ఆలయంలోకి పుట్టమన్నును తలపై మోసుకెళ్తున్న ఆలయ ప్రధాన అర్చకుడు వేణుగోపాల దీక్షితులు
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయ అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణకు శనివారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఆదివారం నుండి 16వ తేదీ వరకు వైఖానస ఆగమోక్తంగా వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. శ్రీవారి ఆలయంలోని అదనపు పరకామణి ప్రాంతంలో సంప్రోక్షణ కోసం యాగశాలలను సిద్ధం చేశారు. శ్రీవారి మూలవర్లకు 5, ద్వారపాలకులకు 1, విమాన వేంకటేశ్వర స్వామికి 1, శ్రీగరుడాళ్వార్‌కు, ఆలయ గోపురానికి కలిపి 2, శ్రీ వరదరాజస్వామి, ఆలయ గోపురానికి కలిపి 2, అన్నప్రసాద పోటు తాయారీకి 1, పడిపోటు తయారీకి 1, శ్రీ విష్వక్సేనుల వారికి 1, భాష్యకార్లకు 1, శ్రీ యోగనరసింహస్వామి వారికి, ఆలయ గోపురానికి కలిపి 2, రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణస్వామి వారికి 1, శ్రీ బేడి ఆంజనేయస్వామి వారు, ఆలయ గోపురానికి కలిపి 2, ఇతర వాస్తు హోమగుండాలు కలిపి మొత్తం 28 హోమగుండాలను ఏర్పాటుచేశారు.
ఘనంగా సేనాపతుల ఉత్సవం
ఆలయ ప్రధానార్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు ఆలయంలోని శ్రీ విష్వక్సేనుల వారికి హారతి ఇచ్చి ఆలయ ప్రదక్షిణగా వసంత మండపానికి చేరుకున్నారు. రాత్రి 7 గంటల నుండి ప్రారంభమైన సేనా«పతుల ఉత్సవం 9 గంటలకు ముగిసింది. ఈ సందర్భంగా శ్రీ విష్వక్సేనుల వారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం వసంత మండపం వద్ద మేదిని పూజ నిర్వహించారు. అక్కడ పుట్ట మన్ను సేకరించి తిరిగి ఆలయానికి చేరుకున్నారు. యాగశాలలోని పాలికల్లో నవధాన్యా లు పోసి శాస్త్రోక్తంగా అంకురార్పణ చేపట్టారు.
రుత్విక్ వరణం
ఆలయంలో శనివారం ఉదయం రుత్విక్ వరణం జరిగింది. 44 మంది రుత్వికులు, 16 మంది సహాయకులు, ఇతర వేదపారాయణ దారులు శ్రీవారి ఆజ్ఞ తీసుకున్నారు. అనంతరం ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాలదీక్షితులు రుత్వికులకు యాగగుండాల వద్ద స్థానాలను నిర్దేశించారు. ఈ సందర్భంగా స్వామివారు ఆశీర్వదించిన దీక్షా వస్త్రాలను రుత్వికులకు అందజేశారు. ఐదు రోజుల పాటు జరిగే యాగశాల కార్యక్రమాల్లో ఈ దీక్షా వస్త్రాలను రుత్వికులు ధరించనున్నారు. కాగా, ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, తిరుమల జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు, ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాలదీక్షితులు, ఓఎస్‌డీ పాల శేషాద్రి, ఆలయ డెప్యూటీ ఈవో హరీంద్రనాథ్, బొక్కసం సూపరింటెండెంట్ గురురాజారావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment