
'మంగళగిరిలో టీఆర్ఎస్ నేతలకు భూములు'
తిరుపతి: రాష్ట్ర విభజన అంటూ జరిగితే రాయలసీమ జిల్లాలో కొత్త రాజధాని ఏర్పాటు చేయాలని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి డిమాండ్ చేశారు. ఎంపీలు పదవులకు రాజీనామా చేసినా రాష్ట్ర విభజన ప్రక్రియ ఆగదని అన్నారు. సమైక్యాంధ్ర కోసం ఏ నాయకుడు చిత్తశుధ్దితో పనిచేయడం లేదని ఆయన ఆరోపించారు.
మంగళగిరి వద్ద కొత్త రాష్ట్రానికి రాజధాని నిర్మించుకోవడం కోసమే పార్టీలన్ని ఢిల్లీ వెళ్తున్నాయని ఆయన అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీ, కాంగ్రెస్ సహా అన్ని పార్టీల నేతలు మంగళగిరి వద్ద భూములు కొన్నారని తెలిపారు. టీఆర్ఎస్ నాయకులు కూడా అక్కడ భూములు కొన్నారని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్‌ను మూడు రాష్ట్రాలుగా విభజించాలని అంతకుముందు ఆయన డిమాండ్ చేశారు. రాయలసీమ వాసులమైన తాము కోస్తా ప్రాంతంతో ఎట్టిపరిస్థితుల్లో కలిసి ఉండలేమన్నారు. విభజన అనివార్యమైతే 1953-56లో ఉన్న పరిస్థితి (కర్నూలు రాజధాని)ని యథాతథంగా కొనసాగించాలన్నారు. రాజధాని హైదరాబాద్‌కు మారడంతో కర్నూలు రాజధానిని కోల్పోయమని, ఇప్పుడు ఎక్కడో మంగళగిరి, గుంటూరులో రాజధాని ఇస్తే ఒప్పుకోమని స్పష్టం చేశారు.