విజయనగరం మున్సిపాలిటీ: జిల్లాలోని గ్రామ పంచాయతీ కార్యదర్శుల బదిలీలకు కొత్త మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ఈనెలాఖరులోగా పూర్తికావాల్సిన ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వం నిబంధనలను వెల్లడించింది.
విజయనగరం మున్సిపాలిటీ: జిల్లాలోని గ్రామ పంచాయతీ కార్యదర్శుల బదిలీలకు కొత్త మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ఈనెలాఖరులోగా పూర్తికావాల్సిన ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వం నిబంధనలను వెల్లడించింది. మూడు సంవత్సరాల పైబడి ఒకే చోట విధులునిర్వహిస్తున్న వారికి తప్పనిసరిగాబదిలీ చేయాల్సి ఉండగా.. వారిని క్లస్టర్ పరిధిలోనే ఉంచాలని ఆదేశాల్లో స్పష్టం చేసింది. అదేవిధంగా 3 సంవత్సరాలలోపు ఒకే చోట పని చేస్తున్న వారికి రిక్వెస్ట్ బదిలీకి అవకాశం కల్పించింది. ఇందులో ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్న వారికి, స్పౌజ్, కుటుంబసభ్యులు మందబుద్ధి గల వారికి, పీహెచ్ అభ్యర్థులకు సడలింపు ఉంటుంది.
ఈ ప్రక్రియను ఈనెలాఖరుకు పూర్తి చేయాలని ఆదేశాల్లో స్పష్టం చేసింది. నిబంధనల మేరకు జిల్లాలోని 490 క్లస్టర్ల పరిధిలో గల 921 గ్రామ పంచాయతీల్లో విధులు నిర్వహిస్తున్న 505 పంచాయతీ కార్యదర్శులకు బదిలీలు జరగనున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇదిలా ఉండగా జిల్లా పంచాయతీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు ఈ సారి స్థాన చలనం తప్పనిసరిగా మారింది. ప్రభుత్వం విధించిన నిబంధనల ప్రకారం మూడేళ్లు ఒకే చోట విధులు నిర్వహిస్తున్న వారికి బదిలీ తప్పని సరి కావడంతో కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు సీనియర్ అసిస్టెంట్, నలుగురు జూనియర్ అసిస్టెంట్‌లతో పాటు మిగిలిన సిబ్బంది బదిలీల జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది.