
ముగిసిన ట్రిపుల్ ఐటీ కౌన్సెలింగ్
స్థానిక ట్రిపుల్ ఐటీలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న ప్రవేశాల కౌన్సెలింగ్ గురువారం ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి వచ్చిన అభ్యర్థులకు ఉదయం 8గంటల నుంచే ప్రవేశాల కౌన్సెలింగ్ నిర్వహించారు.
- 890 మందికి ప్రవేశాలు
నూజివీడు : స్థానిక ట్రిపుల్ ఐటీలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న ప్రవేశాల కౌన్సెలింగ్ గురువారం ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి వచ్చిన అభ్యర్థులకు ఉదయం 8గంటల నుంచే ప్రవేశాల కౌన్సెలింగ్ నిర్వహించారు. రెండోరోజు అంతకుముందురోజు గైర్హాజరైన వారిలో ఒకరు రావడంతో అతనితో కలిపి మొత్తం 416మందిని కేటాయించగా అందులో 20మంది గైర్హాజరయ్యారు. మిగిలిన 396మంది కౌన్సెలింగ్‌లో పాల్గొనగా, వారిలో నలుగురి అడ్మిషన్లు పెండింగ్‌పెట్టారు. మిగిలిన 392మందికి ప్రవేశాలు కల్పించారు. చివరిరోజు విద్యార్థులకు, వారితో పాటు వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లను చేశారు. మంచినీరు, ఉచిత భోజన వసతి కల్పించారు.
890 మందికి ప్రవేశం....
నూజివీడు ట్రిపుల్‌ఐటీకి 936మంది అభ్యర్థులను ఆర్జీయూకేటీ కేటాయించగా రెండు రోజులపాటు నిర్వహించిన కౌన్సెలింగ్‌లో 890మంది విద్యార్థులకు ప్రవేశం కల్పించారు. రెండు రోజుల్లో 40మంది అభ్యర్థులు కౌన్సెలింగ్‌కు గైర్హాజరయ్యారు. కౌన్సెలింగ్‌కు రాని అభ్యర్థులు ఇంటర్, పాలిటెక్నిక్ వంటి కోర్సుల్లో చేరి ఉండవచ్చని ట్రిపుల్‌ఐటీ అధికారులు భావిస్తున్నారు. అనంతరం మిగిలిన సీట్ల భర్తీని వెయిటింగ్ లిస్టులో ఉంచిన అభ్యర్థులతో నింపనున్నారు. ఈ సీట్లకు 26,27తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.
ఇప్పటికే వెయిటింగ్ లిస్టు యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో ఉన్నప్పటికీ వెయిటింగ్ లిస్టులో ఎంపికైన వారికి యూనివర్సిటీ అధికారులు ఫోన్ ద్వారా సమాచారం అందించనున్నారు. కౌన్సెలింగ్ ప్రక్రియను ట్రిపుల్ ఐటీ డెరైక్టర్ ఇబ్రహీంఖాన్‌తో పాటు, ఓఎస్‌డీ రామకృష్ణారెడ్డి, పీఆర్వో వీరబాబు, ప్రొఫెసర్లు హనుమంతరావు, రామనర్శింహం, పర్యవేక్షించారు. సందేహాలను డెరైక్టర్ కార్యాలయ సిబ్బంది రాజగోపాలరెడ్డి, చెన్నారెడ్డి, రామకిషోర్ నివృత్తి చేశారు. కౌన్సెలింగ్‌లో దాదాపు 100మంది ట్రిపుల్‌ఐటీ సిబ్బంది విధులు నిర్వహించారు. అలాగే నూజివీడు ఏఎస్‌డబ్ల్యువో మేరీమాత, ఏబీసీడబ్ల్యువో జయరాజులు ఎస్సీ, బీసీ కుల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించారు.
ఓరియంటేషన్ తరగతులు ...
ఆరు సంవత్సరాల సమీకృత ఇంజినీరింగ్‌విద్యకు సంబంధించిన మొదటి సంవత్సరం తరగతుల్లో భాగంగా ఓరియంటేషన్ తరగతులు 28నుంచి ప్రారంభించనున్నట్లు డెరైక్టర్ ఇబ్రహీంఖాన్ తెలిపారు. కౌన్సెలింగ్‌లో సీటు వచ్చిన విద్యార్థులందరూ తరగతులకు హాజరవ్వాలని పేర్కొన్నారు. సీటు లభించిన వారందరికీ గుర్తింపు కార్డులు జారీ ప్రక్రియ పూర్తయిందన్నారు. 29నుంచి రెగ్యులర్ తరగతులు ప్రారంభమవుతాయన్నారు.
అవధుల్లేని సంతోషం...అంతులేని ఆనందం
రోజువారీ కూలీ నాలీ పనులు చేసుకుని రోజులు గడిపే పేద కుటుంబాలకు చెందిన ప్రతిభ గల పిల్లలందరికీ .... ట్రిపుల్‌ఐటీలో సీట్లు లభించడంతో వారి ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. ప్రవేశాలు పొందిన వారిలో 85శాతం మంది నిరుపేద కుటుంబాలకు చెందిన వారే. ఈ నేపథ్యంలో ట్రిపుల్‌ఐటీలో సీట్లు పొందిన పలువురు విద్యార్థినీ విద్యార్థులు తమ మనోగతాన్ని సాక్షితో పంచుకున్నారు...
ఎంతో ఆనందంగా ఉంది
తల్లిదండ్రులు లేనప్పటికీ బాబాయి, మామయ్యల సంరక్షణలో చదువుకున్నా. జెడ్పీహైస్కూల్‌లో చదువుకోగా పదిలో 9.7జీపీఏ వచ్చింది. పేద కుటుంబమైనప్పటికీ ట్రిపుల్‌ఐటీలో సీటు రావడం ఎంతో సంతోషంగా ఉంది.
- జి.అనిత, అనంతవరప్పాడు, గుంటూరు జిల్లా
కల నెరవేరింది
ట్రిపుల్‌ఐటీలో సీటు సాధించాలనే లక్ష్యంతో చదివా. సీటు రావడంతో కల నెరవేరినట్లైంది. పదిలో 9.5జీపీఏ వచ్చింది. వ్యవసాయ కూలి కుటుంబం కావడంతో డబ్బులు పెట్టి చదివించే స్థోమత లేదు. ట్రిపుల్‌ఐటీలో సీటు రావడం ఒక రకంగా అదృష్టమే.
- నూతక్కి జాన్సీరాణి, నూతక్కి. గుంటూరు జిల్లా
ఉద్వేగంగా ఉంది
ట్రిపుల్‌ఐటీలో సీటు లభించడం ఎంతో ఆనందంగా, ఉద్వేగంగా ఉంది. తండ్రి తాపీ పనిచేసి కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆరోతరగతి నుంచి హైస్కూల్‌లో చదివా. పదిలో 9.7 జీపీఏ వచ్చింది. ఇంజినీరుగా బయటకు వచ్చి సమాజానికి సేవ చేస్తా.
- మురికిపూడి ప్రవీణ, వినుకొండ
నాన్న కల నేరవేరింది
నా తండ్రి సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నారు. రాజమండ్రిలోని మున్సిపల్ హైస్కూల్‌లో పదోతరగతి వరకు చదువుకున్నా. పదిలో 9.5జీపీఏ వచ్చింది. ట్రిపుల్‌ఐటీలో సీటు లభించడం ఎంతో ఆనందంగా ఉంది. మా తండ్రి కల నెరవేర్చా.
- పమిడిపల్లి పూర్ణబాబు, రాజమండ్రి
అమ్మ కష్టానికి ఫలితం
మా నాన్న చిన్నప్పుడే చనిపోవడంతో అమ్మ కూలిపనులు చేసుకుంటూ చదివించింది. మండపేటలోని జెడ్పీ హైస్కూల్‌లో పదోతరగతి వరకు చదువుకున్నా. పదిలో 9.7 జీపీఏ వచ్చింది. అమ్మ పడిన కష్టానికి ఫలితం దక్కింది.
- కానూరు దుర్గాప్రసాద్, మండపేట
ఉన్నత స్థానమే లక్ష్యం
మా నాన్న ప్రసాద్ కూలిపనులకు వెళ్లి తెచ్చే నాలుగు కాసులతోనే ఇల్లు గడుస్తుంది. పదో తరగతి వరకు నర్సాపురంలోని హాస్టల్‌లో ఉండి చదువుకున్నా. పదిలో 9.7జీపీఏ వచ్చింది. ఇంజినీరింగ్‌లో రాణించి ఉన్నత స్థానాలకు వెళ్లాలన్నదే లక్ష్యం.
- కట్టా లావణ్య, శేరివేల్పూరు, గుడివాడ మండలం