=మానవతా దక్ఫథంతో వ్యాధిగ్రస్తులను ఆదరించాలి
=రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ పీడీ పార్థసారథి
విద్యారణ్యపురి, న్యూస్‌లైన్ : సమాజంలో వివక్ష జీవించి ఉన్నంతకాలం హెచ్‌ఐవీని నియంత్రించడం సాధ్యం కాదని రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ ప్రాజెక్టు డెరైక్టర్ పి.పార్థసారథి అన్నారు. హెచ్‌ఐవీ అనగానే ఎయిడ్స్ అని భయపడొద్దని, వ్యాధిగ్రస్తుల పట్ల అందరూ మానవత్వంతో వ్యవహరించాల్సిన అవసరముందని పేర్కొన్నారు. జిల్లాలోని వివిధ కళాశాలల రెడ్‌రిబ్బన్ క్లబ్ విద్యార్థులు, అధ్యాపకులకు శుక్రవారం హన్మకొండలోని కాకతీయ డిగ్రీ కళాశాలలో ఒక రోజు వర్క్‌షాప్ ఏర్పాటుచేశారు.
వర్క్‌షాప్‌ను ప్రారంభించిన పార్థసారథి మాట్లాడుతూ 2003-04 సంవత్సరంలో వరంగల్ జాయింట్ కలెక్టర్‌గా పనిచేసిన కాలంలో హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై అవగాహన కల్పించేందుకు విస్తతంగా ప్రచారం నిర్వహించామని గుర్తుచేశారు. అప్పట్లో ఎయిడ్స్‌కు మందు లేకపోగా నియంత్రణే ప్రధానమని ప్రచారం చేశామని, అయితే ఇప్పుడు నియంత్రణకు కూడా మందులు లభిస్తున్నాయని తెలిపారు. హెచ్‌ఐవీ పాజిటివ్‌ను వైరస్‌గానే భావించాలని, ఆ తర్వాత కొన్నేళ్ల తర్వాత వ్యాధిగ్రస్తులు ఎయిడ్స్ బారిన పడతారని వివరించారు.
ఎయిడ్స్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎంత ప్రచారం చేసినా కొత్తగా కేసులు వెలుగు చూస్తున్నాయని, కాకపోతే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది సంఖ్య తగ్గిందని పార్థసారథి వివరించారు. అయితే, జీరో స్థాయికి తీసుకురావాలన్న తమ లక్ష్యం నెరవేరడం లేదని పేర్కొన్నారు. కళాశాలల్లో రెడ్‌రిబ్బన్ క్లబ్‌ల ద్వారా హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై విస్తత ప్రచారం చేయిస్తూ ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లను భాగస్వాములను చేస్తున్నామని తెలిపారు.
ఓటు హక్కు మాదిరిగానే రక్తదానం
యువతీయువకులు 18ఏళ్లు రాగానే ఓటు హక్కు పొందినట్లుగానే రక్తదానం చేయాలని పార్థసారథి సూచించారు. స్వచ్ఛందంగా అందరూ రక్తదానానికి ముందుకొస్తే రక్తాన్ని అమ్ముకుంటున్న వారి ఆగడాలకు అడ్డుకట్ట పడుతుందన్నారు. జిల్లాలోని బ్లడ్ బ్యాంకులు ఎన్ని, ఎంత రక్తం అవసరమవుతుందో అంచనా వేసి అంతే మేర రక్తం సేకరించాలని సూచించారు. అంతేతప్ప ఎక్కువగా సేకరిస్తే నిరుపయోగమయ్యే ప్రమాదముందని తెలిపారు.
సామాజిక సేవగానే భావించాలి
విద్యార్థులు చదువుకుంటూనే సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని, రక్తదానాన్ని కూడా సామాజిక సేవగా నే భావించాలని జాయింట్ కలెక్టర్ పౌసుమి బసు సూచిం చారు. ఎయిడ్స్ వ్యాప్తిని అరికట్టేందుకు నియంత్రణే మార్గమన్నారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్ పి.సాంబశివరావు మాట్లాడుతూ జిల్లాలో హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై విస్తత ప్రచారం నిర్వహిస్తున్నామని తెలిపారు. నెహ్రూ యువకేంద్రం బాధ్యుడు మనోరంజన్ కుమార్ మాట్లాడుతూ ఈ ఏడాది 35వేల యూనిట్ల రక్తాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. కేయూ ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ బి.సురేశ్‌లాల్ మాట్లాడుతూ ఈ విద్యాసంవత్సరంలో కేయూ ఎన్‌ఎస్‌ఎస్ మూడు జిల్లాల పరిధిలో 20వేల యూనిట్ల రక్తాన్ని సేకరించనున్నట్లు పేర్కొన్నారు.
కేడీసీ ప్రిన్సిపాల్ ఆర్.మార్తమ్మ అధ్యక్షతన జరిగిన ఈ వర్క్‌షాప్‌లో అడిషనల్ డీఎంహెచ్‌ఓ డాక్టర్ సూర్యప్రకాష్‌రావు, కోఆర్డినేటర్ బి.విక్టర్‌తో పాటు ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ బాధ్యులు, అధ్యాపకులు ఈ.శ్రీనివాస్, స్వప్నమాధురి, కల్యాణి, టి.స్వామి, జి.రమేష్, డాక్టర్ సోమిరెడ్డి, డాక్టర్ ఎన్‌వీఎన్.చారి, రజనీ లత, వినోలియా మిల్కా, డాక్ట ర్ చంద్రమౌళి పాల్గొన్నారు. కాగా, తొలుత కేడీసీలో ఎన్‌సీసీ వలంటీర్లచే పార్థసారథి గౌరవ వందనం స్వీకరించారు. అలాగే, కేడీసీలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని పార్థసారథి ప్రారంభించారు.