రైవేటు మార్కెట్లో ఉన్నంత పూర్తి ధరతో రైతులు నగదు చెల్లించి వేరుశెనగ విత్తన కాయలను పొందాలట. ఆపై రైతుల ఖాతాల్లోకి సబ్సిడీ సొమ్ము జమ చేస్తారట. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు.
     
    పలమనేరు, న్యూస్‌లైన్: జిల్లాలో 11 వ్యవసాయశాఖ డివిజన్లు ఉండగా ప్రస్తుతం 9 డివిజన్లలో మాత్రం ఈ విత్తన కాయలను జూన్ మొదటి వారంలో అందజేయనున్నారు. సత్యవేడు, శ్రీకాళహస్తి మినహా మిగిలిన 53 మండలాల్లో ఈ పంపిణీ జరగనుంది. ఖరీఫ్‌కు సంబంధించి లక్ష క్వింటాళ్ల విత్తనాలను సుమారు 4 లక్షల మందికి పైగా రైతులకు అందజేయాలని అధికార యం త్రాంగం సిద్ధమవుతోంది. ఈ దఫా కే-6 అనే రకం విత్తనాలను పంపిణీ చేయనున్నారు.
     
    30 కిలోల బస్తాకు సబ్సిడీ రూ.450


    ఈ దఫా వ్యవసాయ శాఖ 30 కిలోల వేరుశెనగ బస్తాకు ధర రూ.1380గా నిర్ణయించింది. ఇందులో 33 శాతం (రూ.450)  సబ్సిడీతో వీటిని అందజేస్తారు. ఒక్కో రైతుకు మూడు బస్తాల చొప్పున  ఇవ్వనున్నారు. ప్రభుత్వ ధర ప్రకారం ఓ బస్తా రూ.1380 కాగా, మొత్తం ధర చెల్లించి విత్తనాలను పొం దాల్సి ఉంది. ఆపై రైతుల ఖాతాల్లోకి రూ.450 సబ్సిడీని జమ చేయనున్నా రు. అయితే రైతులు పట్టదారు పాసుపుస్తకంతో పాటు బ్యాంకు అకౌంట్‌ను ఇవ్వాల్సి ఉంది. పాసుపుస్తకంలో యజమానిగా ఉన్న వ్యక్తి పేరు మీదనే బ్యాంకు ఖాతా కూడా ఉండాలట.
     
    జిల్లాలోని రైతన్నలపై రూ.15 కోట్ల భారం
     
    వ్యవసాయ శాఖ లక్ష క్వింటాళ్ల వేరుశెనగ విత్తనాలను పంపిణీ చేయనుంది. దీనికయ్యే మొత్తం ఖరీదు రూ.46 కోట్లు. ఇందులో సబ్సిడీ రూ.15 కోట్లు. ఈ మొత్తాన్ని రైతులు ఫుల్‌కాస్ట్ రూపేణా ముందుగానే చెల్లించాల్సి ఉంది. అసలే కష్టాల్లో ఉన్న రైతన్నకు మొత్తం ధర చెల్లించడం ఇబ్బందే. దీంతో ఈ దఫా సబ్సిడీ వేరుశెనగ విత్తనాలపై ఆసక్తి చూపరని వ్యవసాయాధికారులే పెదవి విరుస్తున్నారు.
     
    నగదు బదిలీలో ఇబ్బందులేమంటే

    జిల్లాలోని 40 శాతం మంది రైతులకు బ్యాంకుల్లో వ్యక్తిగత ఖాతాల్లేవు. ఒకవేళ ఉన్నా పాసుబుక్ కలిగిన వారి పేరిటే ఖాతాల్లేవ్. దీంతో రైతుకు మూడు బస్తాలకందే రూ.1350 కోసం బ్యాంకులో రూ.1000 డిపాజిట్ చెల్లించి ఖాతా పొందడం కష్టంగా మారనుంది. పాసుపుస్తకంలో యజ మానులుగా ఉన్న పలువురు రైతులు మృతిచెందారు. వారి వారసులకు ఇంతవరకు పాసుపుస్తకాలు బదిలీ కాలేదు.

    ఇలాంటి వారు భూములను ట్రాన్స్‌ఫర్ చేసుకొనేదెప్పుడు? ఆపై విత్తనాలు పొందేదెప్పుడు? ఒకవేళ ఖాతాలున్న రైతులకు సంబంధిత బ్యాంకుల్లో అప్పులుంటే బ్యాంకర్లు ఆ వచ్చే సబ్సిడీ నగదును రుణానికి జమ చేసుకోవడం ఖాయం. ఇలాంటి పరిస్థితుల మధ్య వేరుశెనగ పంపిణీలో నగదు బదిలీ అభాసుపాలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

    ఇప్పటికే పలువురు రైతులు ఈ పద్ధతిని విమర్శిస్తున్నారు. ఈ విషయమై పలమనేరు వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు రమేష్‌ను ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా సబ్సిడీ విత్తనాల పంపిణీలో నగదు బదిలీ కాస్త ఇబ్బందని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. అయితే ప్రభుత్వ పాలసీ కాబట్టి తాము ఏమీ చేయలేమన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement