శ్రీకాకుళం టౌన్: జిల్లాలో బయోమెట్రిక్ విధానం అమలుతో గత నెలలో 2.44 లక్షల కుటుంబాలకు సరుకులు అందకుండా పోయాయి. మంచంపై ఉన్న వారైనా వేలిముద్ర, ఐరిష్ లేకపోతే సరుకులను నిలిపివేశారు. దీనివల్ల అనేక కుటుంబాలకు తిండిగింజలు లేని పరిస్థితి దాపురించింది. సుమారు 13,400 కుటుంబాలు రేషన్ తీసుకునేందుకు రాలేని పరిస్థితి ఉన్నా సరుకులు ఇవ్వలేదు. వారికి సరుకులు ఇవ్వాలన్నా పౌరసరఫరాలశాఖ కమిషనర్ నుంచి ఉత్తర్వులు రావాల్సిఉందని జిల్లా యంత్రాంగం దాటవేస్తున్నారు. దీంతో నాలుగు నెలలుగా రేషన్ కష్టాలు పేదలకు ముప్పుతిప్పలు పెడుతున్నాయి.
ఈ-పాస్ అమలులో మూడో స్థానం
ఈ-పాస్ అమలులో జిల్లా మూడో స్థానంలో ఉంది. ఇందులో అగ్రభాగం కృష్ణా జిల్లా. ఇక్కడ 82 శాతం కుటుంబాలకు ఈ-పాస్ ద్వారా సరుకులు నాలుగు నెలలుగా పంపిణీ చేస్తున్నారు. రెండో స్థానం అనంతపురం. ఇక్కడ కూడా 77 శాతం కార్డులకు మాత్రమే సరుకులు ఇస్తున్నారు. ఇక శ్రీకాకుళం జిల్లాది మూడో స్థానం. ఇక్కడ కేవలం 70 శాతం కార్డులకు మాత్రమే గత నెలలో సరుకులు అందజేశారు.
పౌరసరఫరాల శాఖ మొండి పట్టుదల
ప్రజలకు అందినా అందక పోయినా పర్వాలేదు. మీరు మాత్రం ఈ-పాస్ విధానాన్నే అమలు చేయాలంటూ పౌరసరఫరాలశాఖ మొండిపట్టుదలతో ముందుకెళుతోంది. 30 శాంత కుటుంబాలకు అసలు నిత్యావసర సరుకులే అందకుండా పోతే ఇక ప్రభుత్వం చెబుతున్న ఆహార భద్రత అమలు ఎలా సాధ్యమని ప్రజలు నిలదీస్తున్నారు. రాష్ట్రంలో బయోమెట్రిక్ పద్ధతిలో ఈ-పాస్ విధానాన్ని పౌరసరఫరాల శాఖ ప్రవేశపెట్టింది. సెప్టెంబరు నుంచి క్షేత్రస్థాయిలో ఈ విధానాన్ని అమలు చేస్తూ ప్రభుత్వం ఈ-పాస్ యంత్రాలను సరఫరా చేసింది. డీలర్లకు అవగహన కల్పించిన అధికారులు క్షేత్రస్థాయిలో అమలుకు సిద్ధపడ్డారు. జిల్లాలో ఈ విధానం అమలుకు 2001 మంది డీలర్లకు ఈ-పాస్ యంత్రాలను అందజేసిన ప్రభుత్వం బయోమెట్రిక్ కార్డుల అనుసంధానంతోనే సరుకులు ఇవ్వాలని నిర్ణయించింది. అప్పటినుంచి రేషన్ కార్డులు ఉన్నా సరుకులు అందడం లేదని లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారు.
జిల్లా 8.14 లక్షల తెలుపు రేషన్ కార్డులు
జిల్లాలో జన్మభూమి రేషన్‌కార్డులతో కలిపి ప్రస్తుతం 8,14,406 తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. వీటికి ప్రభుత్వం పంపిణీ చేయాల్సిన బియ్యం, పంచదార, కందిపప్పు, కిరోసిన్, గోదుమలు, గోదుమ పిండి పౌరసరఫరాల దుకాణం ద్వారా పంపిణీ చేస్తున్నారు. అంత్యోదయ, అన్నపూర్ణ కార్డులకు సైతం సరుకులు పంపిణీ చేస్తున్నారు. ఆహారభద్రత చట్టం అమలు పేరుతో కార్డుదారులందరికీ సరుకులు పంపిణీ చేసేవారు. తాజాగా ఈ-పాస్ విధానంతో ఈ చట్టానికి తూట్లు పడుతున్నాయి. ఈ-పాస్ విధానం అమలులో మొదట్లో ఎదురైన సమస్యలనుంచి గట్టెక్కిస్తామన్న ప్రభుత్వం కొత్తగా మరికొన్ని వేలిముద్ర మెషిన్లను సరఫరా చేసింది. వాటిని కొత్తసర్వరుకు అనుసంధానం చేసినా పాతపరిస్థితే కొనసాగుతోంది.
తీరని ఈ-పాస్ కష్టాలు
Published Wed, Feb 10 2016 12:13 AM | Last Updated on Sun, Sep 3 2017 5:17 PM
Advertisement