నడ్డివిరిచిన ‘నమో’
ఒంగోలు: బడ్జెట్ కంటే ముందే మోడీ ప్రభుత్వం రైలు చార్జీల పెంపునకు పచ్చజెండా ఊపింది. ఒక తరగతి అని పేర్కొనకుండా అందరిపైనా భారం మోపుతూ నిర్ణయం తీసుకుంది. మరో వైపు బడ్జెట్‌లో ఇంకెటువంటి నిర్ణయాలు అమలు చేస్తారో అనే భయమూ ప్రజల్ని వెంటాడుతోంది. అధికారంలోకి వచ్చి పట్టుమని నెలరోజులు గడిచాయో లేదో చడీచప్పుడు కాకుండా రైల్వే చార్జీలు 14.2 శాతం మేర పెంచుతూ మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పెరిగిన ధరలు ఈనెల 24వ తేదీ అర్ధరాత్రి నుంచి అంటే 25వ తేదీ నుంచి అమలులోకి వస్తాయని రైల్వేశాఖ ప్రకటించింది.
= సాధారణంగా చార్జీల పెంపు సమయంలో ప్యాసింజర్ ప్రయాణికులు,
రెండో తరగతి జనరల్ ప్రయాణికులపైనా భారం పడకుండా రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంటుంది. కానీ ఈ సారి అన్ని రకాల ప్రయాణికులపైనా భారం మోపారు.
= 6.5 శాతం చొప్పున సరుకుల రవాణా చార్జీలను కూడా పెంచుతూ రైల్వేశాఖ తీసుకున్న నిర్ణయం వల్ల వ్యవసాయ ఉత్పత్తులు, వ్యవసాయ అనుబంధ వస్తువుల ధరలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉందని రైతులు, వ్యాపారవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
= జిల్లా నుంచి ఎక్కువగా సుబాబుల్, జామాయిల్ కర్రలతోపాటు గ్రానైట్ రవాణా అవుతోంది. మరో వైపు ఎరువులు, సిమెంటు దిగుమతులు ఉండనే ఉన్నాయి.
ఒంగోలు నుంచి ముఖ్య పట్టణాలకు రైల్వే చార్జీలు:
పట్టికలో పేర్కొన్న చార్జీలు కేవలం రెండో తరగతి సాధారణ ఛార్జీలు మాత్రమే. సూపర్ ఫాస్ట్ రైలు టికెట్‌కు అదనంగా రూ.15 కలుపుకోవాలి. దీంతోపాటు బెర్తు రిజర్వేషన్ తదితరాలు అదనం.
రైల్వే ప్రయాణికులపై పెనుభారం: సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి కేవీ ప్రసాద్
రైలు ప్రయాణ చార్జీలు పెంచుతూ తీసుకున్న నిర్ణయం దారుణం. ఒక వైపు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నపుడు కనీసం పార్లమెంట్‌లో ప్రస్తావించకుండా చార్జీలను ఏకపక్షంగా పెంచడం బాధాకరం. ఇది సహేతుకం కాదు. వ్యవసాయ అనుబంధ వస్తువులైన ఎరువులు తదితరాల ధరలు కూడా పెరగడం ఖాయం. ఇదే జరిగితే రైతు పంట పండించడమే గగనంగా మారుతుంది. కనుక రైల్వే చార్జీల పెంపును ఉపసంహరించుకోవాలని కోరుతున్నాం.