తిరుపతి అర్బన్: టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఉచిత కల్యాణాల కోసం మే 9న అక్షయ తృతియ పర్వదినం నుంచి ఆన్‌లైన్‌లో అప్లికేషన్లను స్వీకరించనున్నట్లు ఈవో డాక్టర్ సాంబశివరావు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై గురువారం రాత్రి తిరుపతిలోని పరిపాలనా భవనంలోని తన కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ అక్షయ తృతియ రోజు నుంచి తిరుమలలోని కల్యాణ వేదికలో ఉచిత కల్యాణాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు.
ఉచిత దర్శనం, వసతి, లడ్డూ ప్రసాదాల పంపిణీ కోసం అప్లికేషన్‌లోనే దరఖాస్తు చేసుకునేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఐటీ విభాగం అధికారులను ఆదేశించారు. అలాగే నూతన వధూవరులతో పాటు వారి తల్లిదండ్రులకు రూ.300 దర్శనం క్యూ ద్వారా ఉచిత దర్శనానికి అనుమతించేలా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. దర్శనానంతరం చిన్న లడ్డూలు, పసుపు, కుంకుమ పంపిణీ చేపట్టాలన్నారు.
ఉచిత పెళ్లిళ్ల ఆన్‌లైన్ దరఖాస్తుల్లో ముఖ్యంగా వధూవరుల పదో తరగతి సర్టిఫికెట్, లేదా రేషన్ కార్డు, లేదా ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ కార్డులను క్షుణ్ణంగా పరిశీలించాలని కోరారు. రిజిస్ట్రేషన్ కోసం ఆన్‌లైన్ విధానంలో కానీ, టీటీడీ వారి ఈ-దర్శన్ కౌంటర్ల ద్వారా గానీ వినియోగించుకోవాలన్నారు. అలాగే ఇందుకోసం వేదిక ఆవరణంలో ఏర్పాటు చేసిన సహాయ కేంద్రంలో కూడా సంప్రదించి రిజిస్టర్ చేసుకోవచ్చన్నారు.